– కామారెడ్డిలో ధూం ధాంగా ఇందిరా మహిళా శక్తి సంబురాలు
– రూ.20.56 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కు అందచేత
– ఇందిరా మహిళా శక్తిని చాటేలా దేవతల వేషధారణలో మహిళలు
– దేశానికి స్పూర్తిగా ఇందిరా మహిళా శక్తి విజయాలు
– పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క
కామారెడ్డి, జూలై 15 : ఆడబిడ్డల ఆనందమే తెలంగాణ సౌభాగ్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో తెలంగాణ మహిళలు గణనీయమైన విజయాలను సాధిస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. కామారెడ్డిలో జిల్లా మహిళా సమాఖ్య మంగళవారం నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కార్‌లతో కలిసి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేల సంఖ్యలో మహిళలు మంత్రి సీతక్కకు జన హారతి పట్టారు. ఇందిరా మహిళా శక్తిని చాటే విధంగా దేవతల వేషధారణలో మహిళలు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్లకార్డులు చేబూని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా సమాఖ్యకు రూ.20.56 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కును అందజేశారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులను ఆర్దికంగా బలోపేతం చేసే దిశలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో మహిళా సంఘాలు నిర్వహిస్తున్న ఇందిరా మహిళా శక్తి క్యాంటీిన్ ద్వారా ప్రతి నెలా రూ.లక్ష ఆదాయాన్ని మహిళా సంఘాలు పొందుతూ ఇందిరా మహిళా శక్తి విజయానికి చక్కటి ఉదహరణగా నిలుస్తున్నారని కొనియాడారు. మహిళల అభివృద్దితోనే సమాజం అభివృద్ది సాధిస్తుందన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్పూర్తిని తమ ప్రభుత్వం ఆచరిస్తుందని మంత్రి సీతక్క వెల్లడిరచారు. ప్రభుత్వ చేయూతతో మహిళా సంఘాలు ఎన్నో వ్యాపారాల్లో రాణిస్తూ కోటీశ్వరులుగా ఎదుగుతూ ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలుస్తున్నారని అభినందించారు. ఒకప్పుడు మహిళలకు బ్యాంకులు రూ.వెయ్యి అప్పు ఇవ్వాలంటేనే భయపడే పరిస్థితి ఉండేది.. కానీ ఇప్పుడు అవే బ్యాంకుల ద్వారా ఏడాదికి కనీసం రూ.25 వేల కోట్లకు తగ్గకుండా రుణాలు సమకూరుస్తున్నామని వెల్లడిరచారు. మహిళా సంఘాలకు వడ్డీల భారం లేకుండా ప్రభుత్వమే వడ్డీలు చెల్లిస్తుందని చెప్పారు. స్థానిక వనరులు, అవసరాల ప్రాతిపదికన మహిళా సంఘాలు వ్యాపారాలు స్థాపించాలని పిలుపునిచ్చారు. త్వరలో కామారెడ్డిలో పసుపు ఆధారిత పరిశ్రమను మహిళా సంఘాలచే నెలకొల్పుతామన్నారు. స్వయం ఉపాధి నుంచి పదిమందికి ఉపాధి కల్పించే స్థాయికి మహిళా సంఘాలు ఎదిగాయని మంత్రి సీతక్క కితాబిచ్చారు. మహిళా సంఘాలు ఆర్టీసి అద్దె బస్సులు, ఐకేపీ కొనుగోలు కేంద్రాలు, పెట్రోల్ బంకుల నిర్వహణ ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాయన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి తమవంతు బాద్యతగా పేదలకు రుణాలను ఇస్తున్నాయని వెల్లడిరచారు. మహిళా సంఘాలంటే కేవలం వ్యాపారాల నిర్వహణ ఒక్కటే కాదని, మహిళా సంఘాల ద్వారా ఆడబిడ్డలకు సామాజిక భద్రత లభిస్తుందని అన్నారు.




