– ఐసిఐసిఐ బ్యాంక్ నిర్ణయం
న్యూదిల్లీ, ఆగస్టు 9: ప్రైవేట్ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్ తన సేవింగ్స్ ఖాతాల కనీస బ్యాలెన్స్ నిబంధనల్లో భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 1 తర్వాత తెరిచిన కొత్త ఖాతాలకు అమలులోకి వచ్చిన ఈ మార్పు మెట్రో, అర్బన్, సెవిూ-అర్బన్, గ్రావిూణ ఖాతాదారులందరిపై ప్రభావం చూపనుంది. ఈ పెంపుతో దేశీయ బ్యాంకులలో అత్యధిక కనీస సగటు బ్యాలెన్స్‌లో ఐసీఐసీఐ బ్యాంక్‌దే అవుతుంది. సవరించిన నిబంధనల ప్రకారం మెట్రో, అర్బన్ ప్రాంతాల ఖాతాదారులు సగటున రూ.50,000 కనీస నిల్వ ఉంచాలి. ఇది ఇంతకుముందున్న రూ.10,000 నుంచి ఐదు రెట్లు పెరిగినట్టే. సెవిూ-అర్బన్ బ్రాంచ్‌లలో కనీస బ్యాలెన్స్ రూ.5,000 నుంచి రూ.25,000కు పెరిగింది. అలాగే గ్రావిూణ బ్రాంచిలలో రూ.2,500 నుంచి రూ.10,000కు పెంచారు. కాగా, దేశంలోనే అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2020లోనే మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనను పూర్తిగా రద్దు చేసింది. ఇతర బ్యాంకులు సాధారణంగా రూ.2,000 నుంచి రూ.10,000 వరకు మాత్రమే ఉంచేలా నిబంధనలు అమలు చేస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మెట్రో, అర్బన్‌లో రూ.10,000, సెవిూ-అర్బన్‌లో రూ.5,000, గ్రావిూణ బ్రాంచ్‌లలో రూ.2,500గా ఉంచింది. బ్యాంకులు తమ రోజువారీ కార్యకలాపాలు, పెట్టుబడుల ఖర్చులను తీర్చుకునేందుకు మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనలను అమలు చేస్తాయి. ఈ పరిమితి కంటే తక్కువ నిల్వ ఉంచిన ఖాతాదారులపై జరిమానాలు వేస్తుంటాయి. ఐసీఐసీఐ బ్యాంకు కూడా ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధన అమలులోకి వచ్చిన తర్వాత సవరించిన ఫీజు చార్ట్ ప్రకారం జరిమానాలు విధించనుంది.





