వేగంగా అంగన్ వాడీ భవనాల నిర్మాణాలు
-లోపం జరిగితే సహించేది లేదు
– మహిళా శిశు సంక్షేమంలో ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ
-డీడబ్ల్యూఓలతో సమీక్షా సమావేశంలో మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27: ఆంగన్‌వాడీ భవనాల నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. 2199 అంగన్వాడి భవనాలు మంజూరు చేస్తే ఇప్పటివరకు కేవలం 500 భవనాలే పూర్తయ్యాయని.. మిగిలిన భవనాలను త్వరలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రారంభించిన నిర్మాణాలు సకాలంలో పూర్తయ్యేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా లోపం లేదా నిర్లక్ష్యం జరిగినా ఉపేక్షించబోమన్నారు. మధుర్‌నగర్‌లోని మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖపై జిల్లా డీడబ్ల్యూఓలతో మంత్రి సీతక్క శుక్రవారం సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో టీజీ ఫుడ్స్ చైర్మన్ ఫహీం, మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా, టీజీ ఫుడ్స్ ఎండి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో బడ్జెట్ కేటాయింపులు, చేసిన ఖర్చులు, అమలవుతున్న పథకాలు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేయబోయే పథకాలు, అంగన్వాడి భవనాల నిర్మాణం, అంగన్వాడి కేంద్రాలకు ఉచిత విద్య సరఫరా, అంగన్వాడీ కేంద్రాల కు హాజరు శాతం, ప్రీస్కూల్ యాక్టివిటీ, మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య తదితర అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాక్ష్యం అంగన్వాడి కింద రాష్ట్రంలోని ఆంగన్‌వాడీ కేంద్రాల్లో పోషకాహారం, ప్రీ-స్కూల్ విద్య, పరిశుభ్రమైన, సానుకూల వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామ్నారు. “మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ‘అమ్మ మాట అంగన్వాడి బాట’ అనే నినాదంతో కార్యక్రమాలు ప్రారంభించాం. దీని ఫలితంగా అంగన్వాడి కేంద్రాలకు చిన్నారుల హాజరు శాతం గణనీయంగా పెరిగింది” అని పేర్కొన్నారు.
Anganwadi Breakfast Scheme : త్వరలో అంగన్‌వాడీల్లో అల్పాహారం
తెలంగాణను పోషక లోప రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రత్యేక పోషకాహార కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ చిన్నారులకు బ్రేక్ ఫాస్ట్ స్కీమును ప్రారంభిస్తామని తెలిపారు. ములుగు జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద అంగన్ వాడి చిన్నారులకు రోజుకు 100 ఎంఎల్ విజయ పాలు సరఫరా చేస్తున్నామని చెప్పారు. కౌమార బాలికల్లో రక్తహీనత తగ్గించేందుకు ఆదివాసీలు అధికంగా ఉన్న మూడు జిల్లాల్లో పల్లి, చిరుధాన్యాల చిక్కిలను అందిస్తున్నామని తెలిపారు. ఈ రెండు కార్యక్రమాలు సానుకూల ఫలితాలు ఇస్తున్నాయని, రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అంశంపై సమగ్ర నివేదికను అధికారులు సమర్పించాలని ఆదేశించారు. అంగన్వాడి కేంద్రాలు లేనిచోట, మొబైల్ అంగన్ వాడి సేవలను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. మిషన్ వాత్సల్య కింద బాలల రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని, మిషన్ శక్తి ద్వారా మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తెలిపారు.
అమ్మాయిల భద్రత విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. బాల్య వివాహాలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. జిల్లాల వారీగా ప్రత్యేక డ్రైవ్‌లు కొనసాగుతున్నాయని, వాటి వేగాన్ని మరింత పెంచాలని అధికారులను ఆదేశించారు.మహిళల గౌరవం, పిల్లల ఆరోగ్యం, భద్రత, విద్యలపై ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. తెలంగాణను మహిళలు, పిల్లల సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా నిలబెట్టేందుకు నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.





