ప్రజలకు మేలుచేస్తే, పదేళ్లయినా ఉంటారు!

“ఏడాదిన్నర గడచిపోయింది. పరిపాలన మీద ప్రజలలో ఒక ఉజ్జాయింపు అంచనా ఏర్పడింది. అనుకూలత తగ్గడం, ప్రతికూలత పెరగడం వంటి నిర్ణయాత్మక సూచనలు కనిపించకపోవచ్చును కానీ, పెదవి విరుపులు కనిపిస్తున్నాయి, నిట్టూర్పులు వినిపిస్తున్నాయి. జరగవలసినంత జరగకపోవడానికి, జరుగుతూ వస్తున్నవి కూడా కుంటుపడడానికి కారణాలు అన్నీరేవంత్‌రెడ్డి సమర్థతకు సంబంధించినవి కావు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆయనకు అనుకూలించడం లేదు. అధిగమించడానికి చేసే ప్రయత్నాలు కూడా అనాలోచితమైనవిగాను, అసాధ్యమైనవిగాను ఉంటున్నాయి. ఎట్లాగైనా గెలుపు చేజిక్కించుకోవాలని చేసిన వాగ్దానాలలో అనేకం అరకొరగానే నెరవేరుతున్నాయి. కొత్తగా జనాన్ని ఆకర్షించే కార్యక్రమాలకు ఆస్కారం ఉండడం లేదు. ప్రజలలో వ్యక్తం అవుతున్న అసమ్మతి విషయంలో ప్రభుత్వ వ్యవస్థలు దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తున్నాయి. ఒక సాధారణ విమర్శనాత్మక ట్వీట్‌ను షేర్‌ చేసినా వారాల కొద్దీ జైలులో పెడుతున్నారు. ఈ బలహీనతలు, నిర్బంధచర్యలు ప్రతిపక్ష బిఆర్‌ఎస్‌కు గట్టి సానుకూలతలుగా మారుతున్నాయి.”

సిద్దరామయ్యను చూసి రేవంత్‌ రెడ్డి కూడా ధైర్యం తెచ్చుకుంటున్నట్టుంది. శివకుమార్‌ తో కలసి ఐదేళ్ల పదవీకాలాన్ని పంచుకోవలసిన కర్ణాటక ముఖ్యమంత్రి, ఏడాది కూడా కాకముందే తాను పూర్తికాలం పదవిలో ఉంటానని చెప్పుకోవడం మొదలుపెట్టారు. శివకుమార్‌ మీద కేసులు ఉన్నాయి, కేంద్రం కన్ను ఉంది. అదీ కాక, సిద్దరామయ్యకు సభలో మంచి బలం ఉంది. అధిష్ఠానం ఎట్లాగూ బలహీనంగా ఉంది. అన్నీ కలసివచ్చి, ఆయన అట్లా మాట్లాడుతున్నారు, కొనసాగుతున్నారు. శివకుమార్‌ కూడా సర్దుకుంటున్నారు.

రేవంత్‌ అట్లా కాదు. అధిష్ఠానం వేసే తులసిదళం ఆయన తులాభారానికి కీలకం. భట్టి, ఉత్తమ్‌కుమార్‌, కోమటిరెడ్డి, పొంగులేటి, ఇట్లా అనేకమంది బలశాలురు కాంగ్రెస్‌ కొలువుకూటంలో ఉన్నారు. ఏ ఒక్కరికీ పూర్తి బలం ఉండకపోవచ్చును కానీ, గద్దె మీద ఉన్నవారిని ఇబ్బందిపెట్టగలిగిన సత్తా మాత్రం చాలా మందికి ఉంది. అట్లాగే, సిద్దరామయ్యకు ఉన్న జనాకర్షణ,ప్రతిష్ఠ రేవంత్‌రెడ్డికి ఇంకా సమకూరలేదు. పైగా, తన పనితీరు మీద అధిష్టానం ఏమంత ఆనందంగా లేదన్న కథనాలు వింటున్నాము. అయినా, అటువంటి ప్రకటన చేయడం ధిక్కారమో, దుస్సాహసమో అనిపించదా?

కొల్లాపూర్‌ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి ప్రదర్శించిన ఆత్మవిశ్వాసానికి ప్రతిపక్షాల నుంచి వచ్చినంత స్పందన, స్వపక్షం నుంచి రాలేదు. ఒక్క రాజగోపాలరెడ్డి మాత్రం, అధిష్ఠానాన్ని తక్కువ చేసి మాట్లాడవద్దన్నట్టు అభ్యంతరం చెప్పారు. కొందరు ఎమ్మెల్యేలు కూడా రేవంత్‌ ప్రకటనను తప్పుపట్టారు. కోరిక ఉండడంలో తప్పులేదు. అన్నీఅనుకూలిస్తే, ఎంత కాలమైనా ఎవరైనా అధికారంలో ఉండవచ్చు. అయితే, కేవలం భీషణ ప్రకటనలు చేయడమే చాలదు కదా, ఈ పదవీకాలం పూర్తిచేయడానికి, మరో హయాం కూడా పోటీపడడానికి ప్రయత్నాలు కూడా చేయాలి. ఆ దిశగా, రేవంత్‌రెడ్డి పెద్దగా దృష్టిసారిస్తున్నట్టు కనిపించడం లేదు.

ఏడాదిన్నర గడచిపోయింది. పరిపాలన మీద ప్రజలలో ఒక ఉజ్జాయింపు అంచనా ఏర్పడింది. అనుకూలత తగ్గడం, ప్రతికూలత పెరగడం వంటి నిర్ణయాత్మక సూచనలు కనిపించకపోవచ్చును కానీ, పెదవి విరుపులు కనిపిస్తున్నాయి, నిట్టూర్పులు వినిపిస్తున్నాయి. జరగవలసినంత జరగకపోవడానికి, జరుగుతూ వస్తున్నవి కూడా కుంటుపడడానికి కారణాలు అన్నీరేవంత్‌రెడ్డి సమర్థతకు సంబంధించినవి కావు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆయనకు అనుకూలించడం లేదు. అధిగమించడానికి చేసే ప్రయత్నాలు కూడా అనాలోచితమైనవిగాను, అసాధ్యమైనవిగాను ఉంటున్నాయి. ఎట్లాగైనా గెలుపు చేజిక్కించుకోవాలని చేసిన వాగ్దానాలలో అనేకం అరకొరగానే నెరవేరుతున్నాయి. కొత్తగా జనాన్ని ఆకర్షించే కార్యక్రమాలకు ఆస్కారం ఉండడం లేదు. ప్రజలలో వ్యక్తం అవుతున్న అసమ్మతి విషయంలో ప్రభుత్వ వ్యవస్థలు దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తున్నాయి. ఒక సాధారణ విమర్శనాత్మక ట్వీట్‌ను షేర్‌ చేసినా వారాల కొద్దీ జైలులో పెడుతున్నారు. ఈ బలహీనతలు, నిర్బంధచర్యలు ప్రతిపక్ష బిఆర్‌ఎస్‌కు గట్టి సానుకూలతలుగా మారుతున్నాయి. అధికారపక్ష ఆకర్షణలోకి బిఆర్‌ఎస్‌ శాసనసభ్యులు పెద్దసంఖ్యలో వెళ్లి, ఆ పార్టీ మరింతగా బలహీనపడుతుందని భావించగా, రేవంత్‌రెడ్డి పాలనా వైఫల్యాలు, రాజకీయతప్పిదాలు అందుకు విరుద్ధమైన ఫలితాలను ఇచ్చాయి. ఇప్పుడు బిఆర్‌ఎస్‌ రాష్ట్రప్రభుత్వంతో గట్టిగా తలపడుతున్నది. తాను ఒకవైపు కాళేశ్వరం, ఫోన్‌ట్యాపింగ్‌ విచారణలతో ఉక్కిరిబిక్కిరి అవుతూనే, ప్రభుత్వం మీద బలమైన విమర్శాస్త్రాలు సంధిస్తున్నది. రాష్ట్ర ప్రయోజనాలకు, తెలంగాణ మనోభావాలకు హానకరమైన విధానాలను రేవంత్‌ రెడ్డి అనుసరిస్తున్నారన్న అభిప్రాయాన్ని ప్రజలలో కలిగించడంలో బిఆర్‌ఎస్‌ సఫలమవుతున్నది.

“చంద్రబాబుతో అంత ‘మర్యాద’గా మాట్లాడే రేవంత్‌ రెడ్డి, కెసిఆర్‌ విషయంలో ఇంత దురుసుగా ఎందుకు ఉండాలి అన్నప్రశ్న తెలంగాణవాదులలో కలుగుతుంది. పాలమూరు బిడ్డగా తాను పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగాలి, తాను చేసే మంచిపనులు చూసి కెసిఆర్‌ కుమిలిపోవాలి- అంటారు రేవంత్‌. ప్రత్యర్థులు ఈర్ష్య పడేంతగా మంచి పనులు చేయండి, సంతోషమే. కానీ, మీ మాటలో అంత హింసాత్మకత ఎందుకు ధ్వనించాలి? చీటికి మాటికి ఆస్పత్రుల పాలుకావడాలు, అటునుంచి అటే పోవడాలు వంటి ఆలోచనలు ఎందుకు? ఎన్ని విమర్శలున్నవ్యక్తి విషయంలో అయినా, కొన్ని రకాల వ్యక్తీకరణలను సభ్యసమాజం హర్షించదు. దుర్భాష మాత్రమే కాదు, దుర్భావం కూడా వాంఛనీయం కాదు. కెసిఆర్‌ ఉద్యమనాయకుడు, తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి. ఆయనను గౌరవించాలి. రాజకీయ నాయకుడిగా ఆయనను విమర్శించండి. తీవ్రంగా విమర్శించండి, కానీ, సభ్యతతో విమర్శించండి.”

వీటన్నటి మధ్య నోరుచేసుకోవడం తప్ప మరో గత్యంతరం లేదన్న పద్ధతిలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారు. సంచలనశీలమైన, వివాదాస్పదమైన ప్రకటనలు చేయడం, ప్రతిపక్ష నేతల మీద మర్యాదల హద్దులు మీరి మాట్లాడడం ద్వారా, తెలంగాణ సమాజాన్ని మభ్యపెడుతున్నారు. బనకచర్ల వివాదంలో తన వైఖరి కలిగిస్తున్న విముఖతల నుంచి మరో వైపు ప్రజల దృష్టి మళ్లించడానికి రేవంత్‌రెడ్డి శుక్రవారం నాటి కొల్లాపూర్‌ సభా ప్రసంగాన్ని ఉపయోగించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రితో రేవంత్‌ నంగిగా వ్యవహరిస్తున్నారన్న విమర్శను బిఆర్‌ఎస్‌ బలంగానే సంధించింది. దాన్నిదృష్టిలో పెట్టుకుని కాబోలు, పాలమూరు ప్రాజెక్టులకు అడ్డుపడవద్దని చంద్రబాబుకు రేవంత్‌ ‘విజ్ఞప్తి’ చేశారు. “వేడుకున్నారు,దేబిరించారు, ప్రాధేయపడ్డారు” అని ప్రతిపక్షమీడియా రాసింది కానీ, రేవంత్‌ చేసింది ఒక విజ్ఞప్తి, విజ్ఞప్తులు వినకపోతే పోరాటమన్న ఒక మెత్తటి హెచ్చరిక. గతంలో కూడా ఒక సారి చంద్రబాబును ఆయన హెచ్చరించినంత పని చేశారు. ప్రజలలో స్థిరపడిన, నాటుకున్నకొన్నిముద్రలను అధిగమించడం కష్టమని రేవంత్‌రెడ్డికి ఆయన సలహాదారులెవరన్నా (ఎవరన్నాఉంటే) చెప్పాలి. బనకచర్ల విషయంలో రాష్ట్రప్రయోజనాలే తనకు ముఖ్యమని జనం నమ్మేతీరులో ఆయన గట్టి వైఖరిని అనుసరించడం తప్ప, ఆ ముద్రలు పోవడానికి మరోమార్గం లేదు. చంద్రబాబుతో కలయిక ఎందుకు అని అడిగితే, కెటిఆర్‌ లోకేశ్‌ను కలిశారని పోటీ ఆరోపణలు చేయడం అపరిపక్వస్పందనే తప్ప అన్యం కాదు.

చంద్రబాబు ట్రంప్‌ లాంటి వారు. పాకిస్థాన్‌ కాళ్లబేరానికి వచ్చినందువల్లనే మనం కాల్పుల విరమణకు అంగీకరించామని భారత్‌ చెప్పుకోవాలనుకుంటుంది. వెంటనే ట్రంప్‌ తానే ఇద్దరినీ గదమాయించి విరమింపజేశానని అంటాడు. తాజాగా శుక్రవారం నాడు కూడా ట్రంప్‌ మాట అన్నారు. బనకచర్ల విషయం మాట్లాడనే లేదంటారు రేవంత్‌. ఆ విషయం మాట్లాడామని ఏపీ మంత్రి అంటారు. రెండు కళ్ల సిద్ధాంతం, సమైక్యవాదం తెలంగాణ సమాజం మనసులో ఇంకా పచ్చిగానే ఉన్నాయని తెలిసీ, చంద్రబాబు రెండు తెలుగురాష్ట్రాల క్షేమం గురించి, తెలుగువారందరి మంచి గురించి మాట్లాడి, రేవంత్‌ను ఇరకాటంలో పెడతారు. తన పూర్వసహచరుడికి రాజకీయంగా ఇబ్బంది కలిగించేవిధంగా మాట్లాడకూడదనే పట్టింపు ఆయనకు లేకపోయింది. ఇప్పటికిప్పుడు, రేవంత్‌-చంద్రబాబు విషయంలో జనం ఒక నిర్ణయానికి వస్తారని కాదుకానీ, రేవంత్‌కు వ్యతిరేకంగా నిర్మాణమయ్యే జనాభిప్రాయంలో అది ఒక ముఖ్యమైన అంశం. ఆ బీజం ఇప్పటికే పడింది. మొక్కగా ఉన్నప్పుడే ఆ ముద్రను తొలగించుకోవాలి తప్ప, ఎన్నికలనాటికి అది మానై పెరిగి వంగనంటుంది.

విపక్షీయులు, ప్రత్యర్థి మీడియా కల్పించే అప్రదిష్ఠలకు పెద్దగా విలువ ఇవ్వకూడదు నిజమేకానీ, అవి బలపడుతున్నప్పుడు, వాటికి సాక్ష్యాలుగా పనికివచ్చే పరిణామాలు కనిపిస్తున్నప్పుడు జాగ్రత్తపడవలసిన అవసరం ఉంటుంది. నిజమా అబద్ధమా అని కాదు, జనం దాన్ని నమ్ముతున్నారా లేదా అన్నది ఒక్కోసారి పట్టించుకోవలసిన విషయం అవుతుంది. రేవంత్‌కు, కేంద్రప్రభుత్వానికి లేదా బిజెపికి ఉన్న సంబంధాల గురించి కొన్ని ‘ఇంప్రెషన్స్‌’ ఏర్పడి ఉన్నాయి. కేంద్రప్రభుత్వ పెద్దలను రేవంత్‌ తరచు కలవడం, వారు కూడా అడిగిన వెంటనే భేటీకి సిద్ధపడడం, కొన్ని వ్యాఖ్యానాలకు దారితీశాయి. వాటిని పెద్దగా ఖాతరు చేయనక్కరలేదు కానీ, రాష్ట్రంలో బిజెపి రేవంత్‌ విషయంలో ‘మృదువు’గా ఉండడం జనం రకరకాలుగా అనుకోవడానికి ఆస్కారం ఇస్తోంది. అనేక సమాంతర ప్రాబల్యబృందాల మధ్య అధిష్ఠానం ఆశీస్సులతో ఉన్నకాంగ్రెస్‌ ముఖ్యమంత్రిని ముప్పుతిప్పలు పెట్టగలిగిన కేంద్రం ఆ ఆ పని ఎందుకు చేయడంలేదు? అన్నది కూడా ఆలోచించవలసిన ప్రశ్నే. చంద్రబాబు బిజెపి కూటమిలో భాగస్వామిగా ఉండడం వల్ల ఈ సఖ్యత ఏర్పడిందా అని అనుమానించేవారూ ఉన్నారు. అప్పుడప్పుడు రేవంత్‌ అయినా, బిజెపిని తీవ్రంగా విమర్శిస్తారుకానీ, బిజెపి పెద్దలు ప్రధానంగా బిఆర్‌ఎస్‌ మీదనే ఇంకా గురిపెడుతున్నారు. “గోదావరి వరదజలాల విషయంలో ఎపి ముఖ్యమంత్రి ఏదో ప్రణాళికతో వచ్చారు, ఆయన కంటె ఆరునెలల ముందు నువ్వు ముఖ్యమంత్రివి అయ్యావు, గోదావరి గురించి ఏమి ఆలోచించావు’’ అని కిషన్‌ రెడ్డి వేసిన ప్రశ్నే ఇప్పటివరకు తెలంగాణ ముఖ్యమంత్రి మీద బిజెపి చేసిన పెద్దవిమర్శ కావచ్చు. (అవును, రెండేళ్లలో మూసీప్రాజెక్టు, నాలుగోమహానగరం వంటివి తప్ప పెద్ద జలప్రాజెక్టులు ఎందుకు ఆలోచించలేదు? ప్రభుత్వాలకు ఖర్చే అయినా, పార్టీలకు, నేతలకు ఆదాయమార్గాలైన ప్రాజెక్టుల విషయంలో రేవంత్‌కు చొరవ ఎందుకు లేకపోయింది? ఉభయరాష్ట్రాలలో ప్రభుత్వాలు ఏవైనా, నిర్మాణసంస్థలు ఒకటే కదా? పైగా అటువంటి సీమాంతర అనుబంధాన్ని బిఆర్‌ఎస్‌ కూడా అభ్యంతరపెట్టదు!)

చంద్రబాబుతో అంత ‘మర్యాద’గా మాట్లాడే రేవంత్‌ రెడ్డి, కెసిఆర్‌ విషయంలో ఇంత దురుసుగా ఎందుకు ఉండాలి అన్నప్రశ్న తెలంగాణవాదులలో కలుగుతుంది. పాలమూరు బిడ్డగా తాను పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగాలి, తాను చేసే మంచిపనులు చూసి కెసిఆర్‌ కుమిలిపోవాలి- అంటారు రేవంత్‌. ప్రత్యర్థులు ఈర్ష్య పడేంతగా మంచి పనులు చేయండి, సంతోషమే. కానీ, మీ మాటలో అంత హింసాత్మకత ఎందుకు ధ్వనించాలి? చీటికి మాటికి ఆస్పత్రుల పాలుకావడాలు, అటునుంచి అటే పోవడాలు వంటి ఆలోచనలు ఎందుకు? ఎన్ని విమర్శలున్నవ్యక్తి విషయంలో అయినా, కొన్ని రకాల వ్యక్తీకరణలను సభ్యసమాజం హర్షించదు. దుర్భాష మాత్రమే కాదు, దుర్భావం కూడా వాంఛనీయం కాదు. కెసిఆర్‌ ఉద్యమనాయకుడు, తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి. ఆయనను గౌరవించాలి. రాజకీయ నాయకుడిగా ఆయనను విమర్శించండి. తీవ్రంగా విమర్శించండి, కానీ, సభ్యతతో విమర్శించండి.

పదేళ్ల కిందటి నుంచి తెలంగాణ రాజకీయ సంవాదంలో సంస్కారం పాలుతగ్గుతూ వచ్చింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత అది మరింత క్షీణించింది. పోటాపోటీగా మారింది. అధికారపక్ష నేత ఎట్లాగూ దూకుడుగా, మొరటుగా తీవ్రధ్వనితో మాట్లాడతారు. గతంలో నాజూకుగా, నాగరికంగా మాట్లాడేవారు కూడా కొత్త భాష, వ్యక్తీకరణ నేర్చుకుంటున్నారు. ఏ విషయంలో అయినా ముఖ్యమంత్రి ప్రమాణం చేసి నిజానిజాలు చెప్పవలసి రావడమే విషాదం అనుకుంటే, మనుమడి పేరుతో ఒట్టుపెట్టుకోవాలని ప్రతిపక్ష నాయకుడొకరు డిమాండ్‌ చేయడమేమిటి? రాజకీయాలతో నిమిత్తం లేని ఆ చిన్న పిల్లవాడిని రొచ్చులోకి లాగడమేమిటి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *