– 2030 నాటికి ఈవీ బ్యాటరీలకు మూడు రెట్లు డిమాండ్
– బొగ్గురంగంలో రికార్డులు తిరగరాశాం
– అర్జెంటీనాలు లీథియం వెలికితీత
-మైన్స్ చట్టంలో మార్పులు
– కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16: క్రిటికల్ మినరల్స్ రంగంలో మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం వున్నదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. 2030 నాటికి ఈవీ బ్యాటరీలకు, పునరుత్పాదక శక్తి సాంకేతికతకు మూడు రెట్లు డిమాండ్ పెరుగుతుందని అంచనా. దీంతో క్రిటికల్ మినరల్స్ అవసరం మరింతగా పెరగనుండటంతో ఈరంగంలో మరిన్ని పరిశోధనలు జరగాలన్నారు. మంగళవారం గచ్చిబౌలిలోని టీ-హబ్‌లో కేంద్ర గనుల శాఖ ఆధ్వర్యంలో.. నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ సెమినార్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఇటీవల ఎగుమతులపై ఆంక్షలు, అంతర్జాతీయంగా ఏర్పడిన రాజకీయ సంక్షోభ పరిస్థితుల కారణంగా ఉత్పత్తుల సరఫరాలో ఇబ్బందుల నేపథ్యంలో స్వదేశీ పరిజ్ఞానం ప్రాముఖ్యత పెరిగిందన్నారు. ఇందులో భాగంగా నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కింద ఇప్పటికే దేశంలో 4 ఐఐటీలు, 3 రీసెర్చ్ ల్యాబొరేటరీలను సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ లుగా తీర్చిదిద్దామన్నారు. 2047 నాటికి భారతదేశం ఆత్మ నిర్భరత దేశంగా రూపుదిద్దుకొని ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడంలో క్రిటికల్ మినరల్స్ కీలక పాత్ర పోషించనున్నాయన్నారు. ఇవాళ, క్రిటికల్ మినరల్స్‌కు సంబంధించి 6వ విడత వేలం ప్రక్రియ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. మొత్తం 23 బ్లాకులకు సంబంధించి ఈ ప్రక్రియ చేపట్టాం. ఈ వేలం ప్రక్రియలో తెలంగాణ, పంజాబ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తొలిసారిగా పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. క్రిటికల్ మినరల్ మిషన్‌ను ప్రారంభించుకున్న కొద్ది నెలల్లోనే కార్యాచరణ మొదలుపెట్టడం చూసి, అనేకమంది ఆశ్యర్యపోతున్నారు. రీసైక్లింగ్ ను బలోపేతం చేసేందుకు ఇటీవల రూ.1500 కోట్లతో ప్రారంభించిన సరికొత్త పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఈ స్కీం ద్వారా క్రిటికల్ మినరల్స్ ను ఉత్పత్తి చేసేందుకు దోహదపడటమే కాకుండా, రూ.8 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయి. యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా 70 వేల ఉద్యోగావకాశాలు కలుగుతాయన్నారు.
గత కొన్నేళ్లలో బొగ్గు, గనుల రంగంలో అనేక రికార్డులను తిరగరాశామన్నారు. చరిత్రలోనే తొలిసారిగా బొగ్గు ఉత్పత్తి, రవాణాలో 1 బిలియన్ టన్నుల లక్ష్యాన్ని చేధించడం సంతోషంగా ఉందన్నారు. అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ పై ప్రస్తుతం దృష్టి కేంద్రీకరిస్తున్నామన్నారు. త్వరలోనే దీనికి సంబంధించి తొలి బ్లాక్ వేలం వేయనున్నామన్నారు. ఆఫ్ షోర్ మినరల్ బ్లాక్స్ కు సంబంధించి తొలిసారి వేలం ప్రక్రియ చేపట్టాం. ఖనిజాల వెలికితీతలో ప్రైవేటు రంగం భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు, ఎక్స్ ప్లొరేషన్ వేగవంతం చేసేందుకు తొలిసారిగా ఎక్స్ ప్లొరేషన్ లైసెన్స్ బ్లాక్స్ వేలం ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేశామన్నారు. డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్స్ ప్రారంభించి పదేళ్లు గడుస్తున్నాయి. గనుల తవ్వకాల ద్వారా వచ్చే నిధుల నుంచి కార్మికులు, స్థానికులు లబ్ధి పొందాలి. వారందరికీ గౌరవంతో పాటు భద్రత కలిగించేందుకు బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికుల అమూల్యమైన సేవలకు గుర్తింపుగా రూ.1 కోటి వరకు బీమా కవరేజీ అందిస్తున్నామన్నారు. మైన్స్, మినరల్స్ అభివృద్ధి, నియంత్రణ చట్టంలో పలు సవరణలు చేసి మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చాం. ఈ సవరణల ద్వారా లిథియం, కోబాల్ట్, నికెల్ వంటి డీప్ సీటెడ్ మినరల్స్ ను మైనింగ్ చేసే అవకాశం వచ్చింది. నేషనల్ ఎక్స్‌ప్లొరేషన్ ట్రస్ట్ ద్వారా విదేశాల్లో మైనింగ్ కార్యకలాపాలు చేపట్టేందుకు నిధులను సమకూర్చుకోవచ్చునన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగం సంస్థ కాబిల్ ఇప్పటికే అర్జెంటీనాలో లీథియం బ్లాకులను సొంతం చేసుకుని, వెలికితీత ప్రారంభించింది. జాంబియా, చిలీలో కూడా గనులను సొంతం చేసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయి. అలాగే క్రిటికల్ మినరల్స్ వెలికితీతకు సంబంధించి నాలెడ్జ్ పంచుకునేందుకు జపాన్, పెరూ వంటి దేశాలతో భారత్ అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంటున్నామన్నారు. ఐఐటీల్లాంటి అంతర్జాతీయ స్థాయి సంస్థలు మన దగ్గర ఉండబట్టే క్రిటికల్ మినరల్స్ కోసం సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ లను ఏర్పాటు చేసుకుని, పరిశోధనా రంగంలో ప్రపంచ దేశాలతో పోటీ పడగలుగుతున్నామన్నారు. 2025 క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ జాబితాలో మన దేశానికి చెందిన 46 సంస్థలు చోటు దక్కించుకున్నాయి. 2015లో 11 సంస్థలు మాత్రమే ఆ జాబితాలో ఉన్నాయి. 2014 నుంచి 2025 నాటికి ఐఐటీల సంఖ్య 16 నుంచి 23కు పెరగడమే కాకుండా, వాటిల్లో సీట్లు కూడా 65 వేల నుంచి 1.35 లక్షలకు పెరిగాయి. చంద్రుడి దక్షిణ ధృవంపై మనం అడుగుపెట్టాం. ఒకే మిషన్ లో 103 శాటిలైట్లను ప్రయోగించిన ఘనత సాధించాం. ఇలా గొప్ప గొప్ప విజయాలు సాధించాలనే పట్టుదలతో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ లు శ్రమించాలి. అప్పుడే మన దేశంలో క్రిటికల్ మినరల్స్ అవసరాలను తీర్చడం కుదురుతుందన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





