తప్పు చేస్తే విచారణ ఎదుర్కోవాల్సిందే!

– అధికారంలో ఉండగా ఉద్యమకారులు గుర్తు రాలేదా?
– జాతిపిత అంటే ఆస్తులు కొల్లగొట్టేవారు కాదు
– తెలంగాణ కోసం సర్వం కోల్పోయిన రావి నారాయణ రెడ్డి
– జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అవార్డు దక్కడం సముచితం
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 2:  తప్పు చేస్తే ఎంతటి వారైనా విచారణ ఎదుర్కోక తప్పదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బంజారాహిల్స్ లోని రావినారాయణ రెడ్డి ఆడిటోరియంలో జరిగిన రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ తెలంగాణ కోసం సర్వం కోల్పోయిన మహనీయుడు రావి నారాయణ రెడ్డి అని  గుర్తు చేశారు. ఈ మధ్య తెలంగాణ జాతిపిత అని కొందరు వాళ్లకు వాళ్లే రాసుకుంటున్నారని, ఉద్యమకారులమని వాళ్లే చెప్పుకుంటున్నారని విమర్శించారు. పోలీసులు చిన్న నోటీసులు ఇస్తే జాతిపితకు నోటీసులు ఇస్తారా అని అంటున్నారని, తెలంగాణ సమాజానికి అవమానం జరిగిందని ప్రచారం చేస్తున్నారని సీఎం ఎద్దేవా చేశారు. ఆనాడు జాతిపిత గాంధీజీ పదవులను త్యాగం చేశారని,  దుర్మార్గుల తూటాలకు ప్రాణాలు వదిలారని గుర్తు చేశారు. ఇప్పుడు జాతిపిత అని చెప్పుకుంటున్న వాళ్లు ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులను ఏకం చేసి ఉద్యమాన్ని నడిపించిన ప్రొఫెసర్ కోదండరాం ఉద్యమకారుడు కాదా అని ప్రశ్నించారు. వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్న వాళ్లు ఉద్యమకారులు ఎలా అవుతారన్నారు. ఆనాడు తలుపులు బద్దలు కొట్టి కోదండరాంను అరెస్టు చేసినప్పుడు ఉద్యమకారులు గుర్తుకు రాలేదా అని ముఖ్యమంత్రి నిల‌దీశారు. నోటీసులు ఇచ్చి విచారణకు పిలిస్తేనే ఏదో జరిగినట్లు రాద్దాంతం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినప్పుడు అర్థం చేసుకుని హుందాగా తప్పుకుంటే కొంతైనా మీ గౌరవం నిలబడేదన్నారు. ప్రజలే తప్పు చేశారని చెప్పడం.. ఇదెక్కడి ప్రజాస్వామ్యం, ఇదెక్కడి ఉద్యమకారుడి లక్షణం, ఇదెక్కడి జాతిపిత లక్షణం అని ప్రశ్నించారు. అక్రమ మార్గం ఎంచుకున్న వారికి ప్రజాస్వామ్యంలో విచారణ ఎదుర్కోవాల్సిందే అని అంబేద్కర్ చెప్పారని, శిబు సోరెన్ లాంటి వాళ్లు విచారణ ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. మధ్య యుగాల చక్రవర్తులు తమ బాధను రాజ్యం బాధగా ప్రచారం చేసేవారని, ఇది ప్రజాస్వామ్య యుగమని, మధ్య యుగాల చక్రవర్తులకు కాలం చెల్లిందని విమర్శించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *