సీసీఐ, ఎస్‌ఐఐఎల్‌ పునరుద్ధరణకు చొరవ చూపండి

కేంద్ర మంత్రికి రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు విజ్ఞప్తి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 9: తెలంగాణలో మూతపడిన రెండు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల పునరుద్ధరణకు చొరవ చూపాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్‌.డి.కుమారస్వామికి విజ్ఞప్తి చేశారు. దిల్లీలో కేంద్ర మంత్రిని బుధవారం కలిసిన ఆయన ఆ మేరకు వినతిపత్రం సమర్పించారు. పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన ద్వారా జాతీయ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)కి గణనీయంగా దోహదపడాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పంమని, ఈ లక్ష్య సాధనలో భాగంగా తెలంగాణలో మూతపడిన పరిశ్రమల పునరుద్ధరణపై దృష్టి సారించామని చెప్పారు. పెద్దపల్లిలోని రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎఫ్‌సీఎల్‌) విజయవంతంగా నడుస్తోందని, ఇదే మాదిరిగా ఆదిలాబాద్‌ జిల్లాలోని సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ), భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలోని స్పాంజ్‌ ఐరన్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎస్‌ఐఐఎల్‌)ను పునరుద్ధరిస్తే తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు, పారిశ్రామికాభివృద్ధికి మేలు జరుగుతుందని శ్రీధర్‌బాబు వివరించారు. స్థానిక ప్రజలకు ఉపాధి లభిస్తుందని, ఆ దిశగా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. తమ విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని శ్రీధర్‌బాబు తెలిపారు. ఆ రెండు పరిశ్రమల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *