అమెరికాతో ఇంధన సహకార చర్చలు

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ  గురువారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను తిరస్కరించింది. ట్రంప్ తనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా నుంచి చమురు దిగుమతులు ఆపేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. దీనిపై స్పందిస్తూ విదేశాంగ మంత్రిత్వ శాఖ “అటువంటి సంభాషణ జరిగినట్లు తమకు సమాచారం లేదని” స్పష్టం చేసింది. భారత్‌ చమురు దిగుమతి విధానం దేశీయ అవసరాలు, మార్కెట్‌ స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచి రూపొందించబడిందని, బాహ్య ఒత్తిడులకు లోబడలేదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
“స్థిరమైన ఇంధన ధరలు మరియు భద్రతతో కూడిన సరఫరాలు భారత ఇంధన విధానంలోని రెండు ప్రధాన లక్ష్యాలు. దీనిలో విస్తృత వనరుల ఆధారాలు కల్పించడం, మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా వైవిధ్య పరచడం కూడా ఉంటుందని ”  మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ స్పష్టీకరణ, బుధవారం వైట్‌ హౌస్‌లో జరిగిన సమావేశంలో ట్రంప్ “మోదీ  నాకు ఈ రోజు హామీ ఇచ్చారు” అని చెప్పిన తర్వాత వెలువడింది. భారత ప్రభుత్వం ఆ ప్రకటనను పూర్తిగా ఖండించింది.

వివాదాస్పద వాదనలు
ట్రంప్ వ్యాఖ్యల తర్వాత రోజు, విదేశాంగ మంత్రిత్వ శాఖ “ఇద్దరు నాయకుల మధ్య ఎటువంటి సంభాషణ జరిగినట్లు సమాచారం లేదు” అని తెలిపింది. అమెరికా అధ్యక్షుడు ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు రష్యాపై ఆర్థిక ఒత్తిడి పెంచాలనే ఉద్దేశంతో రష్యా చమురు కొనుగోలు తగ్గించమని ప్రపంచ దేశాలను కోరుతున్నారు. వైట్‌ హౌస్ అధికారులు ట్రంప్ ఈ వారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్‌తో కూడా టెలిఫోన్‌ సంభాషణ జరపబోతున్నారని ధృవీకరించారు. ఇదే సమయంలో భారత్‌ ప్రపంచ ఇంధన అస్థిరత మధ్య ఇంధన లభ్యత, భద్రత, సరసమైన ధరలను ప్రాధాన్యంగా కొనసాగిస్తుందని స్పష్టం చేసింది.

చమురు దిగుమతుల మార్పులు
వ్యాపార మరియు షిప్పింగ్‌ డేటా ప్రకారం, 2025 ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య భారత్‌ రష్యా నుండి ముడి చమురు దిగుమతులు 8.4% తగ్గాయి. దీనికి  కారణం, రాయితీలు తగ్గడం  సరఫరాలో కఠినతరం కావడం. దీంతో భారత రిఫైనరీలు మధ్యప్రాచ్యం మరియు అమెరికా నుంచి ఎక్కువ చమురు దిగుమతి చేయడం ప్రారంభించారు. భారత్‌ రష్యా యొక్క ప్రధాన ఇంధన ఖాతాదారుల్లో ఒకటిగా చైనాతో పాటు నిలిచింది. భారత అధికారులు “దేశీయ వినియోగదారుల ప్రయోజనాల కోసం” చమురు కొనుగోలు చేస్తున్నామని, వాటిని రాజకీయ రంగంలోకి లాగరాదని చెబుతున్నారు.

సుంక ఒత్తిడి
రాజనీతిక పరిణామాల మధ్య, అమెరికా ప్రభుత్వం భారత రష్యా దిగుమతులపై  25 శాతం సుంకం విధించింది. వాషింగ్టన్ ప్రకారం, ఈ దిగుమతులు మాస్కో యుద్ధానికి ఆర్థిక సహకారం అందిస్తున్నాయని ఆరోపించింది. “భారత్‌ చైనా తో పాటు రష్యా యొక్క అతిపెద్ద ఇంధన కొనుగోలుదారు, అయితే ప్రపంచం మొత్తం రష్యా యుద్ధాన్ని ఆపాలని కోరుతోంది – ఇది మంచిది కాదు!” అని ట్రంప్ జూలైలో తన *ట్రూత్‌ సోషల్*‌లో పేర్కొన్నారు.

సందట్లో  రిలయన్స్‌, నయారా ఆధిపత్యం
భారత్‌ రష్యా చమురు వాణిజ్యంలో రెండు ప్రధాన ప్రైవేట్‌ కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి రిలయన్స్‌ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌, దీన్ని ముకేశ్ అంబానీ నడుపుతున్నారు, నయారా ఎనర్జీ, ఇది రష్యా ప్రభుత్వ చమురు సంస్థ *రోస్నెఫ్ట్* ఆధీనంలో భాగంగా ఉంది.  ఉక్రెయిన్‌ యుద్ధానికి ముందు రిలయన్స్‌ దిగుమతుల్లో రష్యా చమురు వాటా కేవలం 3% మాత్రమే. ఇప్పుడు అది జామ్‌నగర్‌ రిఫైనరీలో 50% కు చేరుకుంది. 2025 జనవరి నుండి జూలై వరకు రిలయన్స్‌ రష్యా నుండి 18.3 మిలియన్‌ టన్నుల ముడి చమురును, దాదాపు 8.7 బిలియన్‌ డాలర్ల విలువైనది దిగుమతి చేసుకుంది. సెంటర్ ఫార్ రీసర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లిన్ ఎయిర్  డేటా ప్రకారం, 2023 ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకు జామ్‌నగర్‌ రిఫైనరీ  85.9 బిలియన్‌ డాలర్ల  విలువైన శుద్ధి చేయబడిన పెట్రోలియం ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసింది.

వాటిలో 42%  రష్యాపై ఆంక్షలు విధించిన దేశాలకు  అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ మొదలైనవాటికి వెళ్లాయి. 2025లో అమెరికా జామ్‌నగర్‌ నుండి  1.4 బిలియన్‌ డాలర్ల  విలువైన ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది ఇది గత ఏడాదితో పోలిస్తే 14% వృద్ధి.  న్యూఢిల్లీలోని వాణిజ్య నిపుణులు అమెరికా కొత్త సుంక విధానాన్ని విమర్శించారు. “లాభాలు ఎక్కువగా రిలయన్స్‌కు వెళ్లినా, చవకైన చమురు దిగుమతులు భారత ప్రస్తుత ఖాతా లోటును తగ్గించడంలో సహాయపడ్డాయి,” అని *సెంటర్ ఫర్ ఎ న్యూ అమెరికన్ సెక్యూరిటీ*లో సీనియర్ ఫెలో రాచెల్ జియెంబా అన్నారు.  *గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్* వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ ఈ సుంకాలను “పూర్తి మోసం”గా అభివర్ణించారు.“అమెరికా ఇప్పటివరకు రష్యా చమురు అతిపెద్ద దిగుమతిదారు చైనాను మాత్రం విమర్శించలేదు,” అని ఆయన అన్నారు.  “రేపు ట్రంప్  పుతిన్ మధ్య ఒప్పందం కుదిరితే, అమెరికా భారత్‌పై మరొక కారణంతో సుంకాలు విధిస్తుంది,” అని ఆయన వ్యాఖ్యానించారు.

 సవాళ్లు ముందున్నాయి

యూరోపియన్ యూనియన్  వచ్చే జనవరి నుంచి రష్యా చమురుతో తయారైన శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులపై నిషేధం అమలు చేయబోతోంది. ఇది భారత ఎగుమతి వ్యూహంపై గణనీయమైన ప్రభావం చూపనుంది.ప్రస్తుతం రిలయన్స్‌ జెట్‌ ఇంధన ఎగుమతుల్లో సగానికి పైగా యూరోపియన్‌ మార్కెట్లకే వెళ్తున్నాయి. “ఈ నూతన విధానం కఠినంగా అమలైతే, రిలయన్స్‌ వంటి రిఫైనరీలు తమ ప్రపంచ ఎగుమతి వ్యూహాన్ని పునరాలోచించాల్సి వస్తుంది.
గత సంవత్సరం డిసెంబరులో రిలయన్స్‌ రోస్నెఫ్ట్‌తో 10 ఏళ్ల సరఫరా ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో, భారత ఇంధన భద్రత అవసరాలు మరియు పాశ్చాత్య రాజకీయ ఒత్తిడుల మధ్య సమతుల్యత కొనసాగుతుందనడానికి సంకేతాలున్నాయి.  ప్రపంచ ఇంధన మార్కెట్లు మళ్లీ పునర్‌వ్యవస్థీకృతమవుతున్న తరుణంలో, భారత్‌ తన స్వతంత్ర ఇంధన విధానాన్ని కాపాడుకుంటూ, దేశీయ వినియోగదారుల ప్రయోజనాలను రక్షిస్తూ, పాశ్చాత్య పరిశీలనలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *