– గ్రామాల్లో స్ధలాలు గుర్తిస్తే ఇండ్ల కోసం ఇస్తాం
– రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 3: రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు నిరంతర ప్రక్రియగా జరుగుతుందని, ఇప్పటికే ఒక విడత ఇండ్లు మంజూరు చేశామని, మరో మూడు విడతలుగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వంలాగా ఎన్నికలప్పుడే ఇండ్ల గురించి హామీలు ఇవ్వకుండా తాము చిత్తశుద్దితో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. పేదవాని ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ప్రతి సంవత్సరం మార్చి- ఏప్రిల్ లో ఇండ్లను మంజూరు చేస్తామన్నారు. శాసనసభలో పలువురు సభ్యులు శనివారం అడిగిన ప్రశ్నలకు మంత్రి పొంగులేటి సమాధానాలు ఇచ్చారు. ఇప్పటికే తొలి విడతగా మంజూరు చేసిన 4.50 లక్షల ఇండ్లలో సుమారు 3 లక్షల ఇండ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని, సుమారు 52వేల ఇండ్లు గృహ ప్రవేశానికి సిద్దంగా ఉన్నాయని తెలిపారు. వచ్చే వర్షాకాలంలోగా తొలివిడత మంజూరైన ఇండ్ల నిర్మాణం పూర్తవుతుందన్నారు. మరో మూడు విడతలుగా రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు జరుగుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించి అసంపూర్తిగా వదిలేసి, ఆర్ధిక సాయం అందించని ఇండ్లకు తమ ప్రభుత్వం రూ.204 కోట్లు విడుదల చేసిందని, రాష్ట్రంలోని 133 కాలనీల్లో 36వేల ఇండ్లు మొండి గోడలతో మిగిలిపోయి మౌలిక సదుపాయాలకు నోచుకోలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి సూచనల మేరకు రూ.744 కోట్లతో పౌర సదుపాయాలు కల్పించామని తెలిపారు. కొన్ని 2 బిహెచ్‌కే ఇండ్లను నిర్మించి ఎవరికీ కేటాయించలేదని, అసంపూర్తి ఇండ్ల కోసం రూ.455 కోట్లు మంజూరు చేశామని, వీటిని కూడా అర్హులకు అందజేస్తామని వెల్లడించారు. 2బిహెచ్‌కే ఇండ్లకు సంబంధించి అర్హులకు పార్టీ ప్రమేయం లేకుండా మంజూరు చేస్తామని, అసంపూర్తి ఇండ్ల పూర్తి కోసం నిధుల మంజూరుకు ఇప్పటికే కేబినెట్ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుందని, అర్బన్ పాలసీ మేరకు త్వరలో లబ్దిదారుల ఎంపిక జరుగుతుందని వెల్లడించారు. 2014లో రాష్ట్రంలో రూ.3లక్షల ఖర్చు కాగల ఇండ్లను అప్పటి ప్రభుత్వం మంజూరు చేసి నిధులు విడుదల చేయలేదని. సుమారు 12 వేల ఇండ్లను పునాదుల స్ధాయిలోనే వదిలేసినందున వీటిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. ఈ పథకం కింద లబ్దిదారులకు అప్పటివరకు జరిగిన చెల్లింపులు మినహా మిగిలిన మొత్తాన్ని ఇస్తామని, అర్హులను గుర్తించి అందజేస్తామని తెలిపారు. ఉమ్మడి జిల్లాల పరిధిలో ఇండ్ల సమస్యలపై ప్రజాప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఎల్-1, ఎల్-2, ఎల్-3 వారీగా గుర్తిస్తామని, రాష్ట్రంలో ఇప్పటికే 20 లక్షల మందిని గుర్తించామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సిద్దంగా లభ్యమయ్యే స్ధలాలను గుర్తిస్తే వాటిని నిరుపేదలకు ఇండ్ల స్ధలాలుగా మంజూరు చేస్తామన్నారు. కొన్ని ప్రాంతాల్లో 400-600 చదరపు అడుగుల పరిమితికి మించి ఇండ్లు నిర్మించుకున్నవారికి మినహాయింపు ఇస్తామని, గిరిజన ప్రాంతాల్లో అటవీ శాఖతో సమస్యలు రాకుండా స్ధలాల మంజూరు, ఇండ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. సింగరేణి ప్రాంతంలో ఇండ్ల పట్టాల పెండింగ్ సమస్యను కూడా కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆర్దిక ఒడుదుడుకులు ఉన్నా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



