– ఎలాంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కొనే సత్తా ఉంది
– కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
న్యూదిల్లీ, అక్టోబర్ 3: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నిర్మాణాత్మక మార్పును చూస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. హఠాత్తుగా వచ్చిపడే షాక్‌లను స్వీకరిస్తున్న భారత సామర్థ్యం బలంగా ఉందన్నారు. ఎలాంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కొనే సత్తా మనకు ఉందన్నారు. దిల్లీలో శుక్రవారం జరిగిన కౌటిల్య ఎకనామిక్ కాన్‌క్లేవ్-2025లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారామన్ మాట్లాడుతూ ఆర్థిక, ఇంధన అసమతుల్యతను ఎదుర్కోవడం కూడా దేశాల ముందున్న కర్తవ్యమని పేర్కొన్నారు. భౌగోళిక రాజకీయ సంఘర్షణలు తీవ్రమవుతున్నాయి. ఆంక్షలు, సుంకాలు, విభేదాలు ప్రపంచ సరఫరా గొలుసులను దెబ్బతీస్తున్నాయి. ఇవి భారత్‌కు కూడా దెబ్బే. కానీ, వీటన్నింటినీ బలంగా ఎదుర్కొనే సామర్థ్యం మనకు ఉంది అని అన్నారు. మన ఆర్థిక పరపతి కూడా అభివృద్ధి చెందుతోందన్నారు. యుద్దాలు, వ్యూహాత్మక పోటీలు, సంఘర్షణ సరిహద్దులను తిరిగి రాస్తున్నాయని, గతంలోని బలమైన సంబంధాలు పరీక్షలు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. కొత్త సంకీర్ణాలు ఉద్భవిస్తున్నాయని, అయితే మనం ఎదుర్కొంటున్నది తాత్కాలిక అంతరాయం మాత్రమే కాదు.. నిర్మాణాత్మక మార్పులు అని ఆమె అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉందని, స్థిరంగా వృద్ధి చెందుతూనే ఉందని తెలిపారు. యాదృచ్ఛికంగా భారత్ ఈ స్థాయికి రాలేదని, అనేక శక్తిమంతమైన సంస్కరణల ద్వారా వచ్చిందన్నారు. ఇందుకు అనేక విధాలుగా కసరత్తు చేసిందని, భారత్ ఆర్థిక పురోగతి కారణంగానే గట్టిగా నిలబడగలుగుతోందని నిర్మలాసీతారామన్ అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


