పట్టణ పేదలకూ ఇందిరమ్మ ఇండ్లు

– నిబంధనల సడలింపుతో ప్రయోజనం
– ప్రజల కోసం పాటుపడ్డ నేత పీజేఆర్‌
– నవీన్‌ గెలుపు కోసం మంత్రి పొంగులేటి పాదయాత్ర
– మంత్రి సమక్షంలో బీఆర్‌ఎస్‌ నుంచి 300మంది చేరిక

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వడమే ఈ ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో నాలుగు లక్షలకు పైగా ఇండ్లు మంజూరు చేశామని, ఇందులో మూడు లక్షలకు పైగా ఇండ్లు వివిధ నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. జూబ్లీహిల్స్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెహమత్‌ నగర్‌ డివిజన్‌లోని కార్మిక నగర్‌లో మంత్రి పొంగులేటి బుధవారం తమ అభ్యర్ది నవీన్‌ యాదవ్‌కు మద్దతుగా పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సమక్షంలో దాదాపు 300 మంది బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. రెహ్మత్‌ నగర్‌ డివిజన్‌కు కాంగ్రెస్‌ ఇన్‌చార్జిగా నియమితులైన రెండవ రోజునే మంత్రి పొంగులేటి ఓవైపు వర్షం పడుతున్నా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లోని పేదలకు ప్రయోజనం కలిగేలా ఇందిరమ్మ ఇండ్ల నిబంధనలను సడలించామని తెలిపారు, గత పదేళ్లుగా పేదల కోసం ఒక్క చిన్న ఇల్లు కూడా కట్టని కేసీఆర్‌ కమీషన్లపై ఆశతో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాష్ట్రాభివృద్ది కోసం అహర్నిశలూ కష్టపడుతున్నారన్నారు. గతంలో ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌ నేత జనార్ధనరెడ్డి పేదల కోసం కృషి చేశారని గుర్తు చేశారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలోని అర్హులైన పేదలందరికీ పట్టాలిచ్చి ఇండ్లు కట్టిస్తామని ప్రకటించారు. అంతేగాక గత ప్రభుత్వ హయాం నుంచి అసంపూర్తిగా ఉండిపోయిన రెండు పడక గదుల ఇండ్లను పూర్తి చేసి పేదలకు ఇస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. రాష్ట్రంలోనూ, జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది పనులు చూసి బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 300 మందికి ప్రాతినిథ్యం వహిస్తున్న చేపల కృష్ణ, ఆనందరావు, ఫిలిం ఫెడరేషన్‌ నాయకుడు బసాడ కృష్ణ, లక్ష్మి తదితరులకు మంత్రి కాంగ్రెస్‌ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి నృత్యాలు, బాణసంచాతో మంత్రి పొంగులేటికి స్వాగతం పలికారు. కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్ధానిక కౌన్సిలర్‌ సీఎన్‌.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *