గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ప్రారంభం ముదావహం
సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18: గూగుల్ ప్రారంభించినప్పటి నుంచి ప్రపంచం మారిపోగా నేడు మన జీవితాలు పూర్తిగా డిజిటల్‌మయమయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్‌ను నగరంలో ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో గూగుల్ మొదటి సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ (GSEC)ను హైదరాబాద్ నగరంలో ప్రారంభించడం తనకు సంతోషంగా ఉందన్నారు. మన ఆర్థిక వ్యవస్థ, మన ప్రభుత్వం, మన జీవితాలు డిజిటల్ కు మారాయంటూ డిజిటల్ సురక్షితంగా ఉంటే మనం మరింత అభివృద్ధి చెందుతామని చెప్పారు. మనం గోప్యత, భద్రత గురించి నేడు ఆందోళన చెందుతున్నాం.. ఈ సందర్భంగా అధునాతన సైబర్ సెక్యూరిటీ, భద్రతా పరిష్కారాల కోసం గూగుల్ ఈ సైబర్-సెక్యూరిటీ హబ్‌ను ఉపయోగిస్తున్నందుకు నేను గర్విస్తున్నాను.. ఇది నైపుణ్యాభివృద్ధిపై దృష్టిపెడుతుంది.. ఉపాధిని సృష్టించడంతోపాటు దేశపు సైబర్ భద్రతా సామర్థ్యాన్ని పెంచుతుంది అని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు ఉత్తమ పెట్టుబడి అనుకూల రాష్ట్రం కోసం శోధిస్తే దానికి సమాధానం తెలంగాణ అని వస్తుందని నాకు కచ్చితంగా తెలుసు.. మీకు సెర్చ్‌లో మొదటి లింక్ హైదరాబాద్ వస్తుంది.. దీన్ని తాము తెలంగాణ రైజింగ్ అని పిలుస్తాము.. 2035 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలనుకుంటున్నాము అని చెప్పారు. తాము కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలనుకుంటున్నాం.. తమ రైతులను సంపన్నులుగా తయారు చేయడంతోపాటు సంతోషంగా ఉంచాలనుకుంటున్నాం.. తమ యువతలో నైపుణ్యాలు పెంచడంతోపాటు వారికి ఉపాధి కల్పించాలనుకుంటున్నాం.. వీటన్నిటికీ మాకు మీ మద్దతు అవసరం అన్నారు. తెలంగాణ రైజింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా కావాలని కోరుకుంటున్నా అని సీఎం రేవంత్ అన్నారు. గూగుల్, హైదరాబాద్ పాత స్నేహితులు. 2007లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గూగుల్ తన మొదటి కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిందన్నారు. దాదాపు ఏడువేల మంది గూగుల్ ఉద్యోగులు నేడు హైదరాబాద్‌ను తమ ఇల్లుగా భావిస్తున్నారు.. విద్య, భద్రత, మ్యాప్‌లు, ట్రాఫిక్, స్టార్టప్‌లు, ఆరోగ్యం ఇలా అనేక రంగాల్లో గూగుల్‌తో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. గూగుల్ ఒక వినూత్న సంస్థ అయితే తమది ఒక వినూత్న ప్రభుత్వమని చెప్పారు. నాణ్యమైన విద్య తమ లక్ష్యమని, ఇందుకోసం యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను తీసుకొస్తున్నామని, తెలంగాణలో ప్రతి సంవత్సరం 1.10 లక్షల ఇంజనీర్స్ కాలేజీల నుంచి వస్తున్నారని, వీరిలో చాలామందికి నైపుణ్యం ఉండడం లేదని అన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు కోసం ఆనంద్ మహీంద్రా నేతృత్వం(పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం)లో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే అందరికీ ఆరోగ్యం లక్ష్యం.. ఇవే తమ ప్రధాన ఆవిష్కరణలు అని సీఎం వివరించారు. గూగుల్ లాగానే, తమ ప్రభుత్వంలో భాగస్వాములైన మహిళలు, యువత, రైతులు, పేదలు, మధ్యతరగతి, సీనియర్ సిటిజన్లు, పిల్లలకు ఉన్నతమైన జీవన ప్రమాణాలు కల్పించాలని కోరుకుంటున్నాం.. మనం కలిసి గొప్ప ప్రమాణాలను సృష్టిద్దాం.. హైదరాబాద్‌లో మీ కొత్త సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు చేసినందుకు మరోసారి అభినందిస్తున్నాను.. మేం గర్వపడేలా మీరు పనిచేస్తారని విశ్వసిస్తున్నాను అని సీఎం పేర్కొన్నారు.
హైదరాబాద్ అంటే ఒక భవిష్యత్తు : ఐటీ మంత్రి దుద్దిళ్ల
భావితరాల అవసరాలకనుగుణంగా భవిష్యత్తును నిర్మించాలి అన్నదే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వ సంకల్పం.. ఆ దిశగానే తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. తెలంగాణ ‘ఎథికల్ ఇన్నోవేషన్’లో ఇతర రాష్ట్రాలకు టార్చ్ బేరర్‌గా దిశా నిర్దేశం చేస్తోందని, మాగ్నెట్ ఫర్ గ్లోబల్ కేపిటల్‌గా ఎదిగిందని, మోడల్ ఆఫ్ ఇన్క్లూసివ్ డిజిటల్ గవర్నెన్స్‌గా మార్గదర్శకంగా నిలుస్తోందని చెప్పారు. హైదరాబాద్ అంటే ఒక నగరం కాదు.. ఒక భవిష్యత్తు. 2024-25లో హైదరాబాద్ నుంచి రూ.2.68 లక్షల విలువైన ఐటీ/ఐటీఈఎస్ సేవలు ఎగుమతి అయ్యాయి.. 40వేల మందికి కొత్తగా ఐటీ ఉద్యోగాలు లభించాయి. అంతర్జాతీయ టాప్ 10 టెక్ దిగ్గజ కంపెనీల్లో 7 ఇక్కడ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి.. గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్(జీఎస్‌ఈసీ) హైదరాబాద్ ఐటీ రంగాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని బలంగా విశ్వసిస్తున్నాను‘ అని ఆయన అన్నారు. విశ్వ యవనికపై హైదరాబాద్ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తమయ్యేలా ఈ కేంద్రం దోహదపడుతుందని నమ్ముతున్నానన్నారు. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కే కొలదీ అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి.. ఇంటర్నెట్ వినియోగం సవాలుగా మారింది.. క్షణం అప్రమత్తంగా లేకపోయినా సైబర్ మోసాల బారిన పడే అవకాశముంది.. తప్పుడు సమాచారంతో ముప్పు వాటిల్లే ప్రమాదముంది.. ఈ ఉపద్రవం మన వ్యక్తిగత జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.. ఈ ఏఐ యుగంలో సైబర్ సెక్యూరిటీ అనేది సవాలుగా మారింది.. ఇలాంటి తరుణంలో భారత్‌లో అది కూడా హైదరాబాద్‌లో ఆసియాలోనే మొదటి జీఎస్‌ఈసీని ఏర్పాటు చేసేందుకు గూగుల్ ముందుకు రావడం ఆహ్వానించదగ్గ పరిణామం‘ అని మంత్రి చెప్పారు. ‘గ్లోబల్ సెక్యూరిటీ హబ్’గా ఈ కేంద్రం ఇంటర్నెట్‌ను సురక్షితంగా వినియోగించేలా భారతీయుల్లో ముఖ్యంగా తెలంగాణ ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు గూగుల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు. మా ప్రభుత్వ లక్ష్యం డిజిటల్ తెలంగాణ 2.0 మాత్రమే కాదు.. సేఫ్ డిజిటల్ తెలంగాణ 2.0.. అందుకనుగుణంగానే పాఠశాలస్థాయి నుంచే సురక్షిత ఇంటర్నెట్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.. ఈ ప్రయాణంలో గూగుల్ మాదిరిగానే మిగిలిన టెక్ దిగ్గజ సంస్థలు తెలంగాణతో కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నానని మంత్రి శ్రీధర్‌బాబు కోరారు.





