– సేవాలాల్ మహరాజ్ జయంతిని అధికారికంగా జరిపించాం
– ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 6నుంచి 10శాతానికి పెంచాం
– కాంగ్రెస్ రెండు లక్షల ఉద్యోగాల హామీ బోగస్
– కార్పొరేషన్లకు నిధులివ్వడంలేదు
– గిరిజనుల ఆత్మగౌరవాన్ని కాపాడిన కేసీఆర్
– తిమ్మారెడ్డిపల్లి బావోజీ జాతరలో మాజీ మంత్రి హరీష్ రావు
కొడంగల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 3: కొడంగల్ ప్రాంతంలో గిరిజనులు ఆత్మగౌరవంగా భావించే లోకామసంద్ మహరాజ్ బావోజీ దేవాలయానికి గతంలో కనీసం వాగు దాటి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. గతంలో ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి కృషితో నాటి సీఎం కేసీఆర్ రూ.8 కోట్లు ఇచ్చి వాగుపై బ్రిడ్జి నిర్మించారు. కేసీఆర్ మరో రూ.80 లక్షలు గుడి కోసం, రూ.50 లక్షలు బంజారా భవన్ కోసం కేటాయించారని హరీష్‌రావు అన్నారు. కొడంగల్ నియోజకవర్గం తిమ్మారెడ్డిపల్లి బావోజీ జాతరలో శుక్రవారం పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ లంబాడా పోరాట సమితి దశాబ్దాలుగా కొట్లాడితే కిరణ్ కుమార్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి వారు ఎవరూ పట్టించుకోలేదు. 3100 గిరిజన గూడెంలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్ దే. సేవాలాల్ మహరాజ్ జయంతిని అధికారికంగా జరిపించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది. ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచాం, ఆరు లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలిచ్చాం, మార్కెట్ కమిటీల్లో, వైన్ షాపుల కేటాయింపుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్. కొడంగల్ తండాల్లో ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చింది కేసీఆర్ కాదా.. ఆడబిడ్డల కోసం డిగ్రీ కాలేజీలు తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వంలో నేటి వరకు లంబాడీలకు మంత్రి పదవి లేదు. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఎస్టీ కార్పొరేషన్ కు బడ్జెట్లో రూ.2730 కోట్లు చూపించి ఖర్చు చేసింది రూ.52 కోట్లు మాత్రమే. రెండున్నరేళ్లలో ఒక్క ఎస్టీకి రూపాయి సాయం అందలేదు. ఎస్టీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వడం లేదు. సేవాలాల్ కార్పొరేషన్ కు రూ 100 కోట్లు కేటాయించి ఒక్క రూపాయి విడుదల చేయకుండా సేవాలాల్ మహరాజ్ గౌరవాన్ని కాంగ్రెస్ తగ్గించింది. ఓట్లప్పుడు వంగి వంగి దండాలు పెట్టి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అన్నావు.. అధికారంలోకి రాగానే కొడంగల్ లో ఎస్టీల భూములే లాక్కుంటున్నావా? జైళ్లలో పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తావా? ఇదేనా నీకు ఎస్టీల మీద ఉన్న ప్రేమ? ఇక్కడ చేసిందేమీ లేదు కానీ కేరళకు పోయి తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేశాం.. ఇక్కడ కూడా చేస్తాం అని డైలాగులు కొడుతున్నావు. తెలంగాణలో ఏ గ్యారెంటీలు అమలు చేశావు రేవంత్ రెడ్డీ అని ప్రశ్నించారు. గ్రామ సభలు పెడితే నీ నాయకుల మీద, అధికారుల మీద అక్కచెల్లెళ్లు తిరగబడ్డారన్నారు. కొడంగల్ లో ఏ ఊరికి పోదాం చెప్పు. ఏ ఊర్లో వంద శాతం రుణ మాఫీ జరిగిందో చూద్దాం రా రేవంత్ రెడ్డి.. నీ సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచే సవాల్ విసురుతున్నానన్నారు. కేరళ ప్రజలు నీకంటే తెలివైన వాళ్లు. గూగుల్ లో వెతికితే తెలంగాణలో ఎన్ని గ్యారెంటీలు అమలయ్యాయో వాళ్లకు తెలుస్తుంది. మహారాష్ట్రకు పోతే అక్కడ కాంగ్రెస్ ను ప్రజలు ఎండగట్టారు.. రేపు కేరళలో కూడా కాంగ్రెస్ ఓడిపోతుంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పడుకోబెట్టావు. 90 శాతం పనులు మేము పూర్తి చేస్తే మిగిలిన ఆ 5 శాతం పనులు కాలువలు, బండరాళ్లు తొలగించడం పూర్తిచేసి నీళ్లు ఇవ్వడానికి నీకు చేతకావడం లేదు. మేము నిర్మించిన ఏదుల, వట్టెం ప్రాజెక్టుల ద్వారా మొన్న వచ్చిన నీళ్లను నింపుకుంటే ఈపాటికి ఇక్కడ బంగారు పంటలు పండేవి. నీళ్లు ఇస్తే ఆ పేరు కేసీఆర్ కు వస్తుందనే కుట్రతోనే ప్రాజెక్టును ఆపేశావు. కడవల కాలువ నుంచి కొడంగల్-నారాయణపేట లిఫ్ట్ కింద లక్షన్నర క్యూసెక్కుల నీళ్లు తెచ్చే అవకాశం ఉన్నా కేవలం ఒక ప్రాజెక్టు కోసం రూ.4500 కోట్లు దండుకోవాలని చూస్తున్నావు. పాలమూరు-రంగారెడ్డి ద్వారా మక్తల్, నారాయణపేటకు లక్ష ఎకరాలు, కొడంగల్ కు లక్షన్నర ఎకరాలకు నీళ్లు వస్తాయి. కానీ నువ్వు ఇప్పుడు కొత్తగా రూ.4500 కోట్లతో తెస్తున్న లిఫ్ట్ ద్వారా మక్తల్ కు 25వేలు, నారాయణపేటకు 20వేలు, కొడంగల్ కు 50వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు వస్తాయి. ఈ కమీషన్ల కక్కుర్తి ఆపి, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి. గత రెండు సీజన్లలో నీళ్లను లిఫ్ట్ చేయకుండా ఆంధ్రాకు వదిలిపెట్టి పాలమూరు ప్రజలకు అన్యాయం చేసిన రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





