– త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యంగా ఆదాయం పెరగాలి
– ఆయా శాఖలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం
– రెవెన్యూ జనరేషన్ & రిసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: ఏఐ వంటి ఆధునిక టెక్నాలజీ వినియోగం, వివిధ శాఖల్లో పన్నుల ద్వారా వస్తున్న ఆదాయంపై నిరంతరం సమీక్ష, పకడ్బందీ నిర్వహణతో వివిధ శాఖల్లో ఆదాయం పెరుగుదల కనిపిస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో రెవెన్యూ జనరేషన్ అండ్ రిసోర్స్ మొబలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన శుక్రవారం జరిగింది. సమావేశంలో సభ్యులు మంత్రులు ఉత్తం కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఏఐ టెక్నాలజీ వినియోగంతో మైనింగ్, రవాణా శాఖల్లో ఆదాయ వనరులను పెంచుకోగలిగామని డిప్యూటీ సీఎం తెలిపారు. అధికారులు మరింత పకడ్బందీగా పనిచేసి ఇసుక, క్రషర్ మైనింగ్ విభాగాల్లో అక్రమ రవాణా, ఓవర్ లోడ్ వంటి వాటిపై పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నిరంతరం సమీక్షలు, పన్నుల నిర్వహణలో పకడ్బందీ చర్యల మూలంగా వాణిజ్య పన్నుల శాఖలో జీఎస్‌టీ దాయం గత మూడు నెలలుగా 15% పెరుగుదల కనిపించిందన్నారు. ఇదే తరహాలో రిజిస్ట్రేషన్ శాఖలో సైతం ఆదాయంలో పెరుగుదల కనిపించిందని తెలిపారు. ఆదాయ వనరులు పెంచుకునేందుకు ప్రతి శుక్రవారం రెవెన్యూ జనరేషన్ అండ్ రిసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం క్రమం తప్పకుండా నిర్వహిస్తామని తెలిపారు. 2047వరకు త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధన లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకున్న మేరకు అన్ని శాఖలు ఆదాయ సమీకరణకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో భూముల విక్రయానికి సంబంధించి ప్రపంచస్థాయిలో ప్రచారం నిర్వహించాలని, ఈ అంశంపై అందరికీ ముందస్తుగా సమాచారం అందడం మూలంగా ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంటుందని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తెలిపారు. భూముల విలువ పెంపునకు సంబంధించి రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే వివిధ కమిటీలు ఏర్పాటు చేసి అధ్యయనం పూర్తి చేశారు. ఆ కమిటీల నివేదికలను ముందుగా సబ్ కమిటీకి సమర్పించి ఆ తర్వాత కేబినెట్‌కు నివేదించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను భట్టి ఆదేశించారు. మెట్రో రైల్ స్వాధీనం, నిర్వహణ, ఆదాయ, వ్యయ మార్గాలపై అధికారులతో మంత్రులు సమీక్షించారు. ఎక్సైజ్, రెవెన్యూ, పరిశ్రమల శాఖలోనూ ఆదాయం పెంపునకు సంబంధించి చేపట్టిన చర్యలు, ఫలితాలపై మంత్రులు సమీక్ష చేశారు. ప్రతి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు వాటి ఫలితాలకు సంబంధించిన చర్యల నివేదికతో తదుపరి సమావేశాలకు రావాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఉన్నతాధికారులు సందీప్ కుమార్ సుల్తానియా, వికాస్ రాజ్, సబ్యసాచి ఘోష్, శ్రీధర్, ఎలంబర్తి శశాంక తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





