గవర్నర్లు, రాష్ట్రపతికి గడువు విధించలేం

– గవర్నర్లకు మూడు అంశాల్లోనే నిర్ణయం
– సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు

న్యూదిల్లీ,నవంబర్‌ 20: గవర్నర్‌,‌ రాష్ట్రపతి అధికారాలపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. పెండింగ్‌ ‌బిల్లుల ఆమోదానికి సంబంధించిన అంశంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువును విధించటం తగదని స్పష్టం చేసింది. కారణం చెప్పకుండా గవ‌ర్న‌ర్లు బిల్లులను వెనక్కి పంపలేరని తెలిపింది. బిల్లును నిరవధికంగా నిలిపివేసే అధికారం గవర్నర్‌కు లేదని కూడా తేల్చి చెప్పింది. గవర్నర్‌ ‌బిల్లును రాష్ట్రపతికి పంపితేనే రాష్ట్రపతి చర్యలు తీసుకోగలరని చెప్పింది. ఆర్టికల్‌ 200 ‌ప్రకారం గవర్నర్‌కు విచక్షణాధికారం ఉందని వెల్లడించింది. తన ముందుకు వచ్చిన బిల్లులను గవర్నర్‌ ‌రాష్ట్రపతికి పంపడం, అభిప్రాయాలతో తిరిగి పంపడం, బిల్లును పరిశీలించి సూచనలు ఇవ్వడం వంటివి మాత్రమే చేస్తారని తెలిపింది. రాష్ట్ర పరిపాలనలో తుది అధికారం ప్ర‌జ‌లు ఎన్నుకున్న‌మంత్రివర్గానిదేనని స్పష్టం చేసింది. ఒక రాష్ట్రంలో రెండు ఎగ్జిక్యూటివ్‌ ‌పవర్స్ ఉం‌డవని, ప్రభుత్వం ఒక్కటే ప్రధాన నిర్ణయాధికారి అని తేల్చి చెప్పింది. రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లులకు ఆమోదం తెలిపే విషయంలో న్యాయస్థానం రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించటంపై ఆర్టికల్‌ 143 ‌కింద రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పంపిన ప్రెసిడెన్షియల్‌ ‌రిఫరెన్స్‌పై స్పందిస్తూ సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది. రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయస్థానం గడువు విధించడంపై దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము సంధించిన ప్రశ్నలపై సీజేఐ జస్టిస్‌ ‌బి.ఆర్‌.‌గవాయ్‌ ‌నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం సమాధానమిచ్చింది. కారణం చెప్పకుండా గవర్నర్లు బిల్లులను వెనక్కి పంపలేరని వెల్లడించింది. ఈ మేరకు దీనిపై గతంలో ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సీజేఐ ధర్మాసనం పక్కనబెట్టింది. గవర్నర్‌కు రాజ్యాంగపరంగా మూడు ఆప్షన్లు ఉంటాయి. బిల్లులకు సమ్మతి తెలియజేయడం, కారణం చెప్పి బిల్లును రిజర్వ్‌లో పెట్టడం లేదా రాష్ట్రపతికి పంపడం, బిల్లును తిరస్కరించి అసెంబ్లీకి పంపడం. ఈ మూడు ఆప్షన్లు ఎంచుకోవడంలో గవర్నర్‌ ‌విచక్షణాధికారాన్ని ఉపయోగిస్తారు. ఇందుకు న్యాయస్థానాలు గడువు విధించడం సబబు కాదని అభిప్రాయపడ్డారు. గవర్నర్ల విధుల నిర్వహణ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవు. కానీ, కారణం లేకుండా దీర్ఘకాలంగా బిల్లులను పెండింగ్‌లో ఉంచిన సందర్భాల్లో కోర్టులు పరిమిత విచక్షణతో వ్యవహరించొచ్చు. రాష్ట్రపతి విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. నిరవధిక ఆలస్యం కొనసాగుతున్న సందర్భాల్లో అది న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందని తెలిపారు.  గవర్నర్‌ ‌బిల్లును రాష్ట్రపతికి రిజర్వ్ ‌చేసిన ప్రతిసారీ ఆర్టికల్‌ 143 ‌కింద రాష్ట్రపతి సుప్రీంను సంప్రదించాల్సిన అవసరం లేదు. ఆర్టికల్‌ 200 ‌కింద గవర్నర్లకు విచక్షణాధికారం ఉంటుంది. అయితే, దాన్ని అపరిమితంగా వినియోగించలేరు. శాసనసభలు ఒకటికి రెండుసార్లు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఆమోదం తెలపకుండా కాలయాపన చేయడం, రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నవీ తీవ్ర జాప్యానికి గురికావడంపై ఈ ఏడాది ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ అంశంలో గవర్నర్‌తో పాటు రాష్ట్రపతికీ గడువు విధించింది. గరిష్ఠంగా మూడు నెలల్లోగా ఆ బిల్లులను ఆమోదించడమో, తిప్పి పంపించడమో చేయాలని జస్టిస్‌ ‌జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ ఆర్‌.‌మహాదేవన్‌ ‌ధర్మాసనం నిర్దేశిరచింది. దీంతో రాజ్యాంగ అధికరణం 143(1) ప్రకారం తనకున్న అధికారాన్ని వినియోగిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మే నెలలో పలు ప్రశ్నలతో సీజేఐకి లేఖ రాశారు. రాష్ట్రపతి విచక్షణ అధికారాల పరిధిలోకి వచ్చే రాష్ట్రాల బిల్లులకు ఆమోదం తెలిపే అంశంలో న్యాయస్థానం గడువు విధించడం ఎంతవరకు న్యాయ సమ్మతమో తెలపాలంటూ సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరారు. దీనిపై సీజేఐ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. పది రోజులపాటు అన్ని పక్షాల వాదనలను ఆలకించిన ధర్మాసనం సెప్టెంబరు 11న తీర్పు రిజర్వు చేసింది. ఈ విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించలేమంటూ తాజాగా తీర్పు వెలువరించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page