రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం

– ఇండిగో సంక్షోభంపై దర్యాప్తునకు ఆదేశం
– సర్వీసుల పునరుద్ధరణకు తక్షణ చర్యలు
– కాల్‌ ‌సెంటర్‌ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు

న్యూదిల్లీ, డిసెంబర్‌ 5: ఇం‌డిగో సంక్షోభంపై విచారణకు కేంద్రం ఆదేశించింది. సంక్షోభం నేపథ్యంలో సమస్యను పరిష్కరించేందుకు వెంటనే కేంద్రం రంగంలోకి దిగింది. సేవల్లో అంతరాయానికి గల కారణాలను విచారించనుంది. నిర్వహణాపరమైన లోపాల కారణంగా దేశీయ విమానయాన సంస్థ ఇండిగో విమాన సర్వీసులకు  తీవ్ర ఆటంకం కలుగుతోంది. దాంతో వేలాదిమంది ప్రయాణికులు అవస్థలు పడుతుండగా ఈ గందరగోళం ఇప్పుడప్పుడే కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. కేంద్రంశుక్రవారం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. ప్రస్తుత పరిస్థితులపై పౌరవిమానయాన శాఖ నిరంతరం సమీక్ష జరుపుతోంది. విమాన కార్యకలాపాలను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రయాణికులకు ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందించేలా 24/7 అందుబాటులో ఉండేలా కంట్రోల్‌ ‌రూమ్‌ను ఏర్పాటు చేసింది. విమానయాన సంస్థలతో సమన్వయం, ప్రస్తుత సమస్యలకు తక్షణ పరిష్కారం చూపే లక్ష్యంతో దీనిని అందుబాటులోకి తెచ్చారు. కంట్రోల్‌ ‌రూమ్‌కు కాల్‌ ‌చేయాల్సిన నంబర్లు 011-24610843, 011-24693963, 096503-91859 అని తెలిపింది. సంక్షోభానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. నాలుగైదు రోజులుగా ఇండిగో విమాన సర్వీసుల సామూహిక రద్దుతో తలెత్తిన సంక్షోభంపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ప్రభుత్వం నిర్ణయించినట్టు కేంద్ర విమానయాన శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇండిగో సర్వీసుల్లో ఎక్కడ పొరపాటు జరిగింది, ఇందుకు బాధ్యులెవరనేది దర్యాప్తులో గుర్తించి అవరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. భవిష్యత్తుల్లో ఇలాంటి అంతరాయాలు తలెత్తకుండా, ప్రయాణికులకు కష్టం కలకుండా చూస్తామని వివరించింది. ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ లేదని, ముఖ్యంగా సీనియర్‌ ‌సిటిజన్లు, విద్యార్థులు, పేషెంట్లు, ఇతరులు అత్య‌వసరాల కోసం ప్రయాణాలు సాగిస్తుంటారని, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాల్సి ఉంటుందని పేర్కొంది. పైలట్‌ ‌సర్వీసులు శనివారం నుంచి తిరిగి ప్రారంభమవుతాయని అంచనా వేస్తున్నామని, మూడు రోజుల్లోగా పూర్తిగా పునరుద్ధిస్తామని తెలిపింది. కాగా, నలుగురు సభ్యులతో కూడిన దర్యాప్తు కమిటీని కేంద్రం పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఇండిగో ఫ్లైట్స్‌కు కలిగిన తీవ్ర అంతరాయం, ఇందుకు దారితీసిన పరిస్థితులపై కమిటీ దర్యాప్తు చేసి నివేదికను 15 రోజుల్లోగా సమర్పించనుంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *