వ్యక్తిగా వెళుతున్నా..శక్తిగా తిరిగొస్తా

– బీఆర్‌ఎస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు
– ప్రశ్నిస్తే కారణం లేకుండా బయటకు పంపారు
– హరీష్‌ ‌రావు అవినీతికి అంతే లేదు
– సిద్దిపేట తదితర కలెక్టరేట్లు ఒక్క వానకే కూలాయి
– కింది నాయకుల దురాగతాలను పట్టించుకోని కెసిఆర్‌
– ఇదే నాచివరి ప్రసంగం అంటూ మండలిలో కన్నీరు
– కొత్త రాజకీయ వేదిక రాబోతోందంటూ పార్టీపై కవిత వెల్లడి

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 5: బీఆర్‌ఎస్‌ ‌పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌పై కక్షతో బీజేపీ త‌న‌ను జైలులో పెట్టించిందని ఆరోపించారు. శాసనమండలిలో ఇదే తన చివరి ప్రసంగం అంటూ మాట్లాడారు. ఒక వ్యక్తిగా బయటకు వెళ్తున్నానని.. బలమైన శక్తిగా మళ్లీ చట్ట సభల్లోకి వస్తానంటూ శపథం చేశారు. తన రాజీనామాను ఆమోదించాలంటూ మండలి ఛైర్మన్‌కు కవిత విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్‌ 3‌న ఛైర్మన్‌ ‌ఫార్మాట్‌లో రాజీనామా చేశానని తెలిపారు. శాసనమండలి సమావేశాలకు కవిత సోమవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇదే తన చివరి ప్రసంగం అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఇదే సమయంలో తన రాజకీయ భవిష్యత్‌పై, తాను ఎదుర్కొన్న పరిస్థితులపై, బీఆర్‌ఎస్‌ ‌పార్టీపై హాట్‌ ‌కామెంట్స్ ‌చేశారు. బీఆర్‌ఎస్‌ ‌పై ఊహించని రీతిలో విరుచుకుపడ్డారు కవిత. తన కింద నాయకులు చేస్తోన్న దురాగతాలను కేసీఆర్‌ ‌గమనించడం లేదన్నారు. టీఆర్‌ఎస్‌ ‌పేరును బీఆర్‌ఎస్‌గా మార్చటాన్ని తాను అంగీకరించలేదన్నారు. తెలంగాణలో ఏం సాధించిందని.. బీఆర్‌ఎస్‌ ‌జాతీయ రాజకీయాలకు వెళ్లిందంటూ తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.

బీజేపీ తనను జైలుకు పంపితే త‌మ పార్టీ నాయకులు తనకు అండగా నిలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒంటరిగా మూడేళ్లు ఈడీతో పోరాటం చేశానన్నారు. పార్టీ అధినేత కేసీఆర్‌ను విమర్శిస్తే పెద్ద నాయకులు ఎందుకు మాట్లాడటం లేదంటూ కవిత సూటిగా ప్రశ్నించారు. కేసీఆర్‌ను కాపాడుకోలేని పార్టీ ఉంటే ఎంత? పోతే ఎంత? అని అన్నారు. హరీష్‌ ‌రావు అవినీతి పరుడంటూ కవిత ఉద్ఘాటించారు. బీఆర్‌ఎస్‌ ‌రాజ్యాంగం పెద్ద జోక్‌ అని సెటైర్లు వేశారు. పార్టీ నడిపే పద్ధతి ఇది కాదని, నైతికత లేని పార్టీ బీఆర్‌ఎస్‌ అం‌టూ దుమ్మెత్తిపోశారు. కనీసం సంజాయిషీ కూడా అడగకుండా తనను సస్పెండ్‌ ‌చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ’తన ఇద్దరి కొడుకుల మీద ఒట్టు వేసి చెప్తోన్న.. బీఆర్‌ఎస్‌తో నాది ఆస్తుల పంచాయితీ కాదు.. ఆత్మగౌరవ పంచాయితీ’ అని కవిత స్పష్టం చేశారు. ’ప్రశ్నిస్తే బీఆర్‌ఎస్‌లోని కొందరు తనపై కక్ష కట్టారు. బీఆర్‌ఎస్‌ ‌పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. పదవుల కోసం బీఆర్‌ఎస్‌ ‌పార్టీలోకి పోలేదు. పార్టీలో, ప్రభుత్వంలో అవినీతిని ప్రశ్నించాను. సిద్దిపేట, సిరిసిల్లలో కట్టిన కలెక్టరేట్లు ఒక్క వర్షానికే మునిగిపోయాయి. ఉద్యమకారులకు ఆర్థికసాయం చేద్దామంటే నా మాట వినలేదు. ఇసుక దందాల కోసమే నేరెళ్ళ దురాగతం జరిగింది. తెలంగాణ వొచ్చాక కూడా బోధన్‌ ‌షుగర్‌ ‌ఫ్యాక్టరీ తెరవకపోవటం అవమానకరం. సొంత సంస్థ జాగృతి ద్వారా ఉద్యమంలో పనిచేసి గుర్తింపు సంపాదించుకున్నాను. కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్‌ ‌విలీనం కావాల్సిన పరిస్థితి ఉంది. ఉద్యమకారుల మాటలు కేసీఆర్‌కు చేరనివ్వటం లేదు. నిజామాబాద్‌ ఎం‌పీ టికెట్‌ ‌కోసం అడుక్కోలేదు. ఉద్యమంలో పార్టీలకతీతంగా కష్టపడ్డాను. తెలంగాణ జాగృతి సంస్థతో రాజకీయాల్లోకి వచ్చాను. బతుకమ్మ పండుగను ముందుకు తీసుకెళ్ళాను. నీళ్ళ విషంలో గత పాలకులు చేసిన‌ తప్పునే ప్రస్తుత పాలకులు చేస్తున్నారు’ అంటూ ఘాటైన విమ‌ర్శ‌లు చేశారు.

ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ నిర్వహించామని.. ఆ తర్వాత నుంచి తనపై ఆంక్షలు మొదలయ్యాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. వ్యక్తి స్వేచ్ఛను ఎలా హరిస్తారనే బాధ, ఆవేదనతో ఈ మాటలు చెబుతున్నట్లు తెలిపారు. శాసన మండలిలో ఆమె మాట్లాడుతూ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. పార్టీ, ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రశ్నించా. అమరువీరుల స్తూపం మొదలు కలెక్టరేట్ల వరకు అన్ని నిర్మాణాల్లోనూ అవినీతి జరిగింది. ఒక్క వర్షానికే సిద్దిపేటలో కలెక్టరేట్‌ ‌కొట్టుకుపోయింది. తెలంగాణ ఉద్యమకారులకు పింఛను ఇవ్వాలని పార్టీలో కోరాను. అమరవీరులను బీఆర్‌ఎస్‌ ఎప్పు‌డూ గుర్తించలేదు. నీళ్లు, నిధులు, నియామకాలనూ పట్టించుకోలేదు. బోధన్‌ ‌షుగర్‌ ‌ఫ్యాక్టరీని తెరిపించాలని ఎన్నోసార్లు అడిగాను. ఆ పరిశ్రమ తెరిపించలేకపోవడం నాకు అవమానకరం. కేసీఆర్‌ను అడిగే ధైర్యం నాకే ఉందని ఎన్నో విషయాలు అడిగా. కాళేశ్వరం విషయంలో ఆయనపై వొచ్చిన ఆరోపణలపై పార్టీలో ఉన్న ఒక్క పెద్ద నాయకుడు కూడా మాట్లాడలేదు. అందుకే ప్రెస్‌‌ట్‌ ‌పెట్టి బలంగా మాట్లాడాను. అవినీతిపరుల పేరు చెప్పాను‘అని కవిత అన్నారు. ఈ క్రమంలో కవిత కీలక ప్రకటన చేశారు.  రాష్ట్రంలో కొత్త రాజకీయ వేదిక రాబోతోందని చెప్పారు. రాజకీయ పార్టీగా తెలంగాణ జాగృతి మారుతుందని ఆమె ప్రకటించారు. ‘ఉద్యమ ద్రోహులకు బీఆర్‌ఎస్‌ ‌రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది. రాష్ట్రంలో ఓ కొత్త రాజకీయ వేదిక రాబోతోంది. విద్యార్థులు, నిరుద్యోగులు, అన్నివర్గాల కోసం పనిచేస్తా. అవమానభారంతో పుట్టింటి నుంచి అన్ని బంధనాలు తెంచుకుని కోసం వస్తున్నా.. ఆశీర్వదించండి. తెలంగాణ జాగృతి.. రాజకీయ పార్టీగా మారుతుంది. వొచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాం. కచ్చితంగా గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతా. వ్యక్తిగా సభ నుంచి వెళ్తున్నా.. రాజకీయ శక్తిగా తిరిగివొస్తా’ అని కవిత వ్యాఖ్యానించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *