– తన పాలన చూపి ఉప ఎన్నికలకు వెళ్లే ధైర్యం రేవంత్‌కు ఉందా?
– శేరిలింగంపల్లి కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ సవాల్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 24: దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేసి తిరిగి గెలవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు సవాల్ విసిరారు. రేవంత్ తన 20 నెలల పాలనలో ప్రజలకు చేసిన మంచిని చూపించి ఉప ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఓటమి భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్ల కాలంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమంతో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోయిందని కేటీఆర్ అన్నారు. 2014లో గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్కు ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉండేవారని గుర్తు చేశారు. కేసీఆర్ సీఎం అయిన ఆరు నెలల్లోనే తీవ్ర విద్యుత్ సమస్యను పూర్తిగా పరిష్కరించారని చెప్పారు. తెలంగాణకు గుండెకాయగా హైదరాబాద్‌ను కేసీఆర్ మార్చారని, అందుకే 2023లో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా కాంగ్రెస్‌కు రాలేదని తెలిపారు. హైడ్రా అరాచకాలతో హైదరాబాద్ నగర వృద్ధి అతలాకుతలమైందని కేటీఆర్ తీవ్రంగా ఆరోపించారు. దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి అక్రమంగా కట్టిన ఇంటిని కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా అని ప్రశ్నించారు. పేదల ఇళ్లు కూలగొడుతున్న హైడ్రా పెద్దల జోలికి వెళ్లడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల బ్లాక్ మెయిల్ దందాల కోసమే హైడ్రా పనిచేస్తోందని ఆరోపించారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలన వర్సెస్ కాంగ్రెస్ 20 నెలల పాలన
బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో ఎన్నడూ రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో నాయకులు వేలు పెట్టలేదని, కబ్జాలు, గూండాగిరి చేయలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. కానీ 20 నెలల్లోనే హైడ్రా పేరుతో కాంగ్రెస్ నాయకులు అరాచకం సృష్టించారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పదేళ్లలో రూ.2 లక్షల 85 వేల కోట్ల అప్పు చేస్తే రేవంత్ రెడ్డి 20 నెలల్లోనే రూ.2 లక్షల 20 వేల కోట్ల అప్పు చేశారని విమర్శించారు. కేసీఆర్ చేసిన అప్పుతో హైదరాబాద్‌లో 42 ఫ్లైఓవర్లు, అత్యాధునిక హాస్పిటళ్లు, మురుగునీటి శుద్ధి కేంద్రాలు కట్టారని, కానీ రేవంత్ ఒక్క కొత్త బ్రిడ్జి కానీ, మోరీ కానీ కట్టిండా అని ప్రశ్నించారు. కేసీఆర్ 70 లక్షల మంది రైతు ఖాతాల్లో రూ.70 వేల కోట్లు వేస్తే రూ.2 లక్షల కోట్ల అప్పు చేసిన రేవంత్ ఏం చేశారని నిలదీశారు.
స్వార్థం కోసమే పార్టీ మారారు
శేరిలింగంపల్లి, మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రజల కోసం కాక తమ సొంత లాభం కోసమే కాంగ్రెస్‌లోకి వెళ్లారని కేటీఆర్ ఆరోపించారు. ఒకరోజు కేసీఆర్ మీద, ఇంకోరోజు తన మీద కేసులంటూ రేవంత్ పిచ్చిగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ మహానగరానికి ఆయన చేసిందేమీ లేదన్నారు. నాయకులు మోసం చేసినా కార్యకర్తలు మాత్రం గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకున్నారని ప్రశంసించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండిరగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.





