– ఘనంగా వరల్డ్ ఇండీజినస్ పీపుల్స్ డే
– ఆకట్టుకున్న గిరిజన సంప్రదాయ వృత్తులు, నృత్యాలు, వివిధ కళారూపాల ప్రదర్శన
– బోనం, విల్లు ఎక్కిపెట్టి, నృత్యం చేసిన మంత్రి సీతక్క
– డప్పు చప్పుళ్ళు నృత్యాలతో హోరెత్తిన ఆదివాసి భవన్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 9: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటాని, దీన్ని ధీర దినోత్సవం అని కూడా పిలుస్తారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. ఆదివాసీలు సాగు చేసుకునే భూముల జోలికి వెళ్లొద్దు అని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని, భూములపై పూర్తి హక్కులు ఉండేలా పట్టాలు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. వచ్చే ఏడాది నుంచి పది రోజుల ముందే ఏర్పాట్లు చేసి పది వేల మందితో కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ సంవత్సరం ఎస్టీఎస్‌డీఎఫ్ కింద రూ.17,168 కోట్లు కేటాయించామని, ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధికమని, అలాగే గిరిజన సంక్షేమ శాఖకు రూ.6860 కోట్లు కేటాయించామని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుండి ఇంత భారీ మొత్తంలో కేటాయింపు ఇదే ప్రథమమని వివరించారు. అటవీ హక్కుల చట్టం ఎఫ్‌ఆర్‌ఏ కింద ఉన్న భూములకు సోలార్ పంపుల ద్వారా సాగు సౌకర్యం కల్పించామని, వచ్చే మూడేళ్లలో రూ.12,600 కోట్లు పెంచి రెండు లక్షల రైతులకు ఆరు లక్షల ఎకరాల భూమి కవర్ చేయనున్నట్లు చెప్పారు. రూ.769.54 కోట్లతో 429 సుదూర గిరిజన ప్రాంత ఆవాసాలకు బీటీ రోడ్డు సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. 326 ఆశ్రమ పాఠశాలల్లో 20 పాఠశాలలు టెన్త్‌లో 100శాతం ఫలితాలు సాధించాయన్నారు. ప్రతిష్టాత్మమైన జేఈఈ మెయిన్స్‌లో 127 మంది ఎన్‌ఐటీలకు, 82మంది ఐఐటీలకు అర్హత సాధించారన్నారు. అలాగే నీట్‌లో 62 మంది మెడికల్ సీట్లు సాధించారని మంత్రి అడ్లూరి తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ ట్రైబల్స్ కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని, డైట్, కాస్మెటిక్ చార్జీలు పెంచారని, గిరిజన ఆవాసాలకు సోలార్ పవర్ ఇస్తున్నారని తెలిపారు.. బడ్జెట్‌లో రూ.15 వేల కోట్లు గిరిజన శాఖకు కేటాయించారన్నారు. ఈసారి ఇంటర్, పది ఫలితాలలో స్టేట్ 1, 2 ర్యాంకులు ఆదివాసీ జిల్లాలైన ములుగు, అసిఫాబాద్, మహబూబాబాద్‌లకు వచ్చాయన్నారు. డిప్యూటీ స్పీకర్ రాంచంద్ర నాయక్ మాట్లాడుతూ గత పదేళ్ళు ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారని, గిరిజన శాఖను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. పెండిరగ్ నిధులు విడుదల చేయాలని, ఆదివాసీ గిరిజన క్రీడాకారులను ఆదుకోవాలని మంత్రి అడ్లూరిని కోరుతున్నానన్నారు. అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ తన ఆటపాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి అండ్ కమిషనర్ డాక్టర్ వి.ఎస్. అలగు వర్షిణి, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అడిషనల్ డైరెక్టర్ వి.సర్వేశ్వర్ రెడ్డి, ట్రైకార్ జిఎం శంకర్రావు, టీజీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ కార్యదర్శి కె.సీతాలక్ష్మి టీసీఆర్ అండ్ టీఐ డైరెక్టర్ డాక్టర్ వి.సముజ్వల,, టీజీజీసీసీ జీఎం సీతారాం, తదితరులు పాల్గొన్నారు



