విచార‌ణ అర్హ‌త‌ లేని పిటిష‌న్‌తో తెలంగాణ‌కు అన్యాయం

– పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు స్టే తెచ్చిన ఏపీ
– సివిల్ సూట్ దాఖ‌లు చేస్తామ‌న‌డం అన్యాయం
– ఏపీకి స‌హ‌క‌రిస్తున్న రేవంత్ ప్ర‌భుత్వం
– మాజీ మంత్రి హ‌రీష్‌రావు ఆగ్ర‌హం

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 12: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో రైతులతో రిట్ వేయించి మరీ ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుకు స్టే సాధిస్తే ఇక్కడి చేతగాని కాంగ్రెస్ సర్కారు మాత్రం ఉద్దేశపూర్వకంగానే విచారణ అర్హత లేని పిటిషన్ వేసి తెలంగాణకు తీరని అన్యాయం చేసింద‌ని మాజీ మంత్రి హ‌రీష్‌రావు ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఈ మాత్రం విషయం మీ న్యాయవాది, మీ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకి తెలియదా? ఈ మాత్రం దానికి నీళ్ల మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి  సూటు బూటు వేసుకొని ఢిల్లీ దాకా వెళ్లాలా? ముఖ్యమంత్రిగా ఉంటూ మన నీటి హక్కులను ఏపీకి ధారాదత్తం చేస్తూ రేవంత్ రెడ్డి తెలంగాణకు చేస్తున్న చారిత్రక ద్రోహం ఇది. రిట్ ఉపసంహరించుకొని, సివిల్ సూట్ ఫైల్ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పడ‌మంటే పోలవరం -నల్లమల సాగర్ ప్రాజెక్టు కట్టుకోవడానికి ఏపీకి గడువు ఇవ్వడమే. ఏపీ, తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక వాదనలు కూడా వినడం అనేది ఏండ్లు గడిచినా ముగియని కథే. ఈలోగా ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు పనులు పూర్తి చేసుకొని, తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తూ అప్పనంగా నీళ్లను తరలించుకుపోతుంది అన్నారు.

సంక్రాంతి పండగ వేళ చంద్రబాబుకు రేవంత్ గిఫ్ట్

సంక్రాంతి పండగ వేళ రేవంత్ చంద్రబాబుకు ఇచ్చిన గిఫ్ట్.. సుప్రీం కోర్టులో వేసిన ఈ బలహీనమైన రిట్‌. పోలవరం-నల్లమల సాగర్ విషయంలో ముందు నుంచి రేవంత్ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం ఏపీకి పూర్తిగా సహకరిస్తున్నది. పోనుపోను అనుకుంటూనే రేవంత్ రెడ్డి ఆనాడు డిల్లీ మీటింగ్ కు వెళ్ళాడు. ఎజెండాలో లేదంటూనే బనకచర్లపై చర్చ జరిపాడు. పెట్టబోను అంటూనే సంతకం పెట్టి తెలంగాణ నదీ జలాలకు మరణశాసనం రాశాడు. వేయను అంటూనే కమిటీ వేసి ఏపీ జల దోపిడీకి రెడ్ కార్పెట్ వేశాడు. టెండర్ చివరి తేదీ అయిపోయాక సుప్రీం కోర్టు కు వెళ్ళి పస లేని రిట్ వేసి పరిపూర్ణంగా నల్లమల సాగర్ కు మద్దతు ప్రకటించాడు. మేం నిలదీస్తే బనకచర్లను అడ్డుకుంటాం, సుప్రీంకోర్టుకు వెళ్తాం అని నమ్మ బలికిన రేవంత్ రెడ్డి నేడు కావాలనే బలహీనమైన పిటిషన్ వేసి తెలంగాణకు మోసం చేశాడు. పంచాయితీలు వద్దు..న్యాయస్థానాలు వద్దు.. మనమే కూర్చొని చర్చించుకుందాం అన్న రేవంత్ రెడ్డి మాటల అంతర్యం ఏమిటి? తెలంగాణ నీటి హక్కులను గంపగుత్తగా ఏపీకి అప్ప చెప్పడమేనా మీ చర్చల లక్ష్యమ‌ని ప్ర‌శ్నించారు. తెలంగాణలోని కృష్ణా, గోదావరి నదులపై చంద్రబాబు, ఆంధ్రా ప్రభుత్వం అడ్డుకోని ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా? అలాంటి చంద్రబాబుతో దోస్తీ కట్టి, తెలంగాణకు తీరని అన్యాయం చేసేందుకు సిద్ధమైన రేవంత్ రెడ్డీ.. నిన్ను తెలంగాణ సమాజం క్షమించదు. నీ గురుదక్షిణ కోసం తెలంగాణకు ద్రోహం చేస్తుంటే తెలంగాణను సాధించిన బిఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. నీ దుర్మార్గాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. తెలంగాణ నీటి హక్కుల కోసం పోరు చేస్తాం.
—————————————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *