కాల్పుల విరమణ: వ్యూహంతోనా… ఒత్తిడితోనా?

పహల్గం ఉగ్రదాడి భారతదేశ ప్రజల హృదయాలను తీవ్రంగా గాయపరిచింది. అమాయకులైన పర్యాటకులను మతం పేరు అడిగి మరీ చంపిన విధానాన్ని దేశం జీర్ణించుకోలేకపోయింది. దేశవ్యాప్తంగా ఆందోళనలు, ఆవేదనలు వెల్లువిరిసాయి. ఈ దాడికి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాద స్థావరాలపై సంచలనాత్మక ప్రతీకార చర్యగా నిలిచింది. శత్రు శిబిరాల్లో వందకు పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టడం ద్వారా భారత సైన్యం తమ నిపుణతను, ధైర్యాన్ని మరోసారి నిరూపించింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే క్రమంలో కుల, మత, ప్రాంతాలకు అతీతంగా దేశ ప్రజలు ఒక్కటైన తీరు, రాజకీయాలను వీడి ఏకమైన నాయకుల ప్రవర్తన, ప్రతి భారతీయుడి గుండె చప్పుడులో ఉగ్రవాదాన్ని అణిచివేయాలనే ఆకాంక్ష, అన్ని కలిసి దేశంలో జాతీయ చైతన్యాన్ని రగిలించాయి.

కానీ, పరిస్థితి ఇక్కడితో ఆగలేదు. సరిహద్దుల్లో పాకిస్తాన్ కాల్పులకు తెరలేపింది. పాకిస్తాన్ ప్రతీ ఒక్క దాడికి భారత సైన్యం  ధైర్యంతో, సమర్థవంతంగా బదులిచ్చింది. ఈ పరిణామాల వల్ల రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉద్ధృత స్థాయికి చేరాయి. ఈ పరిణామాలు ఇలాగే కొనసాగితే, రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధం తప్పదేమోననే భావన అంతర్జాతీయంగా ఆందోళన కలిగింది . ప్రపంచంలోని అగ్రదేశాలన్నీ భారత్ – పాకిస్తాన్  మధ్య నెలకొన్న ఈ  ఉద్రిక్తతలు ఎంతవరకు వెళతాయోనని ఆందోళన చెందాయి. ఇటువంటి ఉద్విగ్న వాతావరణంలో “కాల్పుల విరమణ” అనే ప్రకటన ఒక్కసారిగా వినిపించడం దేశ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఇది భారత్ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయమా? లేక అంతర్జాతీయ ఒత్తిడికి స్పందనగా వచ్చిన  ఫలితమా? అనే సందేహాలు, అనుమానాలు దేశ మొత్తం విస్తరించాయి. దేశ ప్రజలలో నెలకొన్న ఈ సందేహాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్ మరింత బలపరిచింది. ఆయన ట్వీట్‌ కాల్పుల విరమణలో  అమెరికా పాత్ర ఉందన్న ఊహాగానాలకు ఊపునిచ్చింది. అమెరికా దేశాధినేత ఈ పరిణామాల్లో భాగం కావడం అనుమానాలకు తావిస్తోందని విశ్లేషకుల  అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో 2025 మే 12న,  భారత్ మరియు పాకిస్తాన్ మధ్య డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) స్థాయిలో హాట్‌లైన్ ద్వారా కీలక చర్చలు జరిగాయి. ఈ చర్చలలో ప్రధానంగా చర్చించబడిన అంశాలు,

పూర్తి కాల్పుల విరమణ: లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద రెండు దేశాలు కాల్పులు జరగకుండా పరస్పర అంగీకారానికి వచ్చాయి.

సైనికుల తగ్గింపు: సరిహద్దు మరియు ముందస్తు ప్రాంతాలలో సైనికుల సంఖ్యను తగ్గించే చర్యలను వెంటనే పరిగణించేందుకు అంగీకరించారు.

శాంతి మరియు స్థిరత్వం: పరస్పర శాంతి మరియు స్థిరత్వాన్ని కాపాడేందుకు, ఎటువంటి శత్రుత్వ చర్యలు లేకుండా ముందుకు సాగాలని నిర్ణయించారు. ఈ చర్చలు,2025 మే 10న ప్రారంభమైన కాల్పుల విరమణ ఒప్పందాన్ని కొనసాగించేందుకు మరియు సరిహద్దు ప్రాంతాలలో శాంతిని పునరుద్ధరించేందుకు కీలకంగా ఉన్నాయి. అయితే, ఈ డీజిఎంఓల చర్చల తర్వాత కొన్ని గంటల్లోనే, లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద కాల్పులు జరిగాయనే వార్తలు కొన్ని వచ్చాయి. భారత్, పాకిస్తాన్  కాల్పుల విరమణ ఉల్లంఘించిందని ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను పాకిస్తాన్ ఖండించింది.  ప్రస్తుతం పరిస్థితి సున్నితంగా ఉంది, మరియు రెండు దేశాలు పరస్పరం శాంతిని కాపాడేందుకు చర్చలు కొనసాగిస్తున్నాయి. ఈ చర్చలు మొదటి దశ మాత్రమే.

భారత్- పాకిస్తాన్ మధ్య జరిగిన చర్చలు, రెండు దేశాల మధ్య మారుతున్న దృక్పథానికి సంకేతంగా భావించవచ్చు. ఈ చర్చలు ఒక సానుకూల సంకేతంగా కనిపిస్తున్నా, వీటి వెనక దాగిన మౌలిక ఉద్దేశ్యం ఏమిటో స్పష్టంగా తెలియడం లేదు. యుద్ధ వాతావరణం నుండి చర్చల దశకు జరిగిన ఈ మార్పు ఒక ఊరట నిచ్చే అంశమే. అయితే, ఈ మార్పు తాత్కాలిక శాంతికి సంకేతమా? లేక దీర్ఘకాలిక సుస్థిరతకు మార్గనిర్దేశమా? అనే ప్రశ్నలకు స్పష్టత రావాల్సి ఉంది. ఇక్కడే మన భారత ప్రధాని నరేంద్ర మోదీ   జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం  ప్రాధాన్యతను సంతరించుకుంది. 2025 మే 12న జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇటీవల పహల్గాం లో జరిగిన ఉగ్రదాడిపై తీవ్రంగా స్పందించారు.

-వెంకట్ రెడ్డి
సామాజిక కార్యకర్త

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *