– చిన్నారుల భవిష్యత్తును పణంగా పెట్టడం సమంజసమా?
– వారితో అసభ్యకరమైన కంటెంట్ ఉంటే నేరం
– ఇలాంటి వాటిని తొలగించండి.. భవిష్యత్తులో పెట్టకండి
– లేదంటే చర్యలు తప్పవని సీపీ సజ్జన్నార్ హెచ్చరిక
హైదరాబాద్, ప్రజాతంత్ర,అక్టోబర్16: వ్యూస్ మాయలో పడి విలువలు మరిచిపోతే ఎలా అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ యూ ట్యూబర్లను ప్రశ్నించారు. వ్యూస్, లైక్స్‌తో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు చిన్నారుల భవిష్యత్తును పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనర్లతో కొన్ని యూట్యూబ్ ఛానళ్లు చేస్తున్న ఇంటర్వ్యూలను ఉద్దేశిస్తూ ఎక్స్‌లో సజ్జనార్ పోస్ట్ పెట్టారు. చిన్నారులతో అసభ్యకరమైన కంటెంట్ చేస్తూ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని నిలదీశారు. చిన్నారులు, యువతకి స్ఫూర్తినిచ్చే, ఆదర్శంగా నిలిచే వ్యక్తులను ఇంటర్వ్యూలు చేసి సమాజాభివృద్ధికి దోహద పడండి. అంతేకానీ ఇలాంటి వీడియోలు వారితో చేసి పిల్లలను పెడదోవ పట్టించవద్దు. గుర్తు పెట్టుకోండి.. ఇది బాలల హక్కుల ఉల్లంఘనే కాదు.. చట్టరీత్యా నేరం. పోక్సో, జువైనల్ జస్టిస్ చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని హెచ్చరించారు. పిల్లలను ఇలాంటి కంటెంట్‌లో భాగం చేయడం వారిని వేధించడం కిందికే వస్తుంది. మైనర్లతో ఈ తరహా కంటెంట్ చేసే వారిపట్ల పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుంది. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంది. తక్షణమే వీటిని తొలగించకున్నా.. భవిష్యత్తులో ఇలాంటి కంటెంట్ అప్‌లోడ్ చేసినా చట్టప్రకారం కేసులు నమోదు చేస్తాం అని కూడా హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు దృష్టికి వస్తే వెంటనే రిపోర్టు చేయండి. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి. హెల్ప్‌లైన్ నంబర్ 1930కి గానీ.. జాతీయ సైబర్ క్రై పోర్టల్ లో ఫిర్యాదు చేయండని సూచించారు. తల్లిదండ్రులుగా పిల్లలను పెంచడం మాత్రమే కాదు.. వారి బాల్యం, మానసిక ఆరోగ్యం, భవిష్యత్తును కాపాడటం కూడా బాధ్యతే అనే విషయం మరిచిపోవద్దని సజ్జనార్ పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





