– కొత్త కాలనీలకు బస్సు రూట్లు పెంపుపై స్టడీ చేయండి
– నష్టాల్లో ఉన్న డిపోలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు
– లాభాల్లోకి వచ్చేలా ఆయా డిపోలకు ప్రత్యేక కార్యాచరణ
– ప్రమాదాలు తగ్గించడానికి డ్రైవర్ మానిటరింగ్ సిస్టం అమలు
– ఆర్టీసీ ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 13: మహాలక్ష్మి పథకం వచ్చాక సంక్షోభంలో ఉన్న ఆర్టీసీ క్రమక్రమంగా లాభాల బాటలోకి వస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి నెల వారీగా వస్తున్న మహాలక్ష్మి టికెట్ ఆదాయమే కాక అదనపు ఆదాయంపై దృష్టి సారించాలని బీసీ సంక్షేమం, రవాణా శాఖల మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ దిశా నిర్దేశం చేశారు. ఆర్టీసీ ఉన్నతాధికారులతో సచివాలయంలో గురువారం సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు మహిళలు 237 కోట్ల జీరో టికెట్ ఉపయోగించుకున్నారని, రూ.7980 కోట్లను ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిందని తెలిపారు. అయితే టికెటేతర ఆదాయంపై కూడా దృష్టి సారించాలని, బస్సులు, బస్ స్టేషన్‌లలో, టిమ్స్ ద్వారా జారీ చేసే టికెట్లపై ప్రకటనల ద్వారా ఆదాయాన్ని మరింత పెంచాలని సూచించారు. ప్రస్తుతం నష్టాల్లో కొనసాగుతున్న తాండూరు, వికారాబాద్, బీహెచ్‌ఈఎల్, మియాపూర్, కుషాయిగూడ, దిల్‌సుఖ్ నగర్, హకీంపేట్, రాణిగంజ్, మిథాని తదితర పలు డిపోలు నష్టాల బారిన ఉండడానికి గల కారణాలు, స్థానిక పరిస్థితులు, అవి లాభాల బాట పట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిటీ వేయాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని మంత్రి పొన్నం ఆదేశించారు. మేడారం జాతర సమీపిస్తుండటంతో ములుగు బస్ స్టేషన్ నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. డిసెంబర్‌లోపు స్లాబ్ పనులు పూర్తి చేయాలని, జాతర భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ములుగు జిల్లా ఏటూరునాగారం, పెద్దపల్లి జిల్లా బస్సు డిపో పనుల పురోగతిపై తెలుసుకున్నారు. పుష్కరాలు వచ్చే లోపు మంథని బస్ స్టేషన్ ఆధునికీకరణ పూర్తి కావాలని ఆదేశించారు. మధిర బస్ స్టేషన్ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. హుజూర్‌నగర్, కోదాడ బస్ స్టేషన్‌ల శంకుస్థాపన వారం రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. మిర్యాలగూడ అప్‌గ్రెడేషన్ పనులు ప్రారంభించాలన్నారు.
బస్సులు, డిపోలు పెంచాలి
నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికులకనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుకునేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని మంత్రి పొన్నం ఆదేశించారు. నగరంలో ఇప్పటికే 500 వరకు ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నందున పీఎం ఈ-డ్రైవ్ కింద హైదరాబాద్‌కు కేటాయించిన రెండు వేల బస్సులు విడతల వారీగా రానుండడంతో అందుకు సంబంధించిన చార్జింగ్ స్టేషన్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. నగరంలో పెరుగుతున్న కొత్త కాలనీలకు, నగరానికి సంబంధించిన వారు ఉదాహరణగా కొల్లూరు వద్ద డబుల్ బెడ్ రూంలలో నివసిస్తున్న వేలాదిమందికి రవాణా సౌకర్యాలు కల్పించడానికి డిమాండ్‌కనుగుణంగా కొత్త రూట్లలో బస్సులు నడిపించేలా స్థానిక డీఎం, ఇతర అధికారులతో ఆయా ప్రాంతాల్లో పర్యటించి నివేదికను రూపొందించి బస్సులు నడిపేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది ఇప్పటివరకు 578 బస్సులు కొత్తగా రాష్ట్రంలో రోడ్డెక్కాయని, త్వరలో మరిన్ని రానుండడంతో వాటిని ప్రయాణికుల ట్రాఫిక్ ఎక్కువగా ప్రాంతాల్లో నడపాలని చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకనుగుణంగా ఫోర్త్ సిటీలో బస్ టెర్మినల్ నిర్మాణం, బస్ సౌకర్యాలపై అధ్యయనం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. నగరంలో పెరుగుతున్న జనాభాకనుగుణంగా కొత్త డిపోలకు అవసరమైన స్థల పరిశీలన చేసి జిల్లా కలెక్టర్ సహకారంతో ప్రభుత్వానికి నివేదిక అందించాలని సూచించారు. నగరంలో నలువైపులా బస్ స్టేషన్‌లు ఉండేలా చూడాలని, జేబీఎస్ మాదిరి ఆరాంఘర్‌లో అధునాతన బస్సు టెర్మినల్ నిర్మించడానికి ఆర్టీసీ పోలీస్ శాఖకు సంబంధించిన భూ బదలాయింపు ప్రక్రియ పూర్తి చేయాలని, ఉప్పల్‌లో కూడా నిర్మించడానికి అధ్యయనం చేయాలని ఆదేశించారు. రవాణా శాఖ సీజ్ చేసిన వాహనాలు బస్సు డిపోలో చాలా కాలంగా పేరుకుపోవడంతో వారికి సమయం ఇచ్చి వేలం వేయాలని మంత్రి సూచించారు. ఆర్టీసీలో ప్రమాదాలను తగ్గించడానికి తొలి దశలో లహరి, రాజధాని, గరుడ బస్సుల్లో అమలవుతున్న డ్రైవర్ మానిటరింగ్ సిస్టం పని తీరును అడిగి తెలుసుకున్నారు. దీని ద్వారా డ్రైవర్ నిద్రకు ఉపక్రమించే సూచనలను, మొబైల్ వాడుతున్నప్పుడు మానిటరింగ్ చేస్తూ అప్రమత్తం చేస్తుందన్నారు. ఇక ఆర్టీసీ హైర్ బస్సు డ్రైవర్‌లకు నిరంతరం శిక్షణ ప్రతి బస్సుకు ఇద్దరు డ్రైవర్లు తప్పనిసరి నిర్ణయాన్ని కఠినతరం చేయాలన్నారు. డ్రైవర్లకు నిరంతరం మెడికల్ టెస్ట్ నిర్వహించాలని సూచించారు. ప్రమాదాలు తగ్గించడానికి డ్రైవర్లకు నిరంతర శిక్షణ, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే ఆర్టీసీ ఉద్యోగులతో త్వరలో జూమ్ సమావేశం నిర్వహిస్తానని మంత్రి ప్రభాకర్ వెల్లడిరచారు. ఇది విజయవంతం అయితే రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్సుల్లో అమలు చేసేలా కార్యాచరణ తీసుకోవాలని ఆదేశించారు. తార్నాక హాస్పిటల్‌లో రోగుల బంధువుల కోసం ఏర్పాటు చేస్తున్న డార్మిటరీ రూంను త్వరతిగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఆర్టీసీ ఫంక్షన్ హాల్‌కు వస్తున్న ఆదాయం, ఖర్చులు వివరాలపై ఆరా తీశారు. దీని ద్వారా మరింత ఆదాయం పెంచుకోవాలని మంత్రి పొన్నం సూచించారు.
నియామకాలు త్వరగా పూర్తి చేయాలి
ఇప్పటికే ఆర్టీసీలో 1000 ఆర్టీసీ డ్రైవర్లు, 743 శ్రామిక్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో జరుగుతున్న ఇంటర్వ్యూ దశలో ఉండడంతో నియామకాలు వేగంగా పారదర్శకంగా జరిగేలా పూర్తి చేయాలని మంత్రి తెలిపారు. వచ్చే డిసెంబర్ చివరి లోపు 84 ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ, 114 సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నియామక ప్రక్రియ టీజీపీఎస్సీ లేదా పోలీస్ బోర్డు ద్వారా నియమించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కారుణ్య నియామకాల కింద చేరిన కండక్టర్లకు ఉన్న మూడేళ్ల ప్రొవిజన్ పీరియడ్‌ను రెండేళ్లకు తగ్గించేలా పరిశీలించాలని అధికారులకు సూచించారు.
మిగిలిన 450 బస్సులు కూడా తీసుకోవాలి
మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు అద్దె ప్రాతిపదికన నడిపించాలని సెర్ఫ్ తో ఆర్టీసీ ఒప్పందం చేసుకుంది. ఇప్పటివరకు 150 బస్సులు మహిళా సంఘాలు-ఆర్టీసీ సంయుక్తంగా నడిపిస్తున్నాయి. మిగిలిన 450 బస్సులు కూడా మహిళా సంఘాల ద్వారా తీసుకోవాలని మంత్రి పొన్నం ఆదేశించారు. గత ఏడాది మేడారం జాతర కోసం 3490 బస్సులు నడపగా 16.83 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీలో ప్రయాణించారు. ఈసారి జాతర కు 20 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీలో ప్రయాణిస్తారని అంచనా వేస్తూ 3800 బస్సులు నడపడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. సమీక్షా సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





