ఐఏఎస్‌లు పాఠశాలలు సందర్శించాలి

– విద్యార్థుల సంఖ్యకనుగుణంగా వసతులు
– పాఠశాలల్లో సోలార్‌ కిచెన్లు ఏర్పాటు చేయాలి
– పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరూ ఇంటర్‌లో చేరేలా చూడాలి
– విద్యా శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 25: రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు వారంలో కనీసం రెండు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాలని సూచించారు. విద్యా శాఖపై ఐసీసీసీలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 48 వేల మంది చేరారని అధికారులు సీఎంకు వివరించారు. పెరిగిన విద్యార్థుల సంఖ్యకనుగుణంగా నూతన గదులు నిర్మించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు అవసరమైన వసతులను పాఠశాలల్లో కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్యాస్‌, కట్టెల పొయ్యిల బాధల నుంచి మధ్యాహ్న భోజనం తయారు చేసే మహిళలకు విముక్తి కల్పించాలని, సోలార్‌ కిచెన్లు ఏర్పాటుపై తక్షణమే దృష్టి సారించాలని ఆదేశించారు. పదో తరగతిలో ఉత్తీర్ణులవుతున్న విద్యార్థుల సంఖ్యకు, ఇంటర్మీడియట్‌లో నమోదవుతున్న విద్యార్థుల సంఖ్యకు మధ్య వ్యత్యాసం ఉండడంపై ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించారు. టెన్త్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులంతా కచ్చితంగా ఇంటర్మీడియట్‌లో చేరేలా చూడాలని సూచించారు. ఇంటర్మీడియట్‌ అనంతరం జీవనోపాధికి అవసరమైన స్కిల్డ్‌ కోర్సుల్లో శిక్షణ పొందవచ్చని, తద్వారా వారి జీవితానికి ఢోకా ఉండదని సీఎం అభిప్రాయపడ్డారు. సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్‌ రెడ్డి, విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌ ఏ.శ్రీదేవసేన, విద్యా శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎం.హరిత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *