ఇంటర్‌ ‌పరీక్షలు ప్రారంభం

–  క్షుణ్ణంగా త‌నిఖీ చేసి పంపిన అధికారులు
– ఐదు నిమిషాలు దాటితే అనుమ‌తించ‌ని అధికారులు
– ఆల‌స్యంతో కొన్నిచోట్ల ప‌రీక్ష రాయ‌లేక‌పోయిన విద్యార్థులు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్రవరి 25: రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ ‌పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ఫస్టియర్‌ ‌పరీక్షలు ప్రారంభం కాగా విద్యార్థులు త‌మ‌కు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు ఉదయాన్నే చేరుకున్నారు. పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులను సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గురువారం నుంచి సెండియర్‌ ‌పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంటర్‌ ‌పరీక్షల కోసం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 1,495 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండు సంవ‌త్స‌రాల విద్యార్థులు మొత్తం 9.97 లక్షల మంది పరీక్షలకు హాజరవుతున్నారు. వెబ్‌సైట్‌ ‌నుంచి డౌన్‌లోడ్‌ ‌చేసుకున్న హాల్‌టికెట్లను కూడా పరీక్షకు అనుమతిస్తారు. హాల్‌టికెట్‌పై ప్రిన్సిపాల్‌ ‌సంతకం లేకపోయినా ఎంట్రీ ఉంటుంది. ఒక్క హాల్‌టికెట్‌ ‌వెంట ఉంటే సరిపోతుంది. ఎలాంటి గుర్తింపు పత్రాలు అవసరంలేదు. తాజాగా సమాధాన పత్రాల మూల్యాంకనం షెడ్యూల్‌ను ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. మార్చి 4 నుంచి సంస్కృతం పేపర్ మూల్యాంకనం ప్రారంభమవుతుంది. 15నుంచి మొదటి విడత, 18నుంచి రెండో విడత, 20 నుంచి మూడో విడత మూల్యాంకనం ప్రారంభమవుతుంది. ఏప్రిల్‌ ‌రెండో వారంలో ఫలితాలు విడుదల చేస్తారు.

17 నిమిషాలు ఆలస్యం .. అనుమతించని అధికారులు

రాజన్నసిరిసిల్ల: పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వ‌చ్చిన‌ విద్యార్థినిని పరీక్ష రాసేందుకు అధికారులు అనుమతించలేదు. తన తండ్రి డ్రాప్‌ ‌చేస్తాడేమోనని ఎదురుచూసి చూసి చివరకు ఆర్టీసీ బస్సులో రాగా 17 నిమిషాలు ఆలస్యం అయింది. ఈ క్రమంలో అధికారులు పరీక్షకు అనుమతించకపోవడంతో గేటు వద్ద విద్యార్థిని కన్నీళ్లు పెట్టుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఈ సంఘటన చోటుచేసుకుంది. గొల్లపల్లికి చెందిన పిట్ల శరణ్య గొల్లపల్లి-బొప్పాపూర్‌ ‌రాచర్ల జూనియర్‌ ‌కళాశాలలో ఇంటర్‌‌ ‌ప్రథమ సంవత్సరం చదువుతున్నది. బుధవారం పరీక్షలు ప్రారంభం కావడంతో ఎగ్జామ్‌ ‌సెంటర్‌ అయిన‌ ఎల్లారెడ్డిపేటలోని ప్రభుత్వ జూనియర్‌ ‌కాలేజీ దగ్గర దించుతానని ఆమె తండ్రి చెప్పాడు. అయితే పని చూసుకుని టైమ్‌ ‌వరకు వస్తానని వెళ్లిన తండ్రి ఎంతసేపటికీ రాకపోవడంతో బస్టాండ్‌కు వెళ్లి ఆర్టీసీ బస్సు ఎక్కి సెంటర్‌కు చేరుకుంది. కానీ అప్పటికే 9.05 గంటలు దాటిపోవడంతో అధికారులు శరణ్యను సెంటర్‌లోనికి అనుమతించలేదు. దీనిపై శరణ్య కాలేజీ సిబ్బందిని, ఉన్నతాధికారులను సంప్రదించింది. ఈ క్రమంలో తహసీల్దార్‌ ‌సుజాత ఎగ్జామ్‌ ‌సెంటర్‌కు చేరుకుని సీసీ కెమెరాలను పరిశీలించారు. శరణ్య 17 నిమిషాలు ఆలస్యంగా వచ్చినట్లు నిర్దారించారు. దీంతో ఆమెను పరీక్షకు అనుమతించలేదు. తమ భవిష్యత్తుకు సంబంధించిన పరీక్షలు రాసేటప్పుడు కచ్చితంగా సమయపాలన పాటించాలని తహసీల్దార్‌ ‌సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *