– ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయానికి మంత్రి సురేఖ
హన్మకొండ, ప్రజాతంత్ర, జనవరి 14 : భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో ఉన్న ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో దేవాదాయ, ధర్మాదాయ, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు హాజరైన మంత్రి సురేఖకు ఆలయ అధికారులు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు మంత్రి, ఎమ్మెల్యేలకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేదమంత్రోచ్చారణల మధ్య స్వామివారి ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి, ఎమ్మెల్యేలు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, వైద్య సేవలు, భద్రత వంటి మౌలిక వసతులు సరిగా అందుతున్నాయా లేదా అని భక్తులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. అలాగే ఐనవోలు జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్‌ను మంత్రి సురేఖ ఎమ్మెల్యే నాగరాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు బస్సులో ప్రయాణించి ఏర్పాట్లను పరిశీలించారు.
మంత్రి సురేఖ మాట్లాడుతూ భోగి పర్వదినాన ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. దేవాలయాల అభివృద్ధి, బ్రహ్మోత్సవాలు, జాతరల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని స్పష్టం చేశారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. స్వామివారి కృపతో రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, శ్రేయస్సు, సుభిక్షం కలగాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ భోగి పర్వదినం సందర్భంగా బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం అపారమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించిందన్నారు. ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం తెలంగాణకేకాక దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రాచీన శైవక్షేత్రమని తెలిపారు. ఆలయ కమిటీ, దేవాదాయ శాఖ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడం అభినందనీయమన్నారు. భోగి పండుగ పాత కష్టాలను విడిచిపెట్టి కొత్త ఆశలతో ముందుకు సాగాలనే సందేశాన్ని ఇస్తుందన్నారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరికీ ఆరోగ్యం, శాంతి, సుభిక్షం కలగాలని, వర్ధన్నపేట నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో టెస్కాబ్ మాజీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, ఆలయ కమిటీ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, ఆలయ ఈవో సుధాకర్, కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



