– కంటికి కనిపించని కుట్రలెన్నో చేశారు
– బండి రాజకీయం ముందు అవి పటాపంచలు
– కొందరు ఇది రాజకీయం అని హేళన చేశారు
– మీ మధ్య జరిగిన చీకటి ఒప్పందాలేమిటి?
– 6 గ్యారంటీల అమలుపై పోరాడుతూనే ఉంటాం
– కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16: కరీంనగర్ కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగరేయాలనే కార్యకర్తల కల నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. నూతన మేయర్, డిప్యూటీ మేయర్లకు అభినందనలు తెలిపారు. మరోవైపు సీఎం రేవంత్ సహా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలపై నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి గారూ.. మెజారిటీ సీట్లను సాధించిన బీజేపీకి మేయర్, డిప్యూటీ మేయర్ పదవి దక్కకుండా మంత్రులు, బీఆర్ఎస్, ఎంఐఎంతో కలిసి మీరు చేయని కుట్రలు లేవు.. అయినా బండి సంజయ్ రాజకీయం ముందు, బీజేపీ సైనికుల పోరాట పటిమ ముందు మీ కుట్రలన్నీ పటాపంచులైనయ్. క్రికెట్లో ఇండియాపై పాకిస్తాన్ ఘన విజయం సాధించినట్లుగానే కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల కబడ్డీ ఆటలో మీ అందరినీ ఓడించి బీజేపీ కప్ గెలుకుంది అని వ్యాఖ్యానించారు. ఈ వేదికగా చెబుతున్నా మీరు అనవసరంగా, అప్రజాస్వామికంగా నన్ను కెలికి ఆట మొదలుపెట్టారు. మీ ఆటకు నేను ముగింపు ఇస్తా అని అల్టిమేటం ఇచ్చారు. కరీంనగర్లో సోమవారం జరిగిన కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక అనంతరం నూతన మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్‌రావు, కార్పొరేటర్లతో కలిసి మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డితోపాటు ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ గెలిచింది 14 సీట్లు, ఎంఐఎం గెలిచింది 3 సీట్లు, బీఆర్ఎస్ గెలిచింది 9 సీట్లు.. అన్నీ కలుపుకున్నా 26 సీట్లు మాత్రమే. మ్యాజిక్ ఫిగర్ దాటనే లేదు. తెలిసీ బీజేపీని అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేశారు.. మీ చీకటి ఒప్పందాలేమిటి.. ప్రజాస్యామ్యాన్ని అపహాస్యం చేసేలా ఫాంహౌస్ వేదికగా ఎందుకు కుట్రలు చేశారు? అని ఆయన ప్రశ్నించారు. రెండ్రోజులుగా జరుగుతున్న కుట్రలను చూసి ప్రజలే విస్తుపోయారని, ఇన్ని కుట్రలు, కుతంత్రాలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలనుకుంటున్నారా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు. కరీంనగర్ కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగరేయాలని ఎన్నో ఏళ్లుగా కల కన్నం. ఆ కల సాకారమైన ఈరోజు చాలా సంతోషంగా ఉందన్నారు.
రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తుందనే భయంతో..
రాష్ట్రంలో అధికార మార్పిడి జరగాలన్నా, తెలంగాణ వచ్చినా కరీంనగర్ వేదికగా మార్పు మొదలైన సంగతి తెలిసిందేనన్నారు. కరీంనగర్ మేయర్ పదవిని బీజేపీ కైవసం చేసుకుంటే రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమనే భయంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్‌లు ఒక్కటై కుట్ర చేశాయన్నారు. కానీ ప్రజల సహకారం, అమ్మవారి ఆశీస్సులతో ఆ కుట్రలన్నీ భగ్నం చేశామని సంజయ్ చెప్పారు. 2005లొ ఇదే రోజున తాను కార్పొరేటర్‌గా తొలిసారి ఎన్నికైనప్పుడు ఎంతో సంతోషపడ్డా. మళ్లీ ఈరోజు కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని బీజేపీని దక్కించుకుని మేయర్‌గా కొలగాని, డిప్యూటీ మేయర్‌గా సునీల్ రావు ఎన్నిక కావడం అంతకంటే ఎక్కువ సంతోషంగా ఉందన్నారు. కార్పొరేషన్లో అవినీతికి తావు లేకుండా ప్రజలకు అండగా ఉంటూ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ, అమిత్ షాను కలిసి కరీంనగర్‌కు అత్యధిక నిధులు తెచ్చి అబివృద్ధి చేసేందుకు యత్నిస్తా అని చెప్పారు. తాను నమ్ముకున్న అమ్మవారి ఆశీస్సులు, ఎములాడ రాజన్న, కొండగట్టు అంజన్న, పాత బస్తీ భాగ్యలక్ష్మి అమ్మవార్ల దీవెనలతో తమపై జరిగిన కుట్రలను అధిగమించినం అన్నారు.
కాంగ్రెస్‌కు ఛాలెంజ్
కాంగ్రెస్‌కు ఛాలెంజ్ విసురుతున్నా.. ఎక్కడికక్కడ 6 గ్యారంటీలను అమలు చేసేదాకా మీ మెడలు వంచుతాం.. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పతనానికి ముగింపు పలుకుతాం.. అందుకు కరీంనగరే వేదిక కాబోతోంది.. అని స్పష్టం చేశారు. మేయర్ ఎన్నికలో ఎలాంటి కుట్ర లేదని, కాంగ్రెస్‌కు సంబంధం లేదని ముఖ్యమంత్రి చెప్పే దుమ్ముందా అని బండి నిలదీశారు. మీ కుట్ర ఉందని నేను నిరూపిస్తానన్నారు. కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, డీకే అరుణ సహా బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎంతో సహకారం అందించారని, ముఖ్యంగా ఇతర జిల్లాల నుండి కార్యకర్తలు వచ్చి కరీంనగర్లో బీజేపీ గెలుపు కోసం కష్టపడి పనిచేసిన తీరు అభినందనీయమని ఆయన అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే