ఇన్ సర్వీస్ టీచ‌ర్ల‌ను ‘టెట్’ నుండి మినహాయించాలి

– ఎస్‌టీయూ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి రాంబాబు

హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 9ః సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులను ‘టెట్’ నుండి మినహాయించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని, అందుకనుగుణంగా ఎన్‌సీటీఈ నిబంధనలు, విద్యా హక్కు చట్టాలను సవరించాలని ఎస్‌టీయూ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి వేమునూరి రాంబాబు డిమాండ్ చేశారు.
ఆల్ ఇండియా జాక్టో పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలిపారు. స్థానిక కుమార్ పల్లి ప్రభుత్వ పాఠశాలలో రాంబాబు, మండల ఆర్థిక కార్యదర్శి శ్రీధర్ఉ, పాధ్యాయురాలు నీరజ నల్ల బ్యాడ్జీ ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులందరూ ఉద్యోగంలో ఉండాలంటే ‘టెట్’ పాస్ కావాలని ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వటం ఉపాధ్యాయులపాలిట శాపంగా మారిందని, ఇతర ఏ విభాగంలో లేని విధంగా ఉపాధ్యాయులకు మాత్రమే పరీక్షలు పెట్టడం సరికాదని అన్నారు. ఇర‌వ‌య్యేళ్ల‌కు పైగా వృత్తిలో ఉండి అపార అనుభవం ఉన్న ఉపాధ్యాయులు పదవీ విరమణకు దగ్గరైన వయసులో అర్హత పరీక్ష పాస్ కావాలని అనటం వారిని అవమానించటమే అవుతుందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీం కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని, ఈ తీర్పుకు కారణం అయిన ఎన్‌సీటీఈ, ఆర్‌టీఈ నిబంధనలు వెంట‌నే సవరించాలని వారు కోరారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *