- సైలెంట్ గా విస్తరిస్తోన్న ఊబకాయం, మానసిక అనారోగ్యం
- ఐపిఎస్‌ఓఎస్ రిపోర్ట్ బయటపడ్డ నిజాలు
ఆరోగ్య సంరక్షణకు సంబంధించి భారతదేశం గణనీయమైన మార్పులకు లోనవుతోంది. ఇది అంటువ్యాధి కాని వ్యాధుల ప్రాబల్యం, మానసిక ఆరోగ్యంపై పెరుగుతున్న అవగాహన ద్వారా గుర్తించబడింది. నేటి ఆధునిక జీవనశైలి, వేగవంతమైన నగరీకరణ వల్ల భారత ప్రజలు అనారోగ్య సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారు. ముఖ్యంగా ఊబకాయం, మానసిక అనారోగ్యం, క్యాన్సర్ లాంటి సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన ఐపిఎస్‌ఓఎస్ రిపోర్ట్ 2024 క్యాన్సర్, ఊబకాయం, మానసిక ఆరోగ్య రుగ్మతవంటి క్లిష్టమైన సమస్యల బారిన పడుతున్నారని తెలియచేస్తున్నాయి. ఇవి అన్ని వయస్సుల వారికీ గ్రామీణచ పట్టణ ప్రజలకు, పేద, ధనిక అన్న తేడా లేకుండా ప్రభావితం చేస్తున్నాయి.
ఐపిఎస్‌ఓఎస్ హెల్త్ సర్వీస్ రిపోర్ట్ 2024 హైలైట్స్
31 దేశాలను కవర్ చేస్తూ, ఐపిఎస్‌ఓఎస్ హెల్త్ సర్వీస్ రిపోర్ట్ 2024, భారతీయ పౌరులను ఇబ్బంది పెడుతున్న ప్రస్తుత ఆరోగ్య సమస్యలపై సమగ్రమైన రిపోర్ట్ ను అందించింది. జాబితాలో ముందు వరుసలో క్యాన్సర్ (47%), ఊబకాయం (28%), మానసిక ఆరోగ్య రుగ్మత(26%) ఉన్నాయి. పెరుగుతున్న ఇతర సమస్యలలో మాదకద్రవ్య దుర్వినియోగం (16%), ఒత్తిడి (14%) ఉన్నాయి. ఊబకాయం, మానసిక ఆరోగ్య రుగ్మతలు వంటి ఆరోగ్య పరిస్థితులు ఒక దాని పై ఒకటి అనుసంధానించబడి ఉంటాయి గత సంవత్సరం తో పోలిస్తే ఊబకాయం (ం10%), మానసిక ఆరోగ్య రుగ్మత(ం7%) ల సమస్యలను తగ్గించడానికి తక్షణ అవసరం ఏర్పడుతోంది.
ఊబకాయం, మానసిక ఆరోగ్య రుగ్మత- పరస్పర సంబంధం
ఊబకాయం ఒక శారీరక సమస్య మాత్రమే కాదు, ఇది మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఊబకాయంతో బాధపడే వ్యక్తులు చాలా సందర్భాలలో తక్కువ ఆత్మవిశ్వాసం, డిప్రెషన్, ఒత్తిడి, మరియు మానసిక ఒడిదొడుకులకు గురవుతుంటారు. అదే సమయంలో, మానసిక అనారోగ్యం ఉన్నవారు శారీరక చొరవను తగ్గించడమూ, అస్వస్థమైన భోజన అలవాట్లు అవలంబించడమూ వల్ల ఊబకాయం రావడం జరుగుతుంది. ఈ రెండు సమస్యలు చక్రాకారంగా ఒకదాన్నొకటి బలపరుస్తూ, వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని పెంచుతాయి.
మాతా శిశు ఆరోగ్యం – ఆరోగ్య భవిష్యత్తుకు పునాది
తల్లి ఆరోగ్యమే శిశువు ఆరోగ్యానికి ఆధారం. గర్భధారణ సమయంలో తల్లి సరైన పోషకాహారం తీసుకోవడం, మెరుగైన వైద్య సేవలు పొందడం వల్ల శిశువు యొక్క శారీరక మరియు మానసిక ఎదుగుదల బలపడుతుంది. కానీ భారతదేశంలో ఇప్పటికీ అనారోగ్యంతో బాధపడుతున్న గర్భిణులు, రక్తహీనత, మరియు అనుత్తమ వైద్య సౌకర్యాలు వంటి సమస్యలు గర్భిణీ స్త్రీల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి.
ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమైన పథకాలు:
ప్రధానమంత్రి మాతృ వందన యోజన (పీఎంఎం వీవై ): ఆర్థిక సహాయంతో గర్భిణులకు మద్దతు. జనని సురక్ష యోజన (జేఎస్ వై ): ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించే పథకం.
జనని శిశు సురక్ష కార్యక్రమం (జేఎస్‌ఎస్కె): ఉచిత ప్రసవ సేవలు, సి-సెక్షన్‌లు సహా.
తల్లి ఆరోగ్యం బలపడితేనే శిశువు ఆరోగ్యంగా ఎదుగుతాడు. పోషకాహార లోపం ఉన్న తల్లులు మాత్రమే కాదు, మానసిక ఒత్తిడిలో ఉన్న గర్భిణుల శిశువులు కూడా భవిష్యత్తులో అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే గర్భిణులకు ప్రతిరోజు మానసిక ధృఢత్వం, పౌష్టికాహార సలహాలు, కుటుంబంలో మద్దతునిచ్చే వాతావరణం అత్యవసరం. మొత్తం మీద, మాతా శిశు సంరక్షణను మెరుగుపరచడం అంటే దేశ భవిష్యత్తును బలపరచడం. ఆరోగ్యకరమైన తల్లులు, ఆరోగ్యవంతమైన శిశువులను అందిస్తారు.
ప్రజారోగ్యం కుంటుపడుతోంది
ప్రస్తుతం భారత దేశం లో ఆరోగ్యసేవల విషయం లో వెనుకబడడానికి కారణం అధిక వైద్య ఖర్చులు, చికిత్సకు వేచి ఉండే సమయం, డాక్టర్ ల సేవలు అందుబాటులోలేకపోవడం, వృద్ధుల సంరక్షణ అవసరాలు పెరుగుతుండటం, వైద్య సిబ్బంది కొరత, వ్యవస్థలో అధిక నిబంధనలు, జాప్యం ఇలా ఎన్నో కారణాలతో ప్రజా ఆరోగ్యం కుంటుపడుతోంది.
ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ద
ఊబకాయం, మానసిక ఆరోగ్య రుగ్మతలాంటి సమస్యలపై ముందస్తు జాగ్రత్తలు తీసుకొని, ప్రభుత్వ ప్రైవేట్ రంగాలు, కుటుంబాలు కలిసి పనిచేస్తే, ఆరోగ్యంగా ఉన్న భారతదేశాన్ని నిర్మించటం సాధ్యమే. ఇప్పుడు చర్య తీసుకోవాల్సిన సమయం. మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ, వ్యక్తిగత, కుటుంబ మరియు సమాజ స్థాయిలో మద్దతు, సరైన పోషకాహార మార్గదర్శకాలు, నియమిత వ్యాయామం, అవసరమైనప్పుడు ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఊబకాయాన్ని తగ్గించాలంటే, మానసిక స్థిరత్వం చాలా ముఖ్యం. మానసిక ఆరోగ్య రుగ్మతమెరుగైతేనే శారీరక ఆరోగ్య మార్గంలో కూడా విజయవంతం కావచ్చు.

డా.అట్ల శ్రీనివాస్ రెడ్డి
రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్
9703935321





