– ఆవేశంతో చేశాను తప్ప వేరే ఉద్దేశం లేదు
– సికింద్రాబాద్‌పై రాజీ లేని పోరాటం చేస్తాం
– 17న శాంతి ర్యాలీ చేపడున్నట్లు ప్రకటన
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 13: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ సికింద్రాబాద్‌ను ముక్కలు ముక్కలుగా చేస్తే ముక్కలుగా చేస్తా అనే మాటల్లో ఆవేశం తప్ప వేరే ఉద్దేశం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలని వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారంటే తనకు గౌరవం ఉందని ఆయన తెలిపారు. తమ ప్రాంతాన్ని కాపాడుకోవడం తప్ప వేరే ఉద్దేశం లేదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలుసుకోవాలని సూచించారు. 220ఏళ్ల చరిత్ర గల సికింద్రాబాద్ ఇమేజ్‌ను దెబ్బతీసే కుట్రలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం పోరాటం చేస్తున్నామని వివరించారు. సికింద్రాబాద్‌ను ప్రత్యేక కార్పొరేషన్‌గా ప్రకటించి తీరాల్సిందేనని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. ఈ అంశంపై నిరసనగా ఈ నెల 17న భారీ శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ ర్యాలీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమై క్లాక్ టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్ మీదుగా ఎంజీ రోడ్‌లోని గాంధీ విగ్రహం వరకు సాగుతుందని వెల్లడించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి సికింద్రాబాద్ ప్రత్యేక కార్పొరేషన్ ప్రకటన సాధించేందుకు ఈ ర్యాలీ నిర్వహించనున్నట్లు తలసాని స్పష్టం చేశారు. సికింద్రాబాద్‌ను ముట్టుకోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని, కానీ సికింద్రాబాద్‌లోని పలు పోలీస్ స్టేషన్లు మల్కాజిగిరి జోన్లో కలిపింది వాస్తవం కాదా అని తలసాని ప్రశ్నించారు. అలాగే సికింద్రాబాద్ పరిధిలోని పలు డివిజన్‌లను మల్కాజిగిరి జోన్ పరిధిలోని బోయిన్ పల్లి సర్కిల్‌లో చేర్చారని ఆరోపించారు. సికింద్రాబాద్ జీహెచ్‌ఎంసీలోనే ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ప్రజలను మభ్యపెట్టడానికే అంటూ విమర్శించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



