విజయవాడలో 28,29 తేదీల్లో ఐజేయూ 11వ ప్లీనరీ 

హైదరాబాద్/చండీఘర్, మార్చి 18: ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ 11 వ ప్లీనరీ (మహాసభలు) ఈనెల‌ 28, 29 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ ( అమరావతి) లో జరగనున్నట్లు ఐజేయూ అధ్యక్షులు కే.శ్రీనివాసరెడ్డి, సెక్రటరీ జనరల్ బల్విందర్ సింగ్ జమ్మూ , జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా హాజరై ప్లీనరీ సమావేశాలను ప్రారంభిస్తారని, పలువురు కేంద్రమంత్రులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు అతిథులుగా హాజరై సందేశాలు ఇస్తారని తెలిపారు. ఐజేయూ రెండవ ప్లీనరీ సమావేశాలు 1992 లో విజయవాడలో జరిగాయనీ, తిరిగి 34 ఏళ్ల తర్వాత 11 వ ప్లీనరీ కి ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆతిథ్యం ఇస్తోందని ఆ ప్రకటనలో వివరించారు. ఈ సమావేశాలకు దేశంలోని 25 రాష్ట్రాల నుండి ఎన్నికైన ప్రతినిధులు, ఆయా రాష్ట్రాల ఐజేయూ అనుబంధ యూనియన్ల అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు హాజరౌతారని తెలిపారు. సమావేశాల్లో దేశంలో నేడు మీడియా రంగంలో నెలకొన్న స్థితిగతులు, వృత్తిపరమైన సమస్యలు, ఇటీవల మీడియా స్వేచ్ఛకు ఎదురవుతున్న ప్రమాదాలు, సంస్థాగత విషయాలు, వంటింశాలపై చర్చలు జరుగుతాయని వారు ఆ ప్రకటనలో వివరించారు. మీడియా సంబంధిత అంశాలపై పది తీర్మానాలను ఆమోదించడంతోపాటు, వర్కింగ్ జర్నలిస్టుల వృత్తిపరమైన సమస్యల పరిష్కారం కోసం, జర్నలిస్టుల హక్కులు, సంక్షేమ చర్యల సాధన కోసం చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణను సమావేశాలు ఖరారు చేస్తాయని ఆ ప్రకటనలో తెలిపారు. రానున్న రెండేళ్ల పదవీ కాలానికి నూతన జాతీయ కార్యవర్గ ఎన్నికలు కూడా ప్లీనరీలో జరుగుతాయని ఆ ప్రకటనలో తెలిపారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) చీఫ్ పాట్రన్ గా సి.రాఘవాచారి మీడియా అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ అధ్యక్షునిగా, ఎ.పి.యు.డబ్ల్యూ.జే. అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు ప్రధాన కార్యదర్శిగా ఏర్పాటైన ఆహ్వానసంఘం ప్లీనరీని విజయవంతం చేయడానికి చురుగ్గా కృషి చేస్తున్నదని యూనియన్ నాయకులు  వివరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *