– ఏప్రిల్లో మరో విడత ఇళ్ల మంజూరు
– మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6: అర్హులైన ప్రతి పేద వారికి సొంత ఇంటి కల నెరవేర్చేలా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర,సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో మూసాపేట మండల కేంద్రంలో ఉప్పరిపల్లి ప్రమీల ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో మంత్రులు శనివారం పాల్గొని శిలా ఫలకం ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభ లో ఆయన మాట్లాడుతూ సొంత ఇంటి నిర్మాణం పేదోడి ఆత్మ గౌరవం, భరోసా, ధైర్యం అన్నారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పేదవారి సొంత ఇంటి కోరికను నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో 3,500 ఇండ్లు మంజూరు చేసినట్లు, 1,900 ఇండ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నట్లు,100 నుండి 120 ఇండ్లు పూర్తి కావచ్చినట్లు వెల్లడించారు. ఇండ్లు పూర్తి చేసుకున్న మహిళలు సంతోషంగా ఉన్నారని, వారికి శుభాకాంక్షలు తెలియచేస్తున్నానని తెలిపారు. ఏప్రిల్లో రెండో విడత ఇండ్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని వీలైనంత త్వరలో మంజూరు చేస్తానని, అదేవిధంగా తహశీల్దార్ కార్యాలయ భవనాలను త్వరలో మంజూరు చేసి శంకుస్థాపనకు వస్తానని పొంగులేటి తెలిపారు .ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తమ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంకు ఆర్థిక సహాయం చేస్తున్నదని తెలిపారు. పశు సంవర్థక, మత్స్య, క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరున మంజూరు చేస్తున్నామని తెలిపారు. 72 సంవత్సరాల తర్వాత పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి సిఎం అయ్యారని, ఆయన నేతృత్వంలో జిల్లా సస్య శ్యామలం కావాలని ఆకాక్షించారు. ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ మూసాపేట మండల కేంద్రంలో 94 ఇళ్లు మంజూరు కాగా 42 పూర్తి కావచ్చాయని, అందులో ఈరోజు గృహ ప్రవేశం జరిగినట్లు తెలిపారు. మొదటి విడత ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాని వారికి రెండో విడత 1000 ఇండ్లు మంజూరు చేయాలని మంత్రి పొంగులేటికి విజ్ఞప్తి చేశారు .అలాగే బేస్మెంట్ వరకు వేసుకున్న వారికి సీఎంతో మాట్లాడి ఇంటి నిర్మాణానికి సహకారం అందించాలని కోరారు. కొత్తకోట, దేవరకద్రలో సబ్ రిజిస్టార్ కార్యాలయాలు మంజూరు చేయాలని, కొత్తకోటను రెవెన్యూ డివిజన్ చేయాలని కోరారు. మూసాపేట్, కౌకుంట్ల, అడ్డాకుల, మధనాపురంలలో మండల కాంప్లెక్స్ మంజూరు చేయాలని, కోరుట్ల, మదనాపురం, అడ్డాకులలో కూడా మండల కాంప్లెక్స్ మంజూరు చేయాలని కోరారు. దేవరకద్రలో కూడా ఏర్పాటు చేయాలని కోరారు.
జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి మాట్లాడుతూ జిల్లాలో 10,507 ఇండ్లను మంజూరు చేయగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు చొప్పున మంజూరు చేసినట్లు, అందులో 6,829 ఇండ్లు మొదలుపెట్టామని, త్వరలో మిగిలినవి కూడా మొదలుపెడతామని తెలిపారు. జిల్లాలో భూభారతి చట్టం అమలు చేస్తున్నట్లు 137 మంది జిపిఓలను నియమించినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనప కలెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, గృహ నిర్మాణ శాఖ పి.డి. వైద్యం భాస్కర్, డిఆర్ డిఓ నరసింహులు, మండల ప్రత్యేక అధికారి ఇందిర, ఆర్.డి.ఓ నవీన్, స్థానిక నాయకులు, అధికారులు, పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





