పార్లమెంట్ ముందు ఇండియా కూటమి ఆందోళన
న్యూదిల్లీ,ఆగస్టు5 : బీహార్‌లో ఎస్‌ఐఆర్‌ను వ్యతిరేకిస్తూ పలువురు ఇండియా బ్లాక్ నేతలు పార్లమెంటులో నిరసన చేపట్టారు. ఎస్‌ఐఆర్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వరుసగా పదవ రోజైన మంగళవారం కూడా ప్రతిపక్షాలు నిరసనలు చేపట్టాయి. పార్లమెంట్ మకర ద్వారం సమీపంలో చేపట్టిన నిరసనలో వామపక్షాలు, డిఎంకె, టిఎంసి ఎంపిలు సహా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలు పాల్గొన్నారు. ‘మన ఓటు- మన హక్కు. మన పోరాటం’, ‘ఎస్‌ఐఆర్- సైలెంట్ ఇన్విజబుల్ రిగ్గింగ్’ అని రాసి వున్న బ్యానర్లు ప్రదర్శించారు. ‘స్టాప్ ఎస్‌ఐఆర్’ ప్లకార్డులు, పోస్టర్లను ప్రదర్శించడంతో పాటు పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీహార్‌లో ఓటర్ల ఓటు హక్కును తొలగించడం లక్ష్యంగా ఈసీఐ కసరత్తు చేపడుతోందని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎస్‌ఐఆర్‌పై చర్చ చేపట్టాలంటూ పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ప్రతిపక్షాలు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ మరణించడంతో సోమవారం ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టలేదు.
బీహార్ ఓటు సవరణపై నిరసనలు


