– మహనీయుల చరిత్రలను తెలియచేయండి
– సుభాష్ చంద్రబోస్ విగ్రహావిష్కరణలో ఎంపీ ఈటల
హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 18: పిల్లలకు వారసత్వంగా ఆస్తులు కాకుండా విలువలు, సంప్రదాయాలు, దేశభక్తిని నేర్పించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సూచించారు. కన్నవారిని, కన్నపిల్లలను, జీవిత భాగస్వామిని చంపుకుంటున్న ఘటనలు కలచివేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మన విలువలే మనల్ని ఇలాంటి దురాగతాల నుంచి కాపాడతాయన్నారు. ఉప్పల్ నియోజకవర్గం కాప్రాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని రాజేందర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో తమ ఆత్మగౌరవం కోసం ఎమ్మెల్యే పదవిని గడ్డిపోచలా వదిలివేశామని ఈటల అన్నారు. ఆత్మగౌరవం కోల్పోయి వచ్చే ఏ పదవి అయినా విలువలేనిదని స్పష్టం చేశారు. స్వయంపాలన కోసమే తాము 20 ఏళ్లలో ఆరుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచామని గుర్తు చేసుకున్నారు. మహనీయుల విగ్రహాలను స్థాపించడం, జయంతులు, వర్ధంతులు చేసుకోవడం దండ వేయడానికి మాత్రమే కాదని, వారి చరిత్రను భావితరాలకు అందించడం కోసమని ఈటల అన్నారు. తెలంగాణ ప్రజల రక్త తర్పణాన్ని గుర్తుచేస్తూ భారత స్వాతంత్య్రం కోసం లక్షల మంది చేసిన పోరాటాలను, త్యాగాలను కొనియాడారు. నేతాజీ గురించి మాట్లాడుతూ ఆయన గొప్ప మేధావి అని, తన ప్రాణం భారత జాతి విముక్తి కోసమేనని పోరాడారని ప్రశంసించారు. భారతదేశంలో సాధ్యం కాకపోవడంతో వేరే దేశానికి వెళ్లి ఆజాద్ హింద్ ఫౌజ్‌స్థాపించి దేశం కోసం ప్రాణాలు అర్పించారని కొనియాడారు. నేటి తరానికి స్వాతంత్య్ర వేడుకల ప్రాముఖ్యత తెలియడం లేదని, వారు పుస్తకాలు చదవక, చరిత్రను తెలుసుకోలేకపోతున్నారని ఈటల విచారం వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





