వ‌ర‌ద‌లో కొట్టుకుపోతున్న యువ‌కుడిని కాపాడిన హైడ్రా

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 13: పాత‌బ‌స్తీలోని యాకుత్‌పురా రైల్వే స్టేష‌న్ ద‌గ్గ‌ర‌లోని వ‌ర‌ద కాలువ‌లో కొట్టుకుపోతున్న ఓ యువ‌కుడిని హైడ్రా సిబ్బంది బుధ‌వారం కాపాడింది. ఆ ప‌రిస‌రాల్లో ప‌ని చేస్తున్న హైడ్రా సిబ్బందికి స‌మాచారం అంద‌గానే.. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ప్రారంభించింది. కాలువ‌లోకి దిగ‌డానికి ఏమాత్రం అవ‌కాశం లేని ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితుల్లో నిచ్చెన కింద‌కు వేసి దాని ద్వ‌రా యువ‌కుడిని కాపాడింది. మేక‌ల మేత‌ కోసం చెట్టు కొమ్మ‌ల‌ను తీసుకువ‌చ్చేందుకు స్థానికంగా నివాస‌ముండే గౌస్‌(35) ప్ర‌య‌త్నించాడు. ప్ర‌మాద‌వ‌సాత్తు వ‌ర‌ద కాలువ‌లోకి జారాడు. ఆయ‌న‌ను చూసిన వారు వెంట‌నే 100 మీట‌ర్ల దూరంలో క‌చ్చా మోరీల్లో చెత్త‌ను తొల‌గించే ప‌నిలో ఉన్న హైడ్రా సిబ్బందికి స‌మాచారం ఇచ్చారు. హైడ్రా ఇన్‌స్పెక్ట‌ర్ బాల‌గోపాల్ హుటాహుటిన సిబ్బందితో అక్క‌డ‌కు చేరుకుని గౌస్‌ను కాపాడారు. రెయిన్ బ‌జార్ కార్పొరేట‌ర్ వ‌సీతో పాటు హైడ్రా సిబ్బంది వంశీ, బాల‌రాజు త‌దిత‌రులు యువ‌కుడిని కాపాడిన‌ వారిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *