యుధ్ద సంక్షోభంలో భారత్‌ ‌తొలి విజయం

– హర్మూజ్‌ ‌జలసంధి నుంచి భారత్‌కు చమురు నౌక
– క్షేమంగా ముంబై తీరం చేరుకున్న షెన్‌లాంగ్‌
– ఇరాన్‌ ‌పరోక్ష మద్దతుతో తొలి నౌక రాక

ముంబై, మార్చి 12: పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ఒక చమురు నౌక హర్మూజ్‌ను దాటి భారత్‌కు చేరుకుంది. ఎటువైపు నుంచి క్షిపణి దూసుకొస్తుందో తెలియని ఘర్షణ వాతావరణంలో జలసంధిని సురక్షితంగా దాటి, ముంబయి పోర్ట్‌కు చేరుకున్న తొలినౌక ఇదే కావడం విశేషం. అయితే హర్మూజ్‌ ‌నుంచి రావడానికి ఇరాన్‌ ‌పరోక్షంగా సహకరించిందని సమాచారం. హర్మూజ్‌ అం‌తరాయాలతో భారత్‌లో ఇంధన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో షెన్‌లాంగ్‌ ‌విజయవంతంగా దేశానికి చేరడం, మరోవైపు భారత పతాక నౌకలు హర్మూజ్‌నుంచి వెళ్లొచ్చని ఇరాన్‌ అనుమతిచ్చినట్లు వార్తలు రావడం ఊరటనిస్తోంది. దీనిని నడిపిన కెప్టెన్‌ ‌కూడా ఇండియనే. లైబీరియా జెండాతో ఉన్న షెన్‌లాంగ్‌ ‌సూయెజ్‌మాక్స్ ‌చమురు ట్యాంకర్‌ ‌బుధవారం ముంబయి నౌకాశ్రయానికి చేరుకుంది. మూడు రోజుల క్రితమే అది హర్మూజ్‌ ‌ను దాటింది. తన ప్రయాణాన్ని ఎవరూ ట్రాక్‌ ‌చేయకుండా చురుగ్గా వ్యవహరించింది. మార్చి ఒకటిన ఈ ట్యాంకర్‌ ‌సౌదీ అరేబియా పోర్ట్ ‌వద్ద చమురు లోడ్‌ ‌చేసుకుంది. మారిటైమ్‌ ‌ట్రాకింగ్‌ ‌డేటా ప్రకారం.. దాని సిగ్నల్స్ ‌మార్చి 8న హర్మూజ్‌లో కనిపించాయి. ఆ తర్వాత అది జాడలేకుండా పోయింది. నౌకలోని సిబ్బంది ఆటోమేటిక్‌ ఐడెంటిఫికేషన్‌ ‌సిస్టమ్‌ , ‌ట్రాన్స్‌పాండర్లను స్విచ్ఛాఫ్‌ ‌చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం అడుగడుగునా ప్రమాదకరంగా మారిన హర్మూజ్‌లో గుర్తింపు తెలియకుండా సిబ్బంది ఈ నిర్ణయం తీసుకున్నారు. జలసంధిని దాటి ఇండియా దిశగా ప్రయాణిస్తున్నప్పుడు.. అంటే ఒకరోజు తర్వాత మళ్లీ ట్రాకింగ్‌ ‌సిస్టమ్స్‌లో ఈ షిప్‌ ‌కనిపించింది. సంక్షోభ సమయాల్లో ప్రత్యర్థులకు చిక్కకుండా ఉండేందుకు అసాధారణ పరిస్థితుల్లో షిప్పింగ్‌ ‌కంపెనీలు ఈ టెక్నిక్‌ను వాడుతుంటాయి. దీనిని గోయింగ్‌ ‌డార్క్ ‌గా చెప్తుంటారు. అంతర్జాతీయ సముద్రయాన నిబంధనల ప్రకారం.. భద్రత, రియల్‌ ‌టైమ్‌ ‌ట్రాకింగ్‌ ‌కోసం ఏఐఎస్‌ను ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంచాలి. ఇక, ఇప్పుడు ముంబయికు షెన్‌లాంగ్‌.. 1,35,335 ‌మెట్రిక్‌ ‌టన్నుల చమురును మోసుకొచ్చింది. గ్రీస్‌లోని డైనకామ్‌ ‌ట్యాంకర్‌ ‌మేనేజ్‌మెంట్‌ ‌లిమిటెడ్‌ ఈ ‌నౌక కార్యకలాపాలు చూస్తోంది. 29 మంది సిబ్బందిలో భారతీయులతో సహా పాకిస్థాన్‌, ‌ఫిలిప్పీన్స్ ‌జాతీయులు ఉన్నారు. కెప్టెన్‌ ‌సుక్షాంత్‌ ‌సింగ్‌ ‌సింధు భారతీయుడే కావడం విశేషం.

ఇంధన కొరత లేదు -కేంద్ర మంత్రి హర్దీప్‌ ‌సింగ్‌ ‌పురి 

న్యూదిల్లీ : పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ దేశంలో ఇంధన భయాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో గురువారం ఎల్‌పీజీ అంశంపై లోక్‌సభలో వాడీవేడి చర్చ జరిగింది. చర్చలో కాంగ్రెస్‌ ‌నాయకుడు రాహుల్‌ ‌గాంధీ ఎన్‌స్టీన్‌ ‌ఫైళ్ల  ప్రస్తావన తీసుకురావడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. అయితే ఇంధన కొరతపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్‌ ‌సింగ్‌ ‌పురి నిరసనల మధ్యే తన ప్రకటన చేశారు. భారత్‌లో ఇంధన కొరత లేదని, తగినన్ని క్రూడాయిల్‌ ‌నిల్వలు ఉన్నాయని తెలిపారు. పెట్రోల్‌, ‌డీజిల్‌, ‌విమాన ఇంధన సరఫరాలో ఎలాంటి కొరత లేదని చెప్పారు. ప్రజలు ఎలాంటి వదంతులు వ్యాప్తి చేయవద్దని కోరారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఎల్‌పీజీ లభ్యతపై ఆందోళన నెలకొనడంతో కేంద్ర మంత్రి లోక్‌సభలో మాట్లాడారు. ’ఆధునిక ఇంధన చరిత్రలో ప్రపంచం ఇలాంటి క్లిష్ట సమయాన్ని మునుపెన్నడూ ఎదుర్కోలేదు. భారత్‌ ‌తన ముడి చమురు అవసరాల కోసం సురక్షితమైన సరఫరాలను సమకూర్చుకుంది. హర్మూజ్‌ ‌సంక్షోభంతో భారత్‌కు సంబంధం లేదు. హర్మూజ్‌ ‌జలసంధి భారత్‌కు తెరిచారు. ప్రధానమంత్రి చర్చలతో పరిస్థితులు సర్దుకుంటున్నాయి’ అని హర్దీప్‌ ‌సింగ్‌ ‌తెలిపారు. ఎలాంటి సంక్షోభం తలెత్తినా ఎదుర్కునేందుకు కూడా కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. డొమెస్టిక్‌ ‌సిలిండర్ల సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని మంత్రి వివరించారు. సిలిండర్ల సరఫరాలో హాస్పిటల్‌లు, విద్యాసంస్థలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. సిలిండర్‌ ‌బుకింగ్‌కు నగరాల్లో 25 రోజుల వ్యవధి, గ్రామాల్లో 45 రోజుల వ్యవధి అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఎల్‌ఎన్‌జీ కార్గోలు దాదాపు ప్రతిరోజూ ప్రత్యామ్నాయ సరఫరా రూట్లలో ఇండియాకు వస్తున్నాయని తెలిపారు. ఒకవేళ ఘర్షణలు సుదీర్ఘకాలం కొనసాగినప్పటికీ తగినంత గ్యాస్‌ ఉత్పత్తి, సరఫరా ఏర్పాట్లు చేయగలిగే స్థితిలో ఇండియా ఉందన్నారు. గృహాలు, పరిశ్రమలకు అవసరమైన విద్యుత్‌ ఉత్పత్తికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. రిఫైనరీలకు తగిన ఆదేశాలు ఇవ్వడం ద్వారా గత ఐదు రోజులుగా 28 శాతం ఎల్పీజీ ఉత్పత్తి పెరిగినట్టు హర్దీప్‌ ‌సింగ్‌ ‌పురి తెలిపారు. లక్షలాది భారతీయ కుటుంబాల వంటిళ్లలో ఎలాంటి కొరత లేకుండా చూసేందుకు మోదీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని, డొమిస్టిక్‌ ‌సప్లయ్‌కు పూర్తి భరోసా ఉందని చెప్పారు. పెట్రోల్‌, ‌డీజిల్‌, ఏటీఎఫ్‌ ‌సరఫరాలో ఎలాంటి కొరత లేదు. దేశీయ రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. 60 శాతం ఎల్‌పీజీని మనం గల్ఫ్ ‌దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం.. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌ ‌పరిస్థితి మెరుగ్గా ఉందని తెలిపారు. మంత్రి మాట్లాడుతుండగానే రాహుల్‌ ‌గాంధీ, ప్రియాంక సభ నుంచి వెళ్లిపోయారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *