– జోరుగా సాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు
– ప్రస్తుత వారంలోనే రూ.188 కోట్లు విడుదల
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబరు 24 : ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా లబ్ధిదారులకు రూ.1612.37 కోట్లను ప్రభుత్వం విడుదల చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వి.పి.గౌతం తెలిపారు. అర్హులైన పేదలందరికీ సొంత ఇంటి వసతి కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తున్నదని, ఈ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.12 లక్షల ఇళ్ల పనులు ప్రారంభం కాగా, ఇంతవరకు లక్షా యాభై వేలకు పైగా ఇళ్లకు చెల్లింపులు చేసినట్లు ఆయన బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటి నిర్మాణపు పనుల దశలనుబట్టి లబ్ధిదారులకు విడతల వారీగా మొత్తం రూ.5 లక్షలను వారి ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నామని వివరించారు. లబ్దిదారుల్లో ఎవరికైనా బిల్లు మొత్తం జమ కానిపక్షంలో వారు తమ అకౌంట్ ఉన్న బ్యాంకుకు వెళ్లి ఆధార్ నెంబర్‌ను ఖాతాకు అనుసంధానించుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 వేల పైచిలుకు గ్రామాలు, సుమారు నాలుగు వేల మున్సిపల్ వార్డుల్లో ఇందిరమ్మ ఇండ్ల పనులు జోరుగా సాగుతున్నాయని, అనేక ప్రాంతాల్లో నిత్యం ఇండ్ల గృహ ప్రవేశ కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు. పూర్తి పారదర్శకమైన విధానంతో అధునాతన టెక్నాలజీని వినియోగిస్తూ ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా డబ్బులు జమ చేస్తున్నామన్నారు. అందులో భాగంగా ఈ వారంలోనే (24వ తేదీ నాటికి) రికార్డు స్థాయిలో 17 వేల ఇండ్ల పురోగతికి సంబంధించిన బిల్లుల నిమిత్తం రూ.188.35 కోట్లను లబ్ధిదారులకు విడుదల చేసినట్లు గౌతం తెలిపారు.
ఇంతవరకు విడుదల చేసిన బిల్లుల వివరాలు
బేస్‌మెంట్‌స్థాయిలో రూ.1210.76 కోట్లు (1,21,076 ఇండ్లకు), రూఫ్ లెవల్ (గోడలు పూర్తి)కు రూ.252.64 కోట్లు (25,264 ఇండ్లకు), రూఫ్ కాస్టెడ్ (శ్లాబ్ పూర్తి)కు రూ.155.44 కోట్లు (7,772 ఇండ్లకు) విడుదల చేశామన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





