– మార్చి ఆఖరుకు రామస్వామి గుట్ట మోడల్ కాలనీ పూర్తి
– రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి
సూర్యాపేట, ప్రజాతంత్ర, జనవరి 7: ఏప్రిల్‌లో మరో విడత, రానున్న రెండేళ్లలో రెండు విడతల్లో రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పేదవాడికి పూర్తి భద్రత, భరోసా, ధైర్యాన్ని ఇచ్చేదే ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమమని అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గ కేంద్రం సమీపంలో రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న 2,160 ఇందిరమ్మ ఇళ్ల కాలనీలో గృహ నిర్మాణాలను బుధవారం సహచర మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో కలిసి తనిఖీ చేసి మార్చి 31లోగా పూర్తిచేస్తామని, మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి విడత రూ.22,500 కోట్లతో ప్రతి నియోజకవర్గంలో 3,500 చొప్పున 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని తెలిపారు. ఇటీవల అసెంబ్లీలో తమ ఎమ్మెల్యేలతోపాటు, ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కూడా మరిన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, గతంలో గృహ జ్యోతి పథకం కింద మంజూరు చేసిన ఇండ్లను పూర్తి చేయాలని కోరారని, వాటిని కూడా మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. బహు పేదల నుండి దరఖాస్తులు తీసుకొని సంక్రాంతిలోపు లేదా నెలాఖరు నాటికి లబ్ధిదారులను గుర్తించి తుది జాబితా రూపొందించాలని, మార్చి 31లోపు రామస్వామి గుట్ట వద్ద మోడల్ కాలనీలో వారికి ఇల్లు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. కాలనీలో నిర్మాణాలపై రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి గౌతమ్, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, గృహ నిర్మాణ శాఖ అధికారులు, కాంట్రాక్టర్‌తో మంత్రి సమీక్షంచారు. ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించి ఎప్పటికప్పుడు పురోగతిని సమీక్షించి నిర్దేశించిన సమయంలోగా ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్‌ను ఆదేశించారు. మిగిలిపోయిన పనుల పూర్తికి అవసరమైన అంచనాలను రూపొందించి పంపిస్తే ఈ నెల 15లోగా అనుమతులు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు.
2012లో ఈ కాలనీ మంజూరు చేయించా: మంత్రి ఉత్తమ్ కుమార్
ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ 2012లో తాను గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో హుజూర్‌నగర్ హౌసింగ్ కాలనీని మంజూరు చేయించానని, గత ప్రభుత్వం పూర్తిగా పనులు నిలిపివేసిందని, తాము అధికారంలోకి వచ్చాక యుద్ధప్రాతిపదికన, ప్రాధాన్య పథకాల కింద గృహ నిర్మాణాలను చేపట్టామని చెప్పారు. హుజూర్‌నగర్ కాలనీ ఏ రాష్ట్రంలో చేపట్టని విధంగా నిరుపేదలకు మోడల్ హౌసింగ్ కాలనీగా నిలుస్తుందని తెలిపారు. నిరుపేదలు, ఇండ్లు లేని వారు, నూటికి నూరు శాతం అర్హత ఉన్న వారికే ఇండ్లను ఇచ్చేలా నియమ నిబంధనల ప్రకారం దరఖాస్థులు తీసుకోవాలని ఆయన కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ కాలనీలో పాఠశాల, అంగన్‌వాడి, హెల్త్ సెంటర్, కమ్యూనిటీ హాల్, ప్లే గ్రౌండ్ వంటి మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తామన్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మరెడ్డి, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి గౌతం, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, ఎస్పీ నరసింహ, జిల్లా గృహ నిర్మాణ శాఖ పిడి సిద్దార్థ్, ఆర్డీవో శ్రీనివాసులు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





