పంచాయతీలకు పెరిగిన నిధుల కోటా

– స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్రం సానుకూలం
– కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 14: రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థల బలోపేతానికి నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. దశాబ్ద కాలంగా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థలకు నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రూ.11వేల కోట్లకు పైగా నిధులను విడుదల చేసిందన్నారు. 2015-16 నుంచి 2019-20 మధ్యలో గ్రామ పంచాయతీలకు రూ.5,060 కోట్లు విడుదల చేయగా 2020-21 నుంచి 2025-26 మధ్య ఈ కేటాయింపులు 80% (రూ.9,050 కోట్లు) పెరిగాయని పేర్కొన్నారు. ఇందులో రూ.6,051 కోట్లను కేంద్రం విడుదల చేసిందన్నారు. గ్రామీణ స్థాయి నుంచి ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడం ద్వారా మారుమూల ప్రాంతాల వరకు కూడా జవాబుదారీతనం, పారదర్శకత పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం విశ్వసిస్తోందని, ఇందుకోసమే స్థానిక సంస్థలకు సంబంధించిన నిధులను మొదట్నుంచీ సమయానుగుణంగా విడుదల చేస్తోందని తెలిపారు. ఇటీవల తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో కేంద్రం మిగిలిన నిధులను కూడా త్వరలోనే విడుదల చేయనుందన్నారు. 2023-24లో నిధుల ఖర్చుపై యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లను రాష్ట్రం ఇటీవలే అందజేసిందని, గ్రామ పంచాయతీలకు ఎన్నికలు కూడా పూర్తయిన నేపథ్యంలో 2024-25 సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత రూ.260 కోట్లను త్వరలోనే కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుందని వెల్లడించారు. వీటి యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లు ఇవ్వగానే దశలవారీగా మిగిలిన రూ.2,500 కోట్ల కూడా విడుదల కానున్నాయన్నారు. గత ప్రభుత్వం గ్రామ పంచాయతీల అకౌంట్లను జప్తు చేసుకుని ఆ నిధులను ఇతర అవసరాల కోసం దారి మళ్లించిందని, దీని కారణంగా చాలామంది సర్పంచ్‌లు తమ హయాంలో చేసిన పనులకు నిధులు రానందున రాజీనామాలు చేశారని, కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా దురదృష్టకరమన్నారు. రాష్ట్రం ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుని గ్రామాభివృద్ధి కోసం కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు సహకరిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు చొరవ తీసుకోవాలని కిషన్‌రెడ్డి కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *