– ఇందిరా ప్రియదర్శిని కాలేజీ విద్యార్థినులకు పిలుపు
– వారితో బతుకమ్మ ఆడిన మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20: మనందరికీ స్ఫూర్తి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ. ఆమె పేరుపై నెలకొల్పిన ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులంతా ఆమె స్ఫూర్తితో ఉన్నత శిఖరాలకు ఎదగాలి అని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆకాంక్షించారు. నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినులు శనివారం నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ఈ సంవత్సరం మొదటి రోజు బతుకమ్మ వేడుకలను ఇందిరా ప్రియదర్శిని కాలేజీలో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ మహిళల సామూహిక జీవన విధానానికి ఈ పండగ నిదర్శనమన్నారు. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా బతుకమ్మ చరిత్రను మర్చిపోవద్దని, తాత్కాలిక వైఫల్యాలతో విద్యార్థులు వెనకడుగు వేయవద్దని హితవు పలికారు. 15 సంవత్సరాలు పూర్తి అయిన అమ్మాయిల కోసం త్వరలో బాలికా సంఘాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. తన జీవనం గురించి చెబుతూ ఎన్ని కష్టాలు ఎదురైనా మంచిగా చదువుకొని ఎదగాలని, బతుకమ్మ స్ఫూర్తితో పదిమందికి ఆదర్శంగా విజయాలు అందుకోవాలని విద్యార్థినులకు పిలుపునిచ్చారు. మీ కాలేజీకి కావాల్సిన అదనపు తరగతి గదులను నిర్మించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. బతుకమ్మలను మంచిగా పేర్చిన పలువురు విద్యార్థినులను మంత్రి అభినందించి బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థినులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభా రాణి, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





