గ్రేటర్‌లో నిమజ్జనానికి సర్వం సన్నద్ధం

– 48 గంటలు.. యంత్రాగం హై అలర్ట్‌
– 303 కి.మీ రోడ్డు మార్గంలో శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తి
– 3 షిఫ్టులలో విధుల్లో 15 వేల మంది శానిటేషన్‌ సిబ్బంది
– ఊరేగింపు జరిగే మార్గాలలో రోడ్లకు మరమ్మతులు పూర్తి
– హుస్సేన్‌ సాగర్‌ చుట్టూ 11 పెద్ద క్రేన్‌లు సహా 40 క్రేన్‌ల ఏర్పాటు
– బాహుబలి క్రేన్‌ పాయింట్‌ 4 వద్ద ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనం
– చిన్న కలర్‌ పేపర్‌ ముక్కలు శోభాయాత్రలో వాడకండి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఈనెల 6న జరిగే గణేష్‌ నిమజ్జన కార్యక్రమం సురక్షితంగా, ఎకో ఫ్రెండ్లీ విధానంలో సాఫీగా జరిగేలా జీహెచ్‌ఎంసీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తిశ్రద్ధలతో నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూసేందుకు పోలీస్‌, రెవెన్యూ, విద్యుత్‌, హెచ్‌ఎండీఏ, జలమండలి, ట్రాఫిక్‌ పోలీస్‌, ఆర్‌అండ్‌బి, హైడ్రా, వైద్య ఆరోగ్య, పర్యాటక, సమాచార శాఖలను సమన్వయం చేసుకుంటూ జీహెచ్‌ఎంసీ ముందుకు సాగుతోంది. జీహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో 20 ప్రధాన లేక్‌లతోపాటు ప్రత్యేకంగా 72 కృత్రిమ కొలనులలో నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేశారు. దీనివల్ల ట్రాఫిక్‌ ఇబ్బందులు దూరం అవ్వడంతోపాటు భక్తులకు సౌలభ్యంగా ఉంటుంది.
ప్రధాన జలవనరులపై ఒత్తిడి తగ్గనుంది. 134 స్థిర క్రేన్‌లు, 259 మొబైల్‌ క్రేన్లు, ఒక బాహుబలి క్రేన్‌, 10 పెద్ద క్రేన్‌లు సహా హుస్సేన్‌సాగర్‌ చుట్టూ మొత్తం 20 క్రేన్‌లు ఏర్పాటు చేశారు. ఫలితంగా కీలకమైన హుస్సేన్‌ సాగర్‌ లో నిమజ్జనం వేగంగా, సాఫీగా జరగనుంది. బాహుబలి క్రేన్‌ నెంబర్‌ 4 ద్వారా ఖైరతాబాద్‌ మహా గణేష్‌ విగ్రహాన్ని నిమజ్జనం చేయనున్నారు. నిమజ్జన పాయింట్ల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా హైడ్రా, పర్యాటకశాఖ సమన్వయంతో హుస్సేన్‌సాగర్‌లో 9 బోట్లను, డీఆర్‌ఎఫ్‌ టీంలను, 200మంది గత ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. పోలీసు సహకారంతో 13 కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు.

303 కి.మీ మార్గం సంసిద్ధం

303.3 కిలోమీటర్ల మేర ప్రధాన ఊరేగింపు మార్గంలో గణేష్‌ విగ్రహాల నిమజ్జన శోభాయత్ర సజావుగా జరిగేందుకు 160 గణేష్‌ యాక్షన్‌ టీంలను జీహెచ్‌ఎంసీ నియమించింది. ఇప్పటికే ఈ మార్గంలో జీహెచ్‌ఎంసీ రోడ్ల మరమ్మత్తులు పూర్తి చేసింది. శోభాయాత్రకు అనువుగా విద్యుత్‌, కేబుల్‌ వైర్లను సరిచేసింది. చెట్ల కొమ్మలు తొలగించింది.

స్వచ్ఛతకు పెద్ద పీట

నిమజ్జన కార్యక్రమంలో స్వచ్ఛతకు పెద్ద పీట వేసేలా 15 వేల మంది పారిశుధ్య సిబ్బంది మూడు షిఫ్టులలో పనిచేస్తున్నారు.
వినాయక చవితి ప్రారంభం ఇప్పటి వరకూ 125 జేసీబీలు, 102 మినీ టిప్పర్‌ లు ఉపయోగించి 10,500 మెట్రిక్‌ టన్నులకు పైగా అధిక వ్యర్థాలను సేకరించి జవహర్‌ నగర్‌లోని ప్రాసెసింగ్‌ సెంటర్‌కు తరలించారు. గణేష్‌ ప్రతిమల నిమజ్జనం జరిగే ప్రదేశాలలో 39 మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశారు.

విద్యుత్‌ వెలుగులు, అత్య‌వ‌స‌ర వైద్య సేవ‌లు
నిమజ్జనం జరిగే ప్రదేశాలతోపాటు ఊరేగింపు జరిగే మార్గంలో మొత్తం 56,187 టెంపరరీ లైటింగ్‌ను జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసింది. నిమజ్జనం పూర్తి అయ్యే వరకూ నూరు శాతం దీపాలు వెలిగేలా అధికారులు మానిటర్‌ చేస్తున్నారు.
నిమజ్జన పాయింట్‌లలో మూడు షిఫ్టులలో పనిచేసేలా అంబులెన్స్‌లు సహా 7 మెడికల్‌ క్యాంపులను సిద్దంగా ఉంచారు.

కలర్‌ పేపర్‌ ముక్కలు ఊరేగింపులో వాడొద్దు

గణేష్‌ నిమజ్జనం సజావుగా, సాఫీగా జరిగేలా చూస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ తెలిపారు. సకాలంలో గణేష్‌ ప్రతిమలను నిమజ్జనానికి తరలించాల్సిందిగా నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. గణేష్‌ ప్రతిమల ఊరేగింపు జరిగే మార్గాలలో నిర్దేశించిన గార్బేజి పాయింట్లులోనే చెత్తను వేయాలని ప్రజలను, భక్తులను ఆయన కోరారు. ఊరేగింపులో కలర్‌ పేపర్‌ ముక్కలు ఎగురవేయవద్దని భక్తులు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వీటిని తొలగించడం కష్టతరమని, ప్రయాణికుల కళ్లలో పడతాయని, పర్యావరణానికి హాని చేస్తాయని చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *