– 2,900 కిలోల ఐఈడీ తయారీ పదార్థాల స్వాధీనం
– హర్యానాతో కలిసి కాశ్మీర్ పోలీసుల ఆపరేషన్
- పలువురు ఉగ్రవాదుల అరెస్ట్.. వారిలో నలుగురు డాక్టర్లు
న్యూదిల్లీ,నవంబర్10: దేశ రాజధాని దిల్లీ సమీపంలో ఉగ్రవాదులకు సంబంధించిన ఆయుధాలు భారీఎత్తున లభ్యమయ్యాయి. హరియాణాలోని ఫరిదాబాద్‌లో 350 కిలోల అమ్మోనియం నైట్రేట్ సంబంధిత పేలుడు పదార్థాలు, ఒక రైఫిల్ సహా 20 టైమర్లను స్వాధీనం చేసుకున్నట్టు స్థానిక పోలీస్ కమిషనర్ సతేందర్ కుమార్ గుప్తా వెల్లడించారు. ఉగ్రనిరోధక చర్యల్లో జమ్మూకశ్మీర్ పోలీసులు భారీ విజయం సాధించారు. హరియాణా పోలీసులతో కలిసి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ ఉగ్ర మాడ్యూల్ గుట్టురట్టు చేశారు. నిషేధిత జైషే మహమ్మద్, అన్సార్ ఘజ్‌వత్-ఉల్-హింద్ ఉగ్రసంస్థలతో సంబంధం ఉన్న ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఇందులో ముగ్గురు వైద్యులూ ఉన్నారు. ఈ క్రమంలోనే పెద్దఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రితోపాటు 2,900 కిలోల ఐఈడీ తయారీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. జమ్మూకశ్మీర్ పోలీసు ప్రతినిధి వెల్లడించిన వివరాల ప్రకారం అక్టోబరు 19న శ్రీనగర్‌లోని బన్‌పొరా నౌగామ్ ప్రాంతంలో పోలీసులు, భద్రతాబలగాలను లక్ష్యంగా చేసుకుని జైషే మహమ్మద్ పోస్టర్లు వెలిశాయి. ఈ వ్యవహారంపై ఉపా చట్టంతోపాటు ఆయా చట్టాల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఉగ్రవాద భావజాలం కలిగిన విద్యార్థులు, ప్రొఫెషనల్స్‌తో కూడిన ఓ ఉగ్రవ్యవస్థ వెలుగుచూసింది. ఈ బృందానికి పాకిస్థాన్, ఇతర దేశాల నుంచి పనిచేస్తున్న హ్యాండ్లర్లతో సంబంధాలున్నాయి. సామాజిక, ధార్మిక కార్యక్రమాల ముసుగులో అవసరమైన నిధులు సేకరించారు. వ్యక్తుల్లో తీవ్రవాద భావజాలాన్ని ప్రేరేపించి ఉగ్రసంస్థల్లో చేర్పించడం, లాజిస్టిక్స్ ఏర్పాటు, ఆయుధాలు, మందుగుండు సామగ్రితోపాటు ఐఈడీల తయారీకి అవసరమైన పదార్థాల సేకరణలో పాల్గొన్నట్లు గుర్తించాం. ఈ కార్యకలాపాల సమన్వయం కోసం నిందితులు ఎన్‌క్రిప్టెడ్ ఛానెళ్లను ఉపయోగించారని పోలీసు ప్రతినిధి వెల్లడించారు. ఉగ్ర పోస్టర్లు అంటించిన డాక్టర్‌ను విచారిస్తే భారీ ఆయుధ డంప్ వెలుగులోకి వొచ్చింది. అరెస్టైన వైద్యుల్లో జమ్మూకశ్మీర్‌లోని కుల్గాంకు చెందిన ఆదిల్, పుల్వామాకు చెందిన ముజమ్మిల్ అహ్మద్, లఖ్‌నవూకు చెందిన షాహీన్ ఉన్నారు. హరియాణాలోని ఫరీదాబాద్‌లో డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ అద్దె నివాసంలో పోలీసులు భారీ ఎత్తున పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇతడు అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో బోధకుడిగా పనిచేస్తున్నాడు. శ్రీనగర్‌లో జైషే మమహ్మద్ పోస్టర్లు వేసిన కేసులోనూ వాంటెడ్‌గా ఉన్నాడు. ఇతడిని అరెస్టు చేసినట్లు అంతకుముందు ఫరీదాబాద్ కమిషనర్ సతేందర్ కుమార్ గుప్తా వెల్లడించారు. మరోవైపు షాహీన్ కారులో ఓ ఏకే-47 రైఫిల్ లభ్యమైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా జమ్మూకశ్మీర్ లోని ఆయా ప్రాంతాలతోపాటు హరియాణాలోని ఫరీదాబాద్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని సహారన్‌పుర్‌లో స్థానిక పోలీసులతో కలిసి సోదాలు నిర్వహించాం.. ఈ క్రమంలోనే మరికొంతమంది నిందితుల పాత్ర బయటపడింది.. వారినీ అరెస్టు చేస్తాం.. ఇప్పటివరకు ఓ చైనీస్ స్టార్, బెరెట్టా పిస్టల్స్, ఏకే 56, ఏకే క్రింకోవ్ రైఫిళ్లు, 2,900 కిలోల ఐఈడీ తయారీ పదార్థాలు స్వాధీనం చేసుకున్నాం.. నిధులకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని జమ్మూకశ్మీర్ పోలీసు ప్రతినిధి తెలిపారు. వీటితోపాటు మూడు మ్యాగజైన్లు, పిస్టల్, వాకీటాకీ సెట్‌ను స్వాధీనపరచుకున్నట్టు పేర్కొన్నారు. శ్రీనగర్‌లో అక్టోబర్ 27న జైష్-ఎ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు మద్దతుగా పలు పోస్టర్లు వెలిశాయి. వీటిని కశ్మీర్‌కు చెందిన వైద్యుడు ఆదిల్ అహ్మద్ రాథర్ వేసినట్టు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు పసిగట్టారు. సదరు వ్యక్తి ఉత్తర్ ప్రదేశ్ సహరాన్‌పుర్‌లోని ఓ హాస్పిటల్‌లో వైద్యుడిగా సేవలందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అతణ్ని గతవారం అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. నిందితుడు గతేడాది అక్టోబర్ ముందువరకూ అనంత్‌నాగ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో విధులు నిర్వర్తించాడని, అక్కడ అతని లాకర్‌ను తనిఖీ చేయగా ఒక రైఫిల్ దొరికిందని తెలిపారు. అతను ఇచ్చిన సమాచారం ప్రకారమే ఫరిదాబాద్‌లో ఈ రికవరీ జరిగినట్టు వెల్లడించారు. నిందితుడు రాథర్ చెప్పిన ప్రకారం.. ముజామ్మిల్ షకీల్ అనే మరో డాక్టర్ వద్ద కూడా పేలుడు పదార్థాలు, ఆయుధ సామాగ్రి నిల్వ ఉన్నట్టు తేలింది. దీంతో పుల్వామాకు చెందిన షీకల్‌నూ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడు ఫరిదాబాద్‌లోని ఆల్-ఫలాహ్ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించి ఓ మహిళా వైద్యురాలి కారులో ఒక రైఫిల్, పిస్టల్ బయటపడ్డాయి. మందుగుండు సామగ్రిని నిల్వ చేసేందుకు వినియోగించిన కారును స్వాధీనం చేసుకున్న దర్యాప్తు అధికారులు ఆమెపై విచారణ చేపట్టారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.
–





ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే