పట్టణ భారతం రూపురేఖల్ని శ్రీ నరేంద్ర మోదీ ఎలా మార్చివేశారు? –

హర్దీప్ సింగ్ పూరీ
కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి.
రోమ్ ఒక్క రోజులో నిర్మించినది కాదు… సరికొత్త పట్టణ భారత నిర్మాణమూ అలాంటిదే. నగరాలపై మనం మరిన్ని ఆశలు పెంచుకుంటున్న తరుణమిది. అయితే, ఒక్క క్షణం వెచ్చించి.. ఇంత వరకూ మనం సాధించిన పురోగతిని గుర్తించడమూ తప్పనిసరి. స్వాతంత్య్రం దశాబ్దాలపాటు దేశంలో నగరాల అభివృద్ధికి అంతగా ప్రాధాన్యమివ్వ లేదు. శాస్త్రి భవన్, ఉద్యోగ భవన్ వంటి కాంక్రీటు నిర్మాణాలు వెలిసినప్పటికీ, అవి సేవ కన్నా అధికార దర్పాన్ని చాటేవిగానే ఉండి.. 1990ల నాటికే పతనమవడం మొదలైంది. సోవియట్ తరహా కేంద్రీకృత ధోరణిపై నెహ్రూ ఆసక్తి చూపిన ఫలితమిది. గుంతలు పడిన రోడ్లు, పెచ్చులూడుతూ లీకవుతున్న ప్రభుత్వ భవనాలు, రాజధాని పరిధిలో పూర్తిగా స్తంభించిపోయిన ఇరుకైన రోడ్లు… 2010 దశకం నాటికి సెంట్రల్ దిల్లీలో కనిపిస్తోన్న అత్యంత నిరాశాజనకమైన దృశ్యాలివి. రద్దీగా ఉన్న రోడ్లతో జాతీయ రాజధాని ప్రాంతం నిండిపోయింది. ఎక్స్‌ప్రెస్ రహదారుల కొరత ఉండేది. మెట్రోలు కొన్ని నగరాలకే పరిమితమయ్యాయి. ప్రజా మౌలిక సదుపాయాల్లో క్షీణత స్పష్టంగా కనిపించేది. అంతర్జాతీయ అగ్రగామిగా ఎదగాలని ఆకాంక్షిస్తున్న ఓ దేశపు రాజధాని నగరం పరిస్థితి అలా ఉండేది. నాటి పాలకుల నిర్లక్ష్యాన్ని అది ప్రతిబింబించేది. ఆ పరిస్థితులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూర్తిగా మార్చేశారు. దేశ అభివృద్ధి ఎజెండాలో నగరాలను కేంద్రంగా నిలిపారు. వాటి నిర్వహణను భారంగా చూడలేదు. నగరాలను అభివృద్ధికి చోదకాలుగా, దేశానికి గర్వకారణంగా భావించారు. ఈ మార్పును ప్రతిచోటా స్పష్టంగా గమనించవచ్చు.
సెంట్రల్ విస్టా పునర్నిర్మాణంతో.. కర్తవ్య పథ్ ప్రజా వేదికగా, పార్లమెంటు భవిష్యత్ సన్నద్ధంగా, కర్తవ్య భవన్ క్రమబద్ధ పరిపాలనకు కేంద్రంగా మారాయి. గతంలో శైథిల్యం ఉన్న ఆ చోట.. ఇప్పుడు ఆశయమూ ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతున్నాయి. ఎంత గొప్ప మార్పును మనం సాధించినదీ గణాంకాలు కళ్లకు కడతాయి. 2004 – 2014 మధ్య దేశంలో పట్టణ రంగంలో కేంద్ర ప్రభుత్వ మొత్తం పెట్టుబడి దాదాపు రూ. 1.57 లక్షల కోట్లు. 2014 నుంచి అది 16 రెట్లు పెరిగి దాదాపు రూ. 28.5 లక్షల కోట్లకు చేరింది. 2025–26 బడ్జెట్లోనే గృహనిర్మాణ – పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు రూ. 96,777 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. అందులో మూడింట ఒక వంతు మెట్రోలకు, పావు వంతు గృహనిర్మాణానికి కేటాయించారు. అద్భుతమైన ఈ ఆర్థిక వనరులు… స్వతంత్ర భారతంలో మునుపెన్నడూ లేనంత వేగంతో పట్టణ వ్యవస్థలను పునర్నిర్మిస్తోంది.
దేశంలో విస్తృతమవుతున్న ఆర్థిక, డిజిటల్ రంగాలు దీనికి మరింత ఊపునిస్తున్నాయి. దాదాపు 4.2 ట్రిలియన్ డాలర్లతో నేడు మనం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. డిజిటల్ పట్టాలపై దైనందిన జీవితం దూసుకుపోతోంది. ఒక్క నెలలోనే యూపీఐ 20 బిలియన్ల లావాదేవీలను దాటింది. వీటి విలువ నెలకు రూ. 24 లక్షల కోట్లు. 90 కోట్లకు పైగా భారతీయులు ఇప్పుడు ఆన్లైన్ బాటలో ఉన్నారు. జేఏఎం త్రయం ఆధారంగా ఉన్న 56 కోట్ల జనధన్ ఖాతాల ద్వారా సబ్సిడీలు నేరుగా, పారదర్శకంగా అందుతున్నాయి. ఈ స్థాయి క్రమబద్ధీకరణ, ఫిన్‌టెక్ వినియోగం భారత్‌పై, ముఖ్యంగా దేశ పట్టణ ప్రాంతాలపై విశేషంగా ప్రభావం చూపింది. క్షేత్రస్థాయిలో పెనుమార్పులకు మెట్రో విప్లవం స్పష్టమైన ఉదాహరణ. 2014లో దేశంలో అయిదు నగరాల్లో మాత్రమే దాదాపు 248 కిలోమీటర్లకే మెట్రో సేవలు పరిమితమై ఉండేవి. నేడు 23 నగరాల్లో 1,000 కిలోమీటర్లకు పైగా విస్తరించి.. రోజూ కోటికి పైగా ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. పూణే, నాగ్‌పూర్ నుంచి సూరత్, ఆగ్రా వరకు డజన్ల కొద్దీ కొత్త కారిడార్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇవి పట్టణ ప్రాంతాల్లో రాకపోకలను వేగవంతం చేయడంతోపాటు.. శుభ్రమైన వాతావరణంలో, సురక్షిత ప్రయాణ సౌలభ్యాన్ని అందిస్తాయి.
మెట్రో అంటే కేవలం ఉక్కూ కాంక్రీటూ మాత్రమే కాదు.. మెట్రో అంటే తగ్గిన ప్రయాణ సమయం, శుద్ధమైన గాలి. మెట్రో ద్వారా అత్యంత ఉత్పాదకమైన లక్షలాది పనిగంటలు ప్రజలకు తిరిగి లభించాయి. పట్టణ అనుసంధానం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. కొత్తగా ప్రారంభించిన యూఈఆర్- II, దిల్లీ మూడో రింగ్ రోడ్ జాతీయ రాజధాని ప్రాంతంలోని రహదారుల్లో రద్దీ తగ్గిపోయింది. దీనికి జాతీయ రహదారి- 44, జాతీయ రహదారి-9, ద్వారకా ఎక్స్‌ప్రెస్ రహదారులను అనుసంధానం చేయడం వల్ల ముఖ్యమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తగ్గింది. దేశంలో మొదటి వేగవంతమైన ప్రాంతీయ రవాణా వ్యవస్థ దిల్లీ – మీరట్ ఆర్ఆర్టీఎస్ (నమో భారత్) ఇప్పటికే ప్రధాన సెక్షన్లలో ప్రారంభం అయింది. త్వరలోనే పూర్తి స్థాయిలో సేవలందించేందుకు సిద్ధమవుతోంది. దీంతో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా… ప్రయాణ సమయం గంటకు తగ్గింది. నవభారత అవసరాలకు తగ్గట్టుగా ఉండేలా.. ఈ హై-స్పీడ్, సమీకృత వ్యవస్థలు మహానగర మెట్రోనగరానికి సరికొత్త నిర్వచనాన్ని ఇస్తున్నాయి. ఎక్స్‌ప్రెస్ రహదారులు నగరాల మధ్య ప్రయాణాన్ని పూర్తిగా మార్చివేసింది. దిల్లీ- ముంబయి ఎక్స్‌ప్రెస్ రహదారి, బెంగళూరు- మైసూరు ఎక్స్‌ప్రెస్ రహదారి, దిల్లీ- మీరట్ ఎక్స్‌ప్రెస్ ప్రవేశ నియంత్రిత కారిడార్, ముంబయి తీరప్రాంత రహదారి దూరాలను తగ్గించడంతోపాటు.. వీధుల్లో భారీ ట్రాఫిక్ రద్దీని తగ్గించడం ద్వారా గాలి నాణ్యతను పెంచుతున్నాయి.దేశంలోనే అతి పొడవైన సముద్ర వంతెన అయిన ముంబయిలోని అటల్ సేతు. అదిప్పుడు ఎలాంటి అంతరాలూ లేకుండా ద్వీప నగరాన్ని ప్రధాన భూభాగంతో అనుసంధానిస్తోంది. దేశంలో మొదటి బుల్లెట్ రైలు కారిడార్ అయిన ముంబయి – అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు వేగంగా అభివృద్ధి చెందుతోంది. పశ్చిమభారత అభివృద్ధికి ఇది వెన్నెముకగా నిలుస్తుంది. నేటికీ సమ్మిళిత్వమే కేంద్ర బిందువు.
ప్రధానమంత్రి స్వనిధి ద్వారా 68 లక్షలకు పైగా వీధి వ్యాపారులు పూచీకత్తు లేకుండా రుణాలు పొందారు. వారు డిజిటల్ సాధికారత సాధించారు. చిరువ్యాపారులు జీవనోపాధిని మెరుగుపరచుకోవడానికి, వ్యవస్థీకృత ఆర్థిక వ్యవస్థలో వారిని భాగస్వాములను చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ) కింద 1.20 కోట్లకు పైగా ఇళ్లను మంజూరు చేయగా, వాటిలో దాదాపు 94 లక్షలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఒకప్పుడు మురికివాడలకే పరిమితమైన లక్షలాది కుటుంబాలు ఇప్పుడు సురక్షితమైన పక్కా ఇళ్లలో నివసిస్తున్నాయి. ఇవి కేవలం గణాంకాలు మాత్రమే కాదు.. ఇవి మారిన జీవితాలు, సాకారమైన కలలు. ఇంధన సంస్కరణలు రోజువారీ పట్టణ జీవితాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతున్నాయి.
ఖరీదైన, ఎప్పుడు వస్తుందో తెలియని గ్యాస్ సిలిండర్ బుకింగులపైనే గతంలో వంటిళ్లు ఆధారపడి ఉండేవి. నేడు పైపుల ద్వారా సరఫరా చేసే సహజ వాయువు (పీఎన్జీ) వినియోగం పెరుగుతోంది. ఇది సురక్షితమైన, శుభ్రమైన,సౌకర్యవంతమైన ఇంధన రూపంగా మారుతోంది. 2014లో కేవలం 57 ప్రాంతాల్లోనే నడిచే సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు 300కుపైగా ప్రాంతాలకు విస్తరించింది. గృహ వినియోగం కోసం పీఎన్జీ కనెక్షన్లు దాదాపు 25 లక్షల నుంచి 1.5 కోట్లకు పైగా పెరిగాయి. వేలాది సీఎన్జీ స్టేషన్లు పర్యావరణ హిత పద్ధతులో ప్రజా రవాణాకు ఊతమిస్తున్నాయి. ఇప్పుడు నగరాల్లోని లక్షలాది గృహాల్లో కుళాయి తిప్పి ఇంధనాన్ని వాడుకుంటున్నారన్నది వాస్తవం.
ప్రపంచానికి ఆతిథ్యమివ్వగల విశ్వాసాన్ని భారత్ సాధించింది. భారత్ మండపంలో జీ20 నాయకుల శిఖరాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించింది. వేలాది మంది ప్రతినిధులను స్వాగతించగల సామర్థ్యంతో.. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద సమావేశ వేదికల్లో ఒకటిగా ‘యశోభూమి’ నిలిచింది. భారత ఇంధన వారోత్సవం- ప్రపంచ ఇంధన వ్యవస్థను బెంగళూరు, గోవా, న్యూదిల్లీల వైపు తిప్పింది. మన నగరాలు భారీ స్థాయిలో, ప్రతిష్ఠాత్మకంగా ప్రపంచ వేదికలుగా ఆతిథ్యమివ్వగలవని నిరూపించాయి. శిథిలమైన మండపాలు, దీనావస్థలోని స్టేడియాలే మన ప్రజా మౌలిక సదుపాయాలుగా ఉన్న సమయంలో.. ఈ స్థాయికి చేరుకోవడం ఎవరి ఊహకూ అందని విషయం. రవాణా ఆధునికీకరణ వేగంగా, భారీగా జరుగుతోంది. ఉడాన్, నిరంతర పెట్టుబడుల కారణంగా.. 2014లో 74 విమానాశ్రయాలుండగా, నేడు ఆ సంఖ్య రెట్టింపు కన్నా ఎక్కువగా 160కి పెరిగింది. ఇప్పుడు 140కి పైగా వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో ప్రయాణ సమయం భారీగా తగ్గింది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 1,300కు పైగా రైల్వే స్టేషన్లను ప్రభుత్వం ఆధునికీకరిస్తోంది. వాటిలో ఇప్పటికే వందకు పైగా ప్రారంభమయ్యాయి. దిల్లీలో విస్తరించిన టెర్మినల్-1.. ఐజీఐ సామర్థ్యం సంవత్సరానికి 10 కోట్లు దాటింది. అది మన రాజధానిని ప్రపంచ స్థాయిలో నిలిపింది.
సున్నితత్వంతో కూడిన పన్ను విధానం వినియోగదారులకు, అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇటీవలి జీఎస్టీ హేతుబద్ధీకరణ ద్వారా చాలా వస్తువులు, సేవలు 5 శాతం, 18 శాతం శ్లాబుల పరిధిలోకి వచ్చాయి. ఎంపిక చేసిన కొన్ని విలాస వస్తువులు, హానికారక వస్తువులకు మాత్రమే అధిక రేట్లను కేటాయించింది. వ్యక్తిగత సంరక్షణ వస్తువుల నుంచి అనేక గృహోపకరణాల వరకు.. నిత్యావసర వస్తువులపై పన్ను రేటు తగ్గింది. చిన్న కార్లు, ద్విచక్ర వాహనాలకు ఇప్పుడు తక్కువ జీఎస్టీ వర్తిస్తుంది. అనేక ఔషధాలు, వైద్య పరికరాలు చవకగా మారాయి. పట్టణ కుటుంబాల్లో ఇది నెలవారీ బిల్లులను తగ్గిస్తుంది. అలాగే వినియోగ సామర్థ్యాన్ని, పెట్టుబడిని, ఉద్యోగావకాశాలను పెంచుతుంది.
దౌత్యవేత్తగా దశాబ్దాల పాటు విదేశాల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన నేను.. ఒక దేశానికి నగరాలు ఎలా ప్రాతినిధ్యం వహిస్తాయో ప్రత్యక్షంగా చూశాను. వియన్నా రింగ్స్ట్రాస్సే, న్యూయార్క్ స్కైలైన్, పారిస్ బొలీవార్డ్.. అన్నీ దేశ లక్ష్యాలను ప్రతిబింబించాయి. అంతర్జాతీయ దృక్పథం పట్టణ ప్రాంతాల్లోనే మొదలవుతుందని నాకు స్పష్టంగా అర్థమైంది. దిల్లీ, ముంబయి, బెంగళూరు, అహ్మదాబాద్, మన ఇతర నగరాలన్నీ… అభివృద్ధి చెందుతున్న భారతదేశ ఆత్మవిశ్వాసం, ఆధునికత, ఆకాంక్షలను ప్రతిబింబించేలా చూడాలన్న ఈ నిశ్చయం పట్టణ వ్యవహారాల్లో నా కృషిని ముందుకు నడిపింది. అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠను నిలపడం ఎంత విలువైనదో నా ఉద్యోగ జీవితం నాకు నేర్పింది. అలాగే ఆ ప్రతిష్ఠకు తగిన రీతిలో మన నగరాలను తీర్చిదిద్దడం మంత్రిగా నా పాత్ర. స్వతంత్య్రనంతరం నిర్లక్ష్యం నుంచి మోదీ హయాంలో ఆధునికీకరణ వరకు, శాస్త్రి భవన్ శిథిలాల నుంచి కర్తవ్య భవన్ ఆశయం వరకు, గుంతలు పడిన రోడ్ల నుంచి ఎక్స్‌ప్రెస్ రహదారులూ హైస్పీడ్ కారిడార్ల వరకు, పొగతో నిండిన వంటిళ్ల నుంచి పైపులతో అందే సహజ వాయువు వరకు, మురికివాడల నుండి లక్షలాది పక్కా ఇళ్ల వరకు, శిథిలావస్థలో ఉన్న మండపాల నుంచి ప్రపంచ స్థాయి సమావేశ మందిరాల వరకు, ఇది రాజధానేనా అన్న సందేహం నుంచి ప్రపంచానికి ఆతిథ్యమిచ్చే వరకు… ఇదీ పరివర్తన పథం! దేశంలోని పురాతన నగరాలైన పాటలీపుత్ర, నలంద ఒకప్పుడు పట్టణ నాగరికతా ఔన్నత్యాన్ని ప్రతిబింబించాయి. నేడు ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో భారతీయ నగరాలు మళ్ళీ ఆ మార్గంలో పయనిస్తున్నాయి. ఇవి ఆధునికం, మానవీయం… ప్రతిష్ఠాత్మకం, సమ్మిళితం… దృక్పథం అంతర్జాతీయం, మూలాలు మాత్రం ఇక్కడి విలువల్లోనే. సరికొత్త పట్టణ భారత నిర్మాణం ఒక్క రోజులో అయ్యేది కాదు. ఒక్కో ఇటుక, ఒక్కో రైలు, ఒక్కో ఇల్లు… ఇలా ప్రతిరోజూ దాన్ని నిర్మించుకుంటున్నాం. ఇది లక్షలాది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. –
–





