ప్రయాణికుల సమస్యలపై ఆరాతీయండి

-ఉన్నతాధికారులకు కేంద్ర మంత్రి ఆదేశం
-ఇండిగో సంక్షోభంపై మంత్రి రామ్మోహన్‌ దృష్టి
-ఎయిర్‌పోర్టులకు ప్రత్యేక బృందాల తరలింపు
-కొనసాగుతున్న ఇండిగో సంక్షోభం

 ఇండిగో విమాన సర్వీసుల్లో ఏర్పడిన అంతరాయం కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల కార్యకలాపాలపై 24 గంటల సమీక్షను ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేసి, ప్రయాణికుల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ఉన్నతాధికారులను ప్రధాన విమానాశ్రయాలకు పంపినట్లు ఆయన వెల్లడిరచారు. ఈ విషయంపై రామ్మోహన్‌ నాయుడు ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటన చేశారు. ‘‘డిసెంబర్‌ 3వ తేదీ నుంచి ఇండిగో కార్యకలాపాల్లో సమస్యలు మొదలైనప్పటి నుంచి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డీజీసీఏ పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నాయి,’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పరిణామాలను ‘‘అసాధారణ పరిస్థితి’’గా అభివర్ణించిన ఆయన, ఉన్నతస్థాయిలో తక్షణ జోక్యం అవసరమని స్పష్టం చేశారు. ఇటీవల తమ మంత్రిత్వ శాఖ, డీజీసీఏ ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్‌పోర్టులకు వెళ్లి తనిఖీలు చేయాలని, ప్రయాణికులతో మాట్లాడి వారి ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలని, ఎయిర్‌లైన్‌ సిబ్బంది సేవలపై ఆరా తీయాలని సూచించారు. ప్రయాణికుల నుంచి వచ్చిన ఫిర్యాదులను, గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు. దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో, గత కొన్ని రోజులుగా కార్యాచరణ సవాళ్లను ఎదుర్కొంటోంది. దీంతో దిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి ప్రధాన విమానాశ్రయాల్లో తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ప్రయాణికులు సోషల్‌ మీడియాలో భారీ క్యూలు, చెక్‌-ఇన్‌ ప్రక్రియలో జాప్యం, విమానాల సమాచారంపై స్పష్టత లేకపోవడం వంటి సమస్యలపై ఫిర్యాదులు చేస్తున్నారు. క్షేత్రస్థాయి నుంచి అధికారుల నివేదికలు అందిన తర్వాత, రానున్న 24 గంటల్లో మంత్రిత్వ శాఖ సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసే అవకాశం ఉంది. దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభంలో చిక్కుకుంది. సిబ్బంది కొరతతో సతమతం అవుతున్న ఇండిగో.. తీరుతో ప్రయాణికుల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో ఇండిగో విమానాలు రద్దయ్యాయి.. అయితే.. కొన్ని విమానాలు మాత్రం ఆలస్యంగా నడుస్తున్నాయి..  దిల్లీ  , ముంబై, హైదరాబాద్‌, బెంగళూరు గోవా, అహ్మదాబాద్‌లో సర్వీసులు రద్దయ్యాయి.. సాంకేతికలోపం, సిబ్బంది కొరతతో విమానసేవల్లో సమస్యలు మొదలయ్యాయి.. ఈ క్రమంలో ఇండిగో ఫ్లైట్స్‌ క్యాన్సిలేషన్స్‌ ఎఫెక్ట్‌ పెళ్లిళ్లు, శుభకార్యాలపై కూడా పడుతోంది.. ఓచోట కొత్త జంట వాళ్ల రిసెప్షన్‌కి వాళ్లే వెళ్లలేకపోతే.. మరోచోట పెళ్లికొడుకు ఎయిర్‌పోర్ట్‌లో ఇరుక్కుపోయాడు.. ఈ వారం ఇండిగో విమానాల రద్దు కారణంగా వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు, అయితే ఈ అంతరాయం ముఖ్యంగా వధూవరులను తీవ్రంగా దెబ్బతీసింది. ఒక జంట వీడియో కాల్‌ ద్వారా తమ వివాహ రిసెప్షన్‌కు జరుపుకుంటే.. మరికొందరు వివాహ వేడుకలను రద్దు చేసుకోడానికి రెడీ అయ్యారు. కొందరైతే పెళ్లి వాయిదా వేయడం ఇష్టం లేక ఖరీదైన చార్టర్‌ ఫ్లైట్‌ను బుక్‌ చేసుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ యువకుడు తన వెడ్డింగ్‌ కార్డును చూపిస్తూ..ఎయిర్‌లైన్స్‌ సమస్య కారణంగా నా పెళ్లికి నేను హాజరుకాలేకపోతున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియోను తన ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ..ఇది నా స్వంత పెళ్లి.. కానీ నేను వెళ్లలేకపోతున్నాను..ఏం చేయాలి యార్‌ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఓ యూజర్‌ ..అతను త్వరగా వివాహం చేసుకోవాలని, అతని సమస్యలన్నీ శాంతియుతంగా పరిష్కారమవ్వాలని, విమానాశ్రయాలలో చిక్కుకున్న ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని ప్రార్థిస్తున్నాను అంటూ స్పందించారు.
……..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *