– అదేబాటలో కాంగ్రెస్ పాలకులు
– గణతంత్ర వేడుకల్లో రామచందర్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 26: రాజ్యాంగంలో కల్పించిన మౌలిక హక్కులను మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కాలరాశారని, ఇందిర, రాజీవ్ గాంధీల బాటలోనే రాహుల్ గాంధీ నడుస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు విమర్శించారు. భారతీయులకు మాత్రమే వోటు హక్కు ఉండాలని, ఇతర దేశాలకు చెందిన వారికి వోటు హక్కు ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలలో రామచందర్ రావు జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చాలామంది రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాలు చేశారని, నెహ్రూ రాజ్యాంగాన్ని పక్కకు పెట్టారని విమర్శించారు. మొదటిసారి రాజ్యాంగాన్ని అవమానించింది నెహ్రూ అని, అంబేడ్కర్‌ను అవమానించారని ఆరోపించారు. అంబేడ్కర్‌ను ఓడించిన చరిత్ర కాంగ్రెస్‌ది అంటూ విరుచుకుపడ్డారు. సీఐఆర్ పై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. గ్రామీణ ఉపాధి పథకంలో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. పేదలకు మేలు చేయాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ 60 ఏళ్లపాటు దేశాన్ని దోచుకుందని,పేదలకు మేలు చేసే పథకాలను వ్యతిరేకిస్తోందని విమర్శించారు. రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు. అంబేడ్కర్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం భారతరత్న ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. అంబేడ్కర్‌ను, రాజ్యాంగాన్ని గౌరవించింది మోదీ ప్రభుత్వమని వెల్లడించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ లు రైతులకు ఏమీ చేయలేదని, ప్రధాని కిసాన్ యోజన ద్వారా రైతులకు మోదీ మేలు చేస్తున్నారని పేర్కొన్నారు. మజ్లిస్‌తో కలిసి కాంగ్రెస్ పనిచేస్తోందని, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండు అవినీతి పార్టీలంటూ వ్యాఖ్యలు చేశారు. రెండు పార్టీలను తరిమికొట్టి బీజేపీని ఆదరించాలని రామచందర్ రావు పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో ఎంపీ లక్ష్మణ్ సహా పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.