
భాష అనేది మన భావాలను, అవసరాలను, మనకున్న వ్యక్తిత్వాన్ని సమాజానికి చెప్పే సాధనం. అయితే, భారతదేశంలో లక్షలాది వినికిడి లోపం ఉన్న వ్యక్తులు వారి భావాలను వ్యక్తీకరించగల ఒకే భాష, (ఇండియన్ సైన్ లాంగ్వేజ్) భారతీయ సంజ్ఞ భాష. ఇప్పటికీ రాజ్యాంగం ద్వారా గుర్తించబడని భాషగా మిగిలిపోవడం, అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్య భారతదేశానికి సరైనది కాదు. ఇది కేవలం భాష పరంగా కాదు, సామాజిక న్యాయాన్ని సాధించాలనే ఒక ఉద్యమంగా మారుతోంది.
తెలంగాణలోనె మొదటి అడుగు
జూలై 2025 లో, తెలంగాణ రాష్ట్రం, ముఖ్యంగా కరీంనగర్ జిల్లా, బధిరుల సాధికారతకు దారితీసే గొప్ప అడుగు వేసింది. జిల్లా వికలాంగుల మరియు వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, అశ్రయ ఆకృతి అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో, ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లో ప్రాథమిక శిక్షణా శిబిరం ఆరంభించబడింది. ఈ ఆరు రోజుల శిక్షణా శిబిరానికి జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి గారు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో విద్య, రెవెన్యూ, ఆరోగ్య శాఖల నుంచి 100 మందికి పైగా అధికారులకు ప్రాథమిక ఇండియన్ సైన్ లాంగ్వేజ్ శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణలో ప్రధానంగా ప్రజా సేవల సమయంలో బధిరులతో సంభాషించగల సామర్థ్యం సంపాదించడం, అత్యవసర పరిస్థితులలో (ఉదాహరణకు వైద్య సహాయం) తక్షణ స్పందన సామర్థ్యం, పాఠశాల స్థాయిలో బధిర విద్యార్థులతో సానుకూల కమ్యూనికేషన్ మెరుగుదల అందించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో అశ్రయ ఆకృతి ద్వారా మాన్యువల్స్ కూడా అందించబడ్డాయి, తద్వారా అధికారులు ఈ శిక్షణ అనంతరం కూడా భాషను మరువకుండా కొనసాగించగలుగుతారు. ఈ చర్య ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక మార్గసూచికాన్ని దేశానికి నాంది పలికినట్లుగా భాషా ప్రాప్తిని కేవలం నినాదంగా కాకుండా, ప్రభుత్వ వ్యవస్థలో భాగంగా మలచాలనే ఆవశ్యకతను గుర్తించడం జరిగింది.
సామాజిక సమానత్వం దిశగా కరీంనగర్ జిల్లా
ప్రపంచపు అతి పెద్ద ప్రజాస్వామ్యంలో, ఎవ్వరూ రాజ్యాంగం కలిపించిన హక్కులను పొందాల్సిన బాధ్యత అందరి పైన ఉన్నది. జూలై 2025 లో కరీంనగర్ జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో 100 మందికి పైగా ప్రభుత్వ అధికారులకు ఇండియన్ సైన్ లాంగ్వేజ్ పై శిక్షణ నిర్వహించడం హర్షించదగ్గ విషయం. ఇదే విధంగా తెలంగాణలొని కరీంనగర్ జిల్లాను ఆదర్శంగా తీసుకుని అన్ని జిల్లాలలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించుటకు ముందుకు రావాలి.
ఇండియన్ సైన్ లాంగ్వేజ్ నకు అధికారిక భాష గుర్తింపు వల్ల కలిగే ప్రభావం
ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ను అధికారిక భాషగా గుర్తిస్తే బధిర విద్యార్థుల విద్యార్హతలు పెరుగుతాయి. తల్లిదండ్రులు కూడా ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ను నేర్చుకుని ఇంట్లో సంభాషించగలుగుతారు. ప్రజా సేవలలో అనువాదకుల అవసరం లేకుండా అధికారులే స్పందించగలుగుతారు.ఇతరులతో సమానంగా బధిరులు తమ భావాలను వ్యక్తీకరించగల సామర్థ్యం పెరుగుతుంది. విద్యలో చేరిక మెరుగవుతుంది బధిర విద్యార్థులకు వారి భాషలోనే బోధన సాధ్యమవుతుంది. తల్లిదండ్రులు కూడా ఇండియన్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకునేందుకు ప్రోత్సాహం లభిస్తుంది.
ప్రతి ప్రాంతంలో ఒకే విధమైన ఇండియన్ సైన్ లాంగ్వేజ్ బోధన జరుగుతుంది. ఇండియన్ సైన్ లాంగ్వేజ్ శిక్షకుల నియామకానికి ప్రామాణిక మార్గదర్శకాలు ఏర్పడతాయి. ప్రభుత్వ సేవలలో సమాచారం బధిరులకు కూడా అందుబాటులోకి వస్తుంది (ఉదా: కోర్టులు, హాస్పిటల్స్, రైల్వే స్టేషన్లు మొదలైనవి. ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయి అనువాదకులు, టీచర్లు, మాధ్యమం వర్కర్లు, డిజిటల్ కంటెంట్ క్రియేటర్లుగా బధిరుల ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. సామాజిక సమానత్వం పెరుగుతుంది అనువాదకుల అవసరం లేకుండా ఇతరులతో వారు సంభాషించగలుగుతారు. అంతేకాకుండా ఇండియన్ సైన్ లాంగ్వేజ్ బోధనకు నిఘంటువులు, శిక్షణా మాడ్యూల్స్, టీవీ/ఆన్‌లైన్ కంటెంట్ అభివృద్ధి చేయడం ద్వారా ఇండియన్ సైన్ లాంగ్వేజ్ భాష వికసిస్తుంది.
భారతీయ సంజ్ఞ భాషకు అధికారిక హోదా అవసరమే – బధిరుల సాధికారత దిశగా ఒక ముందడుగు
భాష అనేది వ్యక్తిగత భావాలను, ఆలోచనలను ఇతరులకు వ్యక్తీకరించే ముఖ్యమైన సాధనం. ప్రతి మనిషికి తన భాషలో మాట్లాడే హక్కు ఉంటుంది. కానీ ఈ సమాజంలో ఉన్న లక్షలాది వినికిడి లోపం గల మన సహోదరులకు, వారి భాష భారతీయ సంజ్ఞ భాష కు ఇంతవరకు భారత రాజ్యాంగం ద్వారా అధికారిక గుర్తింపు రాలేదు. ఇది మన సామాజిక బాధ్యతల వైఫల్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు.
భారతదేశంలో 6.3 మిలియన్ల మంది బధిరులు
ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం, భారతదేశంలో 6.3 మిలియన్ల మందికి పైగా వ్యక్తులు వినికిడి లోపంతో బాధపడుతున్నారు. అయితే వీరిలో 2 శాతం లోపువారే అధికారికంగా ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లో శిక్షణ పొందారు. అంటే మిగతావారి కోసం బోధన, సమాచార ప్రాప్తి, ప్రభుత్వ సేవలలో పాల్గొనగల అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. వారు సామాజికంగా, విద్యా పరంగా, మరియు ఉపాధి పరంగా ఎంతో వెనుకబడిపోతున్నారు. వారు వాడే భాషకు అధికారిక స్థానం లేకపోవడం వల్లే ఇది జరుగుతోంది.
ప్రభుత్వ ప్రయత్నాలు – మొదటి అడుగు మాత్రమే
భారత ప్రభుత్వం జాతీయ విద్యా విధానం 2020 ద్వారా ఇండియన్ సైన్ లాంగ్వేజ్ కు ప్రామాణీకరణ కల్పించే దిశగా ముందడుగు వేసింది. దాని కింద ఇండియన్ సైన్ లాంగ్వేజ్ రిసెర్చ్ మరియు ట్రైనింగ్ సెంటర్ 10,000 పదాలతో డిజిటల్ నిఘంటువు విడుదల చేసింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఒపెన్ స్కూలింగ్ ద్వారా ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లో పాఠ్య మాడ్యూల్స్ రూపొందించబడుతున్నాయి. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ను దేశవ్యాప్తంగా బోధన భాషగా ప్రవేశపెట్టే ప్రణాళిక ఉంది.
భవిష్యత్తు దిశగా మార్గం
ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ను రాజ్యాంగ ప్రక్రియ ద్వారా అధికార భాషగా గుర్తించాలి. ప్రతి రాష్ట్రంలో ఇండియన్ సైన్ లాంగ్వేజ్ బోధనకు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లో నైపుణ్యం ఉన్నవారికి రిజర్వేషన్లు కల్పించాలి. పబ్లిక్ మీడియా, వార్తా చానళ్లలో ఇండియన్ సైన్ లాంగ్వేజ్ అనువాదం తప్పనిసరి చేయాలి. స్కూళ్ళ నుండి విశ్వవిద్యాలయాల వరకు ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ను విద్యా భాషగా గుర్తించాలి.
బధిరుల సామాజిక న్యాయ పోరాటం
తెలంగాణ మాదిరిగా దేశవ్యాప్తంగా మరిన్ని రాష్ట్రాలు వినికిడి వైకల్యంపై అవగాహన, మరియు భాషా సమానత్వం పట్ల స్పందించాలి. అయినప్పటికీ, రాష్ట్రాల స్థాయిలో తీసుకునే చర్యలు పరిమితమైనవే. ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ను భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్‌లో చేర్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేయాలి. ఇది బధిరుల సమాజానికి మనం చెప్పే గౌరవ సూచిక మాత్రమే కాదు. మన రాజ్యాంగ బద్ధమైన బాధ్యతను నెరవేర్చే చర్య. ఇండియన్ సైన్ లాంగ్వేజ్ కు అధికార భాష హోదా ఇవ్వడమనేది ఒక మానవ హక్కుల సమస్య, ఒక భాషా హక్కుల సమస్య, మరియు సామాజిక న్యాయ పోరాటం. ఇది బధిర సహోదరులకు ఇచ్చే సరైన గుర్తింపు, గౌరవం, అవకాశాలు కల్పించే మార్గం. వారు మాట్లాడే భాషను అధికారికంగా గుర్తించడం ద్వారా, మనం ఒక ఇన్‌క్లూసివ్ ఇండియా వైపు ముందడుగు వేస్తాం. ఇది కేవలం సంజ్ఞల పోరాటం కాదు. ఇది సంభాషణకు హక్కు ఉన్న ప్రతీ మనిషి పోరాటం.





