ఇంత జరిగినా సమావేశంలో ఎట్టి తుది నిర్ణయం తీసుకోకనే వాయిదా పడింది. గత ఏడెనిమిది ఏళ్లు గా ఇలాంటి సమావేశాలు ఎన్నో జరిగాయి. ఇది మొదటిది కాదు. ఆఖరుదీ కాబోదు. అయితే ఈ సమావేశంతో రెండు అంశాలకు స్పష్టత వచ్చింది. తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య పోరు తీవ్రతరం చేసింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన బనకచర్ల అనుసంధానం అమలు కనుచూపు మేర కన్పించలేదు.

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన బనకచర్ల అనుసంధానానికి చెక్ పెట్టేందుకే గోదావరి కావేరి అనుసంధానం ఇచ్చంపల్లి నుండి అంగీకరించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైకి చెబుతున్నా ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టేందుకు సిద్ధమైనది . ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మాణం జరిగితే దాని బ్యాక్ వాటర్ తో మేడిగడ్డ మినహాయించి కాళేశ్వరం ప్రాజెక్టు కొనసాగించాలనే ఆలోచన ఉందని భావింపబడుతోంది. అందుకే మేడిగడ్డ మరమ్మతులు చేయకుండా అట్టే పెడుతున్నదని బిఆర్ఎస్ నేతలు అనుమానిస్తున్నారు. ఫలితంగా బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముప్పేట దాడి మొదలు పెట్టింది. మోదీ ముందు మోకరిల్లినందున ఇచ్చంపల్లి నుండి అనుసంధానం అంగీకరించినట్లు ప్రచార దాడి తీవ్ర తరం చేసింది. అంతేకాదు. ఆలూ లేదు చూలూ లేదు.
కొడుకు పేరు సోమలింగడు అన్నట్లున్న బనకచర్ల అనుసంధానంతో గోదావరి కింద భాగంలో ఆంధ్ర ప్రదేశ్ నీళ్లు దోచుకు పోతే పై భాగంలో గోదావరి కావేరి అనుసంధానంతో తమిళ నాడుకు గోదావరి నీళ్లు పోతే తెలంగాణకు ఏమీ మిగలదని బిఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం మొదలు పెట్టింది. కాంగ్రెస్ తెలుగు దేశం బిజెపి పార్టీల కుట్రగా అభివర్ణించింది. ఈ దెబ్బతో తెలంగాణలో సరి కొత్త రాజకీయ పోరు మొదలు కానున్నది. ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీకి కాళేశ్వరం గుండె కాయ లాంటిది. దాని ప్రాభవం తగ్గించేందుకు వీలైనన్ని మార్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం తొక్కుతున్నది. తెలంగాణ ప్రభుత్వం కూడా బిఆర్ఎస్ పార్టీ ప్రచారం పట్టించుకోకుండా ఈ నెల 22 వ తేదీ జరిగిన నదుల అనుసంధానం టాస్క్ ఫోర్స్ కమిటీ సంప్రతింపులు సమావేశంలో రాష్ట్రానికి అనుకూలమైన షరతులతో ఇచ్చంపల్లి నుండి గోదావరి జలాలు తరలించేందుకు సుముఖత వెల్లడించింది. ఇక ఈ పోరు తారాస్థాయికి చేరినట్లే.
అదే సమయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపాదించిన బనకచర్ల అనుసంధానానికి ఈ సమావేశంలో అనుకూల వాతావరణం కనిపించ లేదు. కేంద్ర జల సంఘం ఛైర్మన్ అతుల్ జైన్ ఈ ప్రస్తావన తెచ్చినపుడు తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పైగా గోదావరి కావేరి అనుసంధానం బొల్లాపల్లి నుండి చేపట్టాలని ఆంధ్ర ప్రదేశ్ చేసిన ప్రతిపాదన సోదిలోనికి రాలేదు. ఈ ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి హయాం నుండి తిరస్కరింప బడుతోంది. హైదరాబాద్ లో జరిగిన సంప్రదింపులు సమావేశంలో కొన్ని ఆసక్తి కరమైన అంశాలు వెల్లడైనవి. ఇచ్చంపల్లి నుండి తరలించే నీళ్లలో 50 శాతం తమకు ఇవ్వాలని ఈ నీళ్లు ఎక్కడైనా వాడుకొనేందుకు తెలంగాణ అనుమతి కోరింది. ప్రధానంగా గోదావరి నదిపై 968 టియంసిలతో తాము చేపట్టిన అన్ని ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని కోరింది అయితే తెలంగాణ వైపు నుండి వచ్చిన షరతుల విషయంలో స్పష్టత లేకనే సమావేశం ముగిసింది.
ఇదిలా ఉండగా గోదావరి కావేరి అనుసంధానానికి తమ వాటా నీళ్లు ఇచ్చేది లేదని ఛత్తీస్గఢ్ తెగేసి చెప్పింది. అయినా ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర జల సంఘం ఛైర్మన్ అతుల్ జైన్ ఇచ్చిన సమాధానం ఆశ్చర్యకరంగా ఉంది, గోదావరి కావేరి అనుసంధానానికి గోదావరి జలాలు తరలించడం లేదంటూ తొలుత బుకాయించారు. ఏ మాత్రం ప్రతిపాదన లేని ఎప్పుడో వచ్చే గంగా జలాలు తరలించుతామని ఇప్పుడు తాత్కాలికంగా గోదావరి జలాలు తరలించుతామని చల్లగా అసలు విషయం బయట పెట్టారు. ఒక వైపు తమ వాటా ఇచ్చేది లేదని ఛత్తీస్గఢ్ చెబుతుంటే మిగిలి ఉన్న 148 టీఎంసీలు వచ్చే పదిహేను సంవత్సరాల వరకు ఛత్తీస్గఢ్ ఉపయోగించుకొనే అవకాశం లేనందున అప్పటి వరకు కావేరికి గోదావరి జలాలే తాత్కాలికంగా తరలిస్తామని చెప్పడమంటే ఎవరి చెవి లో పువ్వు పెట్టడానికి. అంతేకాదు. ఒక వేళ ఛత్తీస్ ఘడ్ ఈ లోపు తన వాటా నీళ్లు ఉపయోగించుకొంటే తరలింపు నిలుపుదల చేస్తామని అతుల్ జైన్ చెప్పడం మరో విశేషం.
వాస్తవంలో జాతీయ జల అభివృద్ధి సంస్థ ప్రతి పాదించిన తొమ్మిది అనుసంధానాల్లో మహానది కావేరి అనుసంధానం తొలిది. ఇప్పుడు మహానది పోయి ఇంత వరకు ప్రతి పాదనల్లోనే లేని గంగ నది అనుసంధానం తెర మీదకు తెచ్చారు. నెహ్రూ హయాంలో స్వర్గీయ డాక్టర్ కె. యల్. రావు ఈ ప్రతిపాదన చేశారు. తుదకు ఆచరణ యోగ్యం కాదని విరమించుకున్నారు. తిరిగి ఇప్పుడు కొత్తగా ఈ పథకం తెర మీద తెచ్చారు. తెలంగాణలో సమ్మక్క బ్యారేజీ ఆంధ్రప్రదేశ్ లో పోలవరం రిజర్వాయర్ల ముంపు గురించి ఎగువ రాష్ట్రాలు నేడు పెద్ద రచ్చ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో గంగా జలాలు గోదావరికి తేవడం సాధ్యమేనా? తాత్కాలికంగా సమస్య పరిష్కారానికి ఏదో ఒకటి చెప్పడంగా భావించాలి.
కొసమెరుపు ఏమంటే దిగువ గోదావరి నుండి కావేరికి నీళ్లు తరలిస్తుంటే ఎక్కడో ఎగువన ఉన్న మహారాష్ట్ర తమకూ ఎక్కువ వాటా ఇవ్వాలని కోరడమే. 41 టియంసిలతో తాము నిర్మిస్తున్న ప్రాజెక్టును ఈ లింక్ లో చేర్చాలని కోరింది. కర్ణాటక కూడా 40 టియంసిలకు టెండర్ పెట్టింది. తుంగభద్ర పూడికతో నష్టపోతున్నామని కోరింది. ఇంత జరిగినా సమావేశంలో ఎట్టి తుది నిర్ణయం తీసుకోకనే వాయిదా పడింది. గత ఏడెనిమిది ఏళ్లు గా ఇలాంటి సమావేశాలు ఎన్నో జరిగాయి. ఇది మొదటిది కాదు. ఆఖరుదీ కాబోదు. అయితే ఈ సమావేశంతో రెండు అంశాలకు స్పష్టత వచ్చింది. తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య పోరు తీవ్రతరం చేసింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన బనకచర్ల అనుసంధానం అమలు కనుచూపు మేర కన్పించలేదు.





