- గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం
- పరేడ్ గ్రౌండ్ లో గణతంత్ర వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 26 :. డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకొని 76వ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా తెలంగాణలో నాలుగు నూతన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం సంతోషంగాఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండా ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డితో సీఎస్ శాంతి కుమారి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ..నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ స్ఫూర్తితో ప్రజా ఆశీర్వాదంతో తెలంగాణ ముఖ్యమంత్రిగా 13 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రజలకిచ్చిన గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు.
ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా రైతు భరోసా. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. దళితులు గిరిజనులు ఆదివాసీలు. బలహీన వర్గాలు మైనారిటీలు మహిళలు. నిరుపేదలందరినీ కూడా ఆదుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఎంతో మంది పేదలు, సంవత్సరాల కొద్ది నూతన రేషన్ కార్డుల కోసం ఎదురుచూశారు. రైతు కూలీలు మాకు భరోసా గా ఉండడం ద్వారా మేము కొంత ఆర్థిక ప్రయోజనం పొందాలి అని మా దృష్టికి తీసుకురావడంతో ఈరోజు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నూతన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం.. రైతు భరోసాలో ఏడాదికి రూ.12వేలు ఈ రోజు రైతుల ఖాతాలో వేయనున్నాం. నాడు ఆకాశమే హద్దుగా 2004 నుంచి 2014 వరకు ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇళ్లు అందించాం.
మళ్లీ పదేళ్ల తర్వాత పేదల కళ్లల్లో వెలుగు చూడడానికి ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తున్నామని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలను, నిరుపేదలను, దళితులను, గిరిజనులను, ఆదివాసీలను, బలహీన వర్గాలను, మైనారిటీలను, మహిళలను. సంక్షేమ పథం వైపు నడిపించడమే కాకుండా మొదటి సంవత్సరంలోనే 50,153 ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వడం ద్వారా తెలంగాణలో ఉన్న లక్షలాది నిరుద్యోగ యువకులకు ఒక ఆనందాన్ని అందించామని చెప్పారు. విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, ఉద్యమకారులను ఆదుకోవడమే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి ఒక రాష్ట్ర గీతాన్ని, అదే విధంగా తెలంగాణ ప్రజలకు ఒక తెలంగాణ తల్లిని మనం అందించుకున్నామని సీఎం తెలిపారు. . ఇంత మంచి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తూ మీరు అండగా నిలబడ్డందుకు మీకందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.





