గండ్ర వెంకటరమణా రెడ్డే హత్య చేయించాడని మృతుడి భార్య ఆరోపణలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : జయశంకర్ భూపాలపల్లిలో సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య తీవ్ర కలకలం రేపుతోంది. లింగమూర్తి హత్య ఘటనను తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ హత్యపై సీబీసీఐడీ ఎంక్వైరీ వేయాలని నిర్ణయించింది. మేడిగడ్డ అవినీతిపై పోరాడుతున్నందుకే లింగమూర్తిని హత్య చేసారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన అనుచరులే రాజలింగమూర్తిని చంపారని మృతుడి భార్య, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే తన అనుచరుల ద్వారా నడిరోడ్డు మీద తన భర్తను హత్య చేయించారన్న రాజలింగమూర్తి భార్య సరళ ఆరోపించారు.
అన్నీ ఆపేస్తే రూ.10 లక్షలు ఇస్తామని గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారని తెలిపారు. మేడిగడ్డ కేసు గెలుస్తామని అక్కస్సుతో తన భర్తను దారుణంగా హత్య చేయించారని అన్నారు. కొత్త హరిబాబు రేణిగుంట్ల సంజీవ్ బుర్ర చంద్రయ్య, బుర్ర కొమురయ్య రేనిగుంట్ల కొమురయ్య మరికొంతమంది కలిసి హత్య చేశారని సరళ ఆరోపించారు. ఇప్పటికే భూపాలపల్లి ప్రభుత్వ హాస్పిటల్ వద్దకు రాజలింగమూర్తి బంధువులు చేరుకున్నారు. కాగా… బైక్‌పై వెళ్తున్న రాజలింగమూర్తిని ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి హత్య చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై గతంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావుపై లింగమూర్తి కేసు వేశారు. ఆ ఫిర్యాదుతో కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావుతో పాటు ఐదుగురిపై కేసు నమోదయ్యింది. దీంతో పాటు భూపాలపల్లిలో వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణంపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పై రాజలింగమూర్తి కేసు వేశారు.
రాజలింగమూర్తి హత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తు : డీఎస్పీ
రాజలింగమూర్తి హత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ సంపత్‌రావు తెలిపారు. ఈ హత్య కేసులో ఇంకా ఎవరిని కస్టడీలోకి తీసుకోలేదని చెప్పారు. ‘హత్య వెనుక ఎవరు ఉన్నా వదిలిపెట్టం. మృతుని భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశాం. రాజలింగమూర్తితో హంతకులకు భూతగాదాలు ఉన్నాయి. హత్యకు ఇతర కారణాల కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నాం‘అని డీఎస్పీ వెల్లడించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి భారాస ప్రభుత్వమే కారణమంటూ కేసు వేసిన రాజలింగమూర్తి (47) హత్యకు గురయ్యారు. ఈ హత్యపై తెలంగాణ సీఎం కార్యాలయం (సీఎంవో) ఆరా తీసిన విషయం తెలిసిందే.





