ఇండి కూటమిలో ఐక్యత లోపించింది

– కాంగ్రెస్‌ హయాంలోనే రాజ్యాంగానికి ముప్పు
– స్పీకర్‌ దగ్గర ఉన్న యాంటీ డిఫెక్షన్‌ బిల్లుల సంగతేమిటో?
– రాష్ట్రంలో అన్ని వ్యవహారాల్లో విఫలమైన కాంగ్రెస్‌
– ‘మీట్‌ ది ప్రెస్‌’లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11: ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఇండీ కూటమి నుంచి క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందని, ఆ కూటమిలోని పార్టీలలో ఐక్యత ఎప్పుడూ లోపిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు విమర్శించారు. తెలంగాణ జర్నలిస్ట్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఇతర అంశాలపై ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా వల్ల రాజ్యాంగం ప్రమాదంలో ఉందన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై స్పందిస్తూ కాంగ్రెస్‌ పార్టీ హయాంలో జరిగినంత రాజ్యాంగ ఉల్లంఘన ఎప్పుడూ జరగలేదని కౌంటర్‌ ఇచ్చారు. కాంగ్రెస్‌ హయాంలో అనేకసార్లు రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగాయని, ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ ప్రకటించడం, రాజ్యాంగాన్ని కాలరాసిన చరిత్ర కాంగ్రెస్‌దని, అలాంటి పార్టీలో ఖర్గే కొనసాగుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యవహారాల గురించి మాట్లాడుతూ శాసనసభ ఆమోదించి పంపిన బిల్లులను గవర్నర్లు నెలకుపైగా పెండింగ్‌లో ఉంచకూడదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ ఇవ్వగా 1970 నుండి రాష్ట్రాల శాసనసభలు పంపిన బిల్లుల్లో 90 శాతం నెలలోపే గవర్నర్ల ఆమోదం పొందినట్టు కేంద్రం తరఫున వాదించిన‌ సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టు దృష్టికి తీసుకొచ్చారన్నారు. మరి తెలంగాణ స్పీకర్‌ దగ్గర యాంటీ డిఫెక్షన్‌ నోటీసులు, అప్లికేషన్స్‌ అనేకంగా పెండింగ్‌లో ఉన్నాయని, దీనిపై కాంగ్రెస్‌ సమాధానం ఇవ్వాలని రామచందర్‌రావు డిమాండ్‌ చేశారు.

పాలనలో కాంగ్రెస్‌ విఫలం

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 హామీలు, 100 రోజుల్లో నెరవేరుస్తామన్న వాగ్దానాలు 22 నెలల్లో నెరవేరలేదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా దిగజారిపోయిందని ఆరోపించారు. సీఎం రేవంత్‌ రెడ్డి దావోస్‌ పర్యటనకు వెళ్లి రాష్ట్రానికి రూ.70 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, మలేషియా, సింగపూర్‌ పర్యటనలకు వెళ్లి రూ.10 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తామని అన్నారు.. మరి ఆ పెట్టుబడులు ఏమైనట్లో స్పష్టత లేదన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్‌ వ్యవస్థ, భద్రతా చర్యల్లో విఫలమైందని అన్నారు.

టీజీపీఎస్సీ గ్రూప్‌-1 పరీక్షలు

టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష నిర్వహణలో గందరగోళాలు, లెక్కలేనన్ని అవకతవకలు జరిగాయని హైకోర్టు తేల్చిందన్నారు. నిరుద్యోగులకు జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చినా ఇప్పటివరకు ఒక్క పరీక్షను కూడా సరిగ్గా నిర్వహించలేకపోయారని దుయ్యబట్టారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనూ పేపర్‌ లీకేజీలు జరిగాయని, ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో హోప్‌ బ్రేకేజ్‌ జరుగుతోందని అన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లి సమస్యలను పట్టించుకోకుండా డిసెంబరులో మరోసారి వస్తానంటూ రూ.వెయ్యి కోట్ల హామీ ఇచ్చారు.. ప్రొఫెసర్ల, సిబ్బంది కొరత, పరిశోధనలు నిలిచిపోవడం, ల్యాబ్‌లు, పరికరాలు, సౌకర్యాలు లేనందున విద్యా నాణ్యత తీవ్రంగా దెబ్బతింటోందన్నారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయని, ఈ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు.

కాళేశ్వరం మొత్తంపై విచారణ జరగాలి

కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ఘోష్‌ కమిటీని ఏర్పాటు చేసినా మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవినీతి అంశాలను మాత్రమే సీబీఐ విచారణకు అప్పగించిందన్నారు. క్వాలిటీ, అవినీతి, నిర్వహణ విషయంలో కొన్ని బ్యారేజీలకే పరిమితమైన పరిశీలన కాకుండా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలు, అవినీతిపై సీబీఐ విచారణ జరగాలన్నారు. ఇన్ని వైఫల్యాల కాంగ్రెస్‌ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెబుతారని రామచందర్‌రావు అన్నారు. కార్యక్రమంలో జర్నలిస్టు యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కప్పర ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *